పంజాబీ సింగర్ యశీందర్ కౌర్ కిడ్నాప్ కేసు విషాదాంతంగా ముగిసింది. లుధియానాలో కిడ్నాప్ అయినట్లు ప్రచారం జరిగిన కొన్ని రోజులకే.. యశీందర్ కౌర్ మృతదేహం పంజాబ్‌లోని నీలో కాలువలో గుర్తుపట్టలేని స్థితిలో కనిపించింది. ఈ పరిణామంతో.. పంజాబీ సంగీత పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.
29 ఏళ్ల వయసున్న ఈ సింగర్ మే 13 నుంచి కనిపించకుండా పోయింది. మే 19న మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఆమె మృతదేహం దొరికింది. ఆమె కుటుంబ సభ్యులు ఆ మృతదేహం తమ కుమార్తెనేనని నిర్ధారించారు. పోస్ట్‌మార్టం కోసం ఆమె మృతదేహాన్ని సమ్రాలాలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు.
అసలేమైంది..?
ఈ వారం మొదట్లో.. యశీందర్ కౌర్ సోదరుడు జోతిందర్ సింగ్ పోలీసులకు తన సోదరి కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఈ కేసు అప్పటికే కీలక మలుపు తీసుకుంది. అతని వాంగ్మూలం ఆధారంగా.. మే 15న మోగా నివాసి.. సుఖ అలియాస్ సుఖ్వీందర్ సింగ్, అతని సహచరుడు కరమ్‌జిత్ సింగ్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు ప్రకారం.. యశీందర్ కౌర్ మే 13వ తేదీ సాయంత్రం.. తన ఫోర్డ్ ఫిగో కారులో సరుకులు కొనడానికి ఇంటి నుంచి బయలుదేరింది. అయితే.. అప్పుడు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి వెళ్లలేదు. ఆమె ఫోన్ కలవలేదు. ఆమెను ఎక్కడ వెతికినా కనిపించలేదు.
►ALSO READ | ఫ్యాన్స్‌పై బాడీగార్డ్ ఓవరాక్షన్.. చేతులు జోడించి సారీ చెప్పిన స్టార్ హీరో !
దీంతో.. కుటుంబ సభ్యులు తమ కూతురిని కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానితుల పేర్లను కూడా చెప్పడంతో.. పోలీసులు ఈ కోణంలో దర్యా్ప్తు చేశారు. విచారణ సమయంలో.. మోగా జిల్లాలోని భలూర్ గ్రామానికి చెందిన సుఖ్వీందర్ సింగ్‌తో యశీందర్ కౌర్కు పరిచయం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడు తన సోదరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, అయితే ఆమె ఆ ప్రతిపాదనను తిరస్కరించిందని జోతిందర్ సింగ్ పేర్కొన్నాడు. నిందితుడు ఆమెపై కక్ష పెంచుకుని ఆమెను హత్య చేసి తిరిగి కెనడా పారిపోయాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
