బ్యాంకు మార్టిగేజ్ భూమికి ఫేక్ డాక్యుమెంట్లు

బ్యాంకు మార్టిగేజ్ భూమికి ఫేక్ డాక్యుమెంట్లు
  • ఆదిలాబాద్ టౌన్ లో కబ్జా చేసేందుకు రియల్టర్ల యత్నం
  • 10 మందిపై కేసు, ఇద్దరు ప్రధాన నిందితులు అరెస్టు

ఆదిలాబాద్, వెలుగు:  బ్యాంకులో తనఖా పెట్టిన భూమికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి, కబ్జాకు యత్నించిన కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను ఆదిలాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. మరో పది మందిపై కేసు నమోదు చేశారు. డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపిన ప్రకారం.. ఆదిలాబాద్ టౌన్ ఎస్ఐబీ బ్యాంకులో మార్టిగేజ్ చేసిన భూమి సర్వే నంబర్ 65/బి, 65/4 లోని 2.09 ఎకరాలకు కొందరు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి, కబ్జా చేస్తున్నారని ఈనెల 10న కలెక్టర్ కు బ్యాంకు ఎన్సీఎల్టీ ఆఫీసర్ దుమ్మటి సూర్య రామకృష్ణ ఫిర్యాదు చేశారు. 

దీంతో కలెక్టర్ ఎంక్వైరీ చేయించగా.. రియల్ వ్యాపారి రమేశ్ శర్మ కబ్జా చేసినట్టు తేలింది. దీంతో బ్యాంకు ఎన్సీఎల్టీ ఆఫీసర్ ఆదిలాబాద్ రూరల్ పోలీసుస్టేషన్ లో కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితులైన రియల్టర్లు రమేశ్ శర్మ, ఇబ్రహీం మహమ్మద్( మామ్లసేట్ )ను అరెస్టు చేశారు. వీరికి సహకరించిన సర్వేయర్ శివాజీ, రియల్ వ్యాపారులు యంత్రేనాథ్, హితేంద్రనాథ్, రాకేశ్ శర్మ, మనోజ్ కుమార్ అగర్వాల్, పూనం వ్యాస్, అనుపమ వ్యాస్ పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. 

ఇదీ జరిగింది..

మనోజ్ కుమార్ అగర్వాల్ 2.09 ఎకరాల భూమిని జీఎస్ ఆయిల్ మిల్స్ పేరుతో 2012లో ఎస్ బీఐలో తనఖా పెట్టి లోన్ తీసుకున్నాడు. అందులో 2.10 గుంటల భూమిని నలుగురికి అమ్మాడు. అదేవిధంగా డబుల్ రిజిస్ట్రేషన్ చేసి 2013లో పూనమ్ వ్యాస్ కు, 2014లో పూనం వ్యాస్ సెల్ డీడ్ ద్వారా అనుపమ వ్యాస్ కు అమ్ముకున్నారు. 2023లో రియల్టర్ రమేశ్ శర్మ, మరికొందరు కలిసి తహసీల్దార్ ఆఫీసు లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సర్వేయర్ ద్వారా 2.10 ఎకరాలకు పహాణి తీసుకున్నారు. 2024 నవంబర్18న రమేశ్ శర్మ కొడుకు రాకేశ్​శర్మ, మామ్ల సెట్, హితేంద్రనాథ్, యతేంద్రనాథ్ మరికొందరు కలిసి కబ్జా చేసేందుకు జేసీబీ, టిప్పర్లతో వెళ్లి చదును చేసేందుకు ప్రయత్నించారు. 

అయితే.. 2022లోనే మనోజ్ కుమార్ అగర్వాల్ తనఖాపెట్టిన భూమిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. ఆ భూమికి రిటైర్డ్ ఎస్ఐ రాములును సెక్యూరిటీగా నియమించారు. రియల్టర్లు కబ్జా చేసేందుకు వచ్చి రాములును చంపేస్తామంటూ బెదిరించడంతో భయంతో వెళ్లిపోయాడు. ఈ విషయం ఎన్సీఎల్టీ ఆఫీసర్ కు తెలియడంతో పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిధర్ విచారణ చేసి పదిమందిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితులు రమేశ్ శర్మ, ఇబ్రహీం మహమ్మద్ అలియాస్​ మామ్ల సేట్ ను అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ రెడ్డి తెలిపారు.