- సర్వే నంబర్138లోని 20 గుంటల స్థలంపై రెవెన్యూ, బల్దియా అధికారుల విచారణ
- కిబాలా ద్వారా కొన్నామంటున్న నిర్వాహకులు
- లీజ్ పేరుతో కాజేశారని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆరోపణలు
- రికార్డుల్లో కీలక ఫైళ్లు మిస్సింగ్ కావడంపై అనుమానాలు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని వివాదాస్పద స్థలంపై రెవెన్యూ, బల్దియా అధికారులు సంయుక్తంగా ఎంక్వైరీ ప్రారంభించారు. మంగళవారం సర్వే పూర్తి చేసిన అధికారులు.. సర్వే నంబర్‌లో 138లోని 20 గుంటలకు గానూ 22 గుంటలు ఉన్నట్లు తేల్చినట్లు సమాచారం.
ఒకవైపు కిబాల పత్రాల ఆధారంగా భూమిని బల్దియా నుంచే కొనుగోలు చేశామని నిర్వాహకులు చెబుతుండగా, మరోవైపు మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాత్రం భూమిని లీజ్‌కు తీసుకొని కాజేశారని ఆరోపించారు. కాగా భూమికి సంబంధించి పూర్వ రికార్డులు, యాజమాన్య పత్రాలు బల్దియాలో దొరకకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.
1952 నుంచి చేతులు మారిందిలా..
1946–47 సేత్వార్ రికార్డుల ప్రకారం జగిత్యాలలోని సర్వే నంబర్ 138లో 14.04 ఎకరాలు ఇనుములపల్లి నర్సింగరావు పేరిట నమోదైంది. 1952లో జగిత్యాల మున్సిపాలిటీ అవసరాల కోసం మున్సిపల్ జనరల్ ఫండ్‌తో ఆ భూమిని నర్సింగరావు నుంచి బల్దియా కొనుగోలు చేసింది. ఈ స్థలంలోనే పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సంబంధించి వ్యాపారి దారం వీరమల్లయ్యకు 20 గుంటలు కేటాయించినట్లు తెలుస్తోంది. 1953–54 కాస్రా పహానిలో ‘మున్సిపల్ లోకల్ ఫండ్’ను పట్టాదారుడిగా, దారం వీరమల్లయ్యను అనుభవదారుగా నమోదు చేశారు.
కానీ 1958-–59 పహానీలో మాత్రం వీరమల్లయ్య పేరు పట్టాదారుకాలంలోకి వచ్చింది. ఆ ఏడాది పహానిలో సర్వే నంబర్ 138ను రెండు డివిజన్లుగా చేశారు. 13.19 ఎకరాలను 138/అగా పేర్కొంటూ ‘మున్సిపల్ లోకల్ ఫండ్’ను యజమానిగా చూపారు. సర్వే నంబర్ 138/ఆ లో వీరమల్లయ్యను 25 గుంటల భూమికి పట్టాదారుడిగా చూపి, ఈ భూమి కిబాల పత్రం ద్వారా వచ్చినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత 1976–-77 పహానీలో వీరమల్లయ్య పేరిట 20 గుంటలు చూపించగా, అదే ఏడాది వీరమల్లయ్య వారసుల పేర్లు పట్టాదారు కాలంలోకి వచ్చాయి.
బల్దియాలో అసెస్మెంట్ రికార్డులు మిస్సింగ్
రోజురోజుకీ వివాదం పెద్దదవడంతో రెవెన్యూ, బల్దియా జాయింట్ సర్వే జరిపి ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. భూమి స్వాధీనం, యాజమాన్య హక్కులపై తేల్చేందుకు జిల్లా స్థాయిలో విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కమిటీ ఎంక్వైరీలో బల్దియా రికార్డుల్లో అసెస్మెంట్ రిజిస్టర్లకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లు మిస్ అయినట్లు తేలింది. బల్దియాలోని 1964కి చెందిన అసెస్మెంట్ రిజిస్టర్‌లో దారం వీరమల్లయ్య పేరు ఉండగా, 1955–60 రికార్డుల ప్రకారం దారం పురుషోత్తం, దారం నారాయణ పేర్ల మార్పిడి చేసినట్లు నమోదైంది.
కాగా అప్పటి మున్సిపల్ చట్ట ప్రకారం ఓనర్ షిప్‌ను ధ్రువీకరించేందుకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, కోర్టు డిక్రీ, పహాణీలు పొందుపరచాల్సి ఉండగా.. ఏ డాక్యుమెంట్ ఆధారంగా పేరు మార్పిడి చేశారో ఎక్కడా నమోదు కాలేదు. అలాగే 1959–60కి చెందిన అసెస్మెంట్ రికార్డులు మాయం కావడం ఆందోళన కలిగిస్తోంది. కిబాల పత్రం ఆధారంగా కూడా ఎక్కడా నమోదు లేకపోవడంతో వివాదాలకు తావిస్తోంది. 1960 తర్వాత దారం నారాయణ, దారం పురుషోత్తం పేర్లు 1992 వరకు రికార్డుల్లో ఉండగా, ఆ తర్వాత వీరి నుంచి వారసులకు విల్ డీడ్ ద్వారా పేరు మార్పిడి చేసినట్లు తెలుస్తోంది.
యాజమాన్యపు హక్కు కోసం కోర్టుకు బల్దియా?
వివాదాస్పద స్థలంపై ఎంక్వైరీ రిపోర్ట్‌ను రెవెన్యూ, బల్దియా అధికారుల బృందం మంగళవారం సమర్పించినట్లు సమాచారం. ఎంక్వైరీలో 1952లో కిబాల పత్రం ద్వారా స్థలం కొనుగోలు చేశామని వారసులు చెబుతుండగా, ఆ పత్రంలో 1958 జూలై తేదీ ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 1949లో నిజాం పాలన రద్దయి అదే ఏడాది ఇండియన్ స్టాంప్ చట్టం అమలులోకి వచ్చింది. అయినప్పటికీ నిజాం పాలనలో అమలయ్యే కిబాల పత్రం సమర్పించడంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
అంతేకాక, గతంలో కోర్టులో జిరాక్స్ పత్రాలను సమర్పించగా అసలు కిబాల ఒరిజినల్ పత్రం వారసుల వద్ద ఉందా అన్న అనుమానాలు ఉన్నాయి. 1952లో జగిత్యాల మున్సిపాలిటీ మున్సిపల్ జనరల్ ఫండ్‌తో 14.04 ఎకరాలను పట్టాదారుడు నర్సింగరావు నుంచి కొనుగోలు చేసినట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. దీని ఆధారంగా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు యాజమాన్యపు హక్కుపై కోర్టు మెట్లు ఎక్కడానికి బల్దియా అధికారులు ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పైగా 20 గుంటలకు గానూ అదనంగా మరో 2 గుంటలు కబ్జాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అంశాలపై జిల్లా యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
