
- పట్టా ఉండి పొజిషన్‌లో లేనోళ్లు, పొజిషన్‌లో ఉండి పట్టా లేనోళ్ల వివరాలు సేకరించండి: పొంగులేటి
- 5 నుంచి మరో28 మండలాల్లో భూభారతి
- పట్టణ ప్రాంతాల్లో కనీసం500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలనిఅధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు:ప్రభుత్వ భూముల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని కలెక్టర్లను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. అసైన్డ్ భూములకు సంబంధించి పట్టా ఉండి పొజిషన్‌లో లేనోళ్లు, పొజిషన్‌లో ఉండి పట్టా లేనోళ్ల వివరాలు సేకరించాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియెట్ నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నెల 17 నుంచి 30 వరకు 4 మండలాల్లో నిర్వహించిన భూభారతి పైలట్ ప్రాజెక్టు మాదిరిగానే ఈ నెల 5 నుంచి 20 వరకు జిల్లాకు ఒక్క మండలం చొప్పున 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు.
పైలట్ మండలాల్లో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 31 వరకు పరిష్కరించాలని ఆదేశించారు. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే అందుకు గల కారణాలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలని సూచించారు. 605 మండలాలకు గాను ఇప్పటి వరకు 590 మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించినట్టు తెలిపారు. వీటిల్లో 85,527 మంది సాధారణ పౌరులు, 1,62, 577 మంది రైతులు పాల్గొన్నారని చెప్పారు.
లబ్ధిదారుల ఎంపిక స్పీడప్ చేయండి..
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని కలెక్టర్లను పొంగులేటి ఆదేశించారు. ఇండ్ల నిర్మాణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనర్హులని తేలితే ఇండ్ల నిర్మాణం మధ్యలో ఉన్నా కూడా రద్దు చేస్తామన్నారు. ‘‘లిస్ట్-1, లిస్ట్- 2 , లిస్ట్ -3లతో సంబంధం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ఎప్పటికప్పుడు ఇన్‌చార్జ్ మంత్రుల నుంచి జాబితాలకు ఆమోదం తీసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతాలకు కనీసం 500 ఇండ్లను కేటాయించాలి” అని ఆదేశించారు.
నీట్ పరీక్షకు ఏర్పాట్లు చేయండి..
ఈ నెల 4న జరగనున్న నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్లను పొంగులేటి ఆదేశించారు. ‘‘ఈ ఏడాది రాష్ట్రం నుంచి 72,572 మంది విద్యార్దులు నీట్ పరీక్షకు హాజరవుతున్నారు. ఇందుకోసం 24 జిల్లాల్లో 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. పరీక్షా కేంద్రాల్లో తాగునీళ్లతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలి” అని సూచించారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ పాల్గొన్నారు.
సర్వే మ్యాప్‌లతో భూముల రిజిస్ర్టేషన్లు..
సర్వే మ్యాప్‌లతో వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఉండేలా జూన్‌లో పైలట్ ప్రాజెక్ట్చేపడతామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం సర్వేయర్ల నియామకాల కోసం త్వరలో నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని తెలిపారు. శుక్రవారం సెక్రటేరియెట్‌లో మీడియాతో పొంగులేటి చిట్‌చాట్ చేశారు. ఇప్పటికే భూముల సర్వే కోసం 6 వేల మంది ప్రైవేట్సర్వేయర్లను తీసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు.
ప్రైవేట్ సర్వేయర్లతో భూసర్వేలు చేసినప్పటికీ, వాటిపై ప్రభుత్వ పర్యవేక్షణ తప్పనిసరిగా ఉంటుందని వెల్లడించారు. ప్రైవేట్ సర్వేయర్లు తయారు చేసే మ్యాప్‌లను ప్రభుత్వ సర్వేయర్లు పరిశీలించి, రికార్డుల్లో నమోదు చేస్తారని వివరించారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా భూవివాదాలను తగ్గిస్తుందన్నారు. 70% మందికి లబ్ధి చేకూరినా భూభారతి విజయవంతమైనట్టేనని అన్నారు. త్వరలోనే కొత్త సాఫ్ట్‌వేర్‌ను
తీసుకొస్తామని తెలిపారు.
వడగాల్పులపై ‘హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్..
రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాడ్పుల నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవలసిన చర్యలపై 12 సంబంధిత శాఖల అధికారులతో మంత్రి శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ -2025ను మంత్రి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎండలకు సంబంధించిన సమాచారం, ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు, కూల్ వార్డుల ఏర్పాటు, ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహణ వంటి అంశాలపై చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 612 మండలాల్లో 588 మండలాలను వడగాలుల ప్రభావిత ప్రాంతాలుగా వర్గీకరించామని తెలిపారు. గతనెల15న హీట్‌వేవ్‌ను స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్‌గా నోటిఫై చేశామన్నారు.
ఎక్స్ గ్రేషియా 4 లక్షలకు పెంపు
వడదెబ్బతో చనిపోయినవారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాను రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షలకు పెంచినట్లు మంత్రి తెలిపారు. చలివేంద్రాలలో త్రాగునీరుతోపాటు ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్ల సరఫరా చేయాలని ఆదేశించారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం,మహబూబ్‌నగర్, నిజామాబాద్, కొత్తగూడెం, మెదక్, కరీంనగర్ తదితర పట్టణ ప్రాంతాలపై ప్రధానంగా దృష్టిసారించాలని సూచించారు. అదేవిధంగా వేడి ప్రదేశాలలో పనిచేసే కార్మికులను రెండు బృందాలుగా విభజించి కనీసం గంట లేదా రెండు గంటల విశ్రాంతి ఇచ్చేలా రొటేషన్ పద్ధతి అవలంభించేలా పరిశ్రమలకు సూచించాలన్నారు.
పార్కుల వద్ద పక్షులు, వీధి జంతువుల కోసం నీటి సరఫరాను సమకూర్చాలని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. సమావేశంలో విపత్తుల నిర్వహణాశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా,ఫైర్ సేఫ్టీ డీజీ నాగిరెడ్డి, ఐ అండ్ పీఆర్ కమీషనర్ వినయ్‌కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.