ఉద్యమ లక్ష్యాల సాధన కోసమే  ప్రజా సంగ్రామ యాత్ర

ఉద్యమ లక్ష్యాల సాధన కోసమే  ప్రజా సంగ్రామ యాత్ర

తెలంగాణ వనరులు ముఖ్యంగా నీరు, ఉద్యోగాలు, భూమి, ఖనిజాలు ఈ ప్రాంత ప్రజలకే దక్కేలా చేయడానికి సుదీర్ఘకాలం పాటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం మహత్తర ఉద్యమాలు జరిగాయి. సకల జనులకు విద్య, ఉద్యోగాల కల్పనతో పాటు అభివృద్ధి ఫలాలు అందేలా చేయడానికి వేలాది మంది బలిదానాలు చేయవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో అనేక మంది అనేక విధాలుగా నష్టపోయారు. ఎందరో యువకులు చదువు, ఉద్యోగాలు కోల్పోయారు. ఇన్ని త్యాగాలతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకొని ఏడేండ్లు దాటింది. అయినా తెలంగాణ ప్రజలకు సొంత రాష్ట్రం ఏర్పరచుకున్నామన్న సంతోషం మాత్రం కలగడం లేదు. దశాబ్దాల తరబడి గురైన దోపిడీ, అణచివేతల నుంచి విముక్తి కలిగినదన్న సంతోషం కూడా వారిలో కానరావడం లేదు. తెలంగాణ ఉద్యమంలో నిర్ణయాత్మక పాత్ర వహించి, ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో కీలక భూమిక వహించిన బీజేపీ ఇప్పుడు సొంత రాష్ట్రంలో ప్రజల సాధకబాధకాలపై కూడా దృష్టి సారించింది. అందుకోసమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శనివారం(ఆగస్టు 28) నుంచి ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’ చేపట్టారు. ఈ యాత్రలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను పలకరించి, వారి ఇబ్బందులు, సమస్యలు, కష్టాలను స్వయంగా తెలుసుకుంటారు. తమది ఉద్యమ పార్టీ అని చెప్పుకునే టీఆర్ఎస్ ప్రజల సెంటిమెంట్ ను ఆసరాగా చేసుకుని అధికారంలోకి వచ్చింది. కానీ ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఏ మేరకు దృష్టి సారిస్తున్నదో క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికే ఈ యాత్ర చేపట్టారు.
ఎన్నో హామీలు ఇచ్చి.. అన్నీ మరిచింది
2014, 2018 అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, పలు ఉపఎన్నికల సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి గురించి, ప్రజల వెతలు తీర్చడం గురించి కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇస్తూ వచ్చింది. వాటిని ఏమేరకు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారో ప్రజల నుంచే నేరుగా తెలుసుకునేందుకు బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారు. ఉద్యమంలో ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలు ఎలా ఉన్నాయో?, ఉద్యమంలో ఎన్నో కష్టనష్టాలకు గురైన వారిని ప్రభుత్వం ఏమైనా ఆదుకుందా?, ప్రభుత్వం అసలు ఉద్యమ లక్ష్యాలు నెరవేర్చడం గురించి పట్టించుకొంటుందా? అని కూడా ప్రజా క్షేత్రంలో తెలుసుకోనున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, గిరిజనులకు మూడెకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, కేజీ టు పీజీ ఉచిత విద్య, రైతు రుణమాఫీ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రతి ఇంటికి తాగునీరు.. వంటి ఎన్నో హామీల వర్షం కురిపించారు. అయితే ఇవన్నీ ఏ మేరకు అమలుకు నోచుకున్నాయో సంజయ్ ఈ యాత్రలో స్వయంగా తెలుసుకోవాలని భావిస్తున్నారు.
సబ్​ ప్లాన్​నిధులు మళ్లించిన్రు
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ చివరి రోజుల్లో ఆమోదించిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, ఆ నిధులను ఇతరత్రా పథకాలు, పనులకు ఈ ప్రభుత్వం మళ్లిస్తోంది. తద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు దారుణమైన నష్టం కలిగిస్తున్నది. ఆయా నిధులను కేవలం ఆయా వర్గాల అభ్యున్నతి కోసం మాత్రమే వినియోగించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తాం. అదే విధంగా పోడు భూములపై సాగు హక్కులు కల్పిస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా, సాగు చేసుకొంటున్న గిరిజనులపై దౌర్జన్యం చేస్తోంది. వారికి అండగా నిలబడుతున్న బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతోంది. ఇటువంటి దురహంకార పాలనను ప్రజలు సహించే పరిస్థితుల్లో లేరని హెచ్చరిస్తున్నాం.
ఉద్యోగ ఖాళీల భర్తీ ఊసే లేదు
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో రెండు లక్షలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగులు అందరి సర్వీసులనూ క్రమబద్ధం చేస్తామని కూడా ప్రకటించారు. వెంటనే లక్ష ఉద్యోగ నియామకాలు జరుపుతున్నట్లు వెల్లడించారు. అయితే ఏడేండ్లు గడచినా ఆ ఉద్యోగ నియామకాలు జరగనే లేదు. అందువల్ల తెలంగాణలోని నిరుద్యోగ యువతకు అండగా నిలబడి ఖాళీగా ఉన్న కొలువులను భర్తీ చేసే వరకు మా పోరాటం సాగిస్తాం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రకటించిన రైతు రుణ మాఫీ ఇంకా అమలుకు నోచుకోవడం లేదు. దళారుల దోపిడీ నుంచి రైతులకు రక్షణ లభించడం లేదు. రైతు బంధు పథకం అమలు సైతం సంపన్నులకే పరిమితం అవుతున్నది. ఇటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా రైతులకు బాసటగా పోరాటాలు జరుపుతాం.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే..
మతతత్వ మజ్లిస్ తో చేతులు కలిపిన కేసీఆర్ రాష్ట్రంలో జరుగుతున్న మతమార్పిడులు, గోహత్యలు, దేవాలయాలపై దాడుల విషయాన్ని పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ సిటీ ఉగ్రవాదులకు, మాదకద్రవ్యాల మాఫియాలకు స్థావరంగా మారుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కదలిక కనిపించడం లేదు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించిన కేసీఆర్.. చిన్న వర్షానికే రోడ్లపై నీటి నిల్వతో ప్రజాజీవనం అల్లకల్లోలం అవుతున్నా స్పందించడం లేదు. సంజయ్​ పాదయాత్ర సందర్భంగా వెలుగులోకి వచ్చిన ప్రజా సమస్యలు, ప్రజల అవసరాల ఆధారంగా 2023 అసెంబ్లీ ఎన్నికల నాటి బీజేపీ మేనిఫెస్టో ఉంటుంది. అధికారంలోకి రావడం ద్వారా తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు బీజేపీ నిజాయతీతో కృషి చేస్తుంది. తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి, ఉద్యమ సమయంలో వారు వ్యక్తం చేసిన ఆకాంక్షలను నెరవేర్చడానికి ఈ పాదయాత్ర ఒక మైలురాయి కాగలదని విశ్వసిస్తున్నాం.
అప్పులు తేవడంలో కేసీఆర్​ రికార్డులు సృష్టిస్తున్నరు
దేశం మొత్తం మీద సెక్రటేరియట్​కు రాకుండా ఇంటికో, ఫామ్​ హౌస్ కో పరిమితమైన ముఖ్యమంత్రి తెలంగాణకు మాత్రమే ఉండడం దురదృష్టకరం. మంత్రులకు, సీనియర్ అధికారులకు కూడా అందుబాటులో సీఎం ఉండని కారణంగా పరిపాలన కుంటుబడుతున్నది. మరోవైపు కుటుంబ పాలన, అంతులేని అవినీతితో సంపన్న, మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో నేడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వడమే కష్టంగా మారుతున్నది. అప్పుల్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. చివరకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు ఇస్తున్న నిధులను కూడా దారిమళ్లించి, ప్రజలకు ఆ పథకాల ప్రయోజనాలు పూర్తిగా అందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అక్రమ పాలనపై బీజేపీ నిరంతరం ప్రజాక్షేత్రంలో పోరాటాలు జరుపుతున్నది. అవినీతిపరులపై చట్టం కొరడా ఝుళిపించేలా కేంద్రం తగుచర్యలు తీసుకోవడానికి వెనకాడదు. తెలంగాణ ప్రజలకు స్వచ్ఛమైన, జనరంజకమైన పాలన అందించడం కోసం సంజయ్ జరుపుతున్న ప్రజా సంగ్రామ పాదయాత్ర కీలక భూమిక పోషిస్తుంది.
                                                                                      - డాక్టర్  గంగిడి మనోహర్  రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రజాసంగ్రామ యాత్ర ప్రముఖ్