సురక్షిత ప్రయాణం మన హక్కు.!

సురక్షిత ప్రయాణం మన హక్కు.!

సురక్షితంగా ప్రయాణం చేసే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్​ 21 ప్రకారం జీవించే హక్కులో అంతర్లీనంగా ఉంది. కానీ, అన్ని జీవించే హక్కుల మాదిరిగా ఈ హక్కు కూడా అమలుకావడం లేదు. ఎన్ని కిలోమీటర్ల రోడ్లు మనం నిర్మాణం చేశామన్నది ముఖ్యంకాదు. మనం ఎన్ని జీవితాలను రక్షిస్తున్నామన్నది ముఖ్యం. ఎంతమంది ప్రయాణికులు సురక్షితంగా ఈ రోడ్లమీద ప్రయాణం చేస్తున్నారన్నది మరీ ముఖ్యం. కర్నూలు సమీపంలో హైదరాబాద్​– బెంగళూరు స్లీపర్​ బస్సులో మంటలు చెలరేగిన ప్రమాదంలో దాదాపు 20మంది ప్రయాణికులు మరణించారు. భారతీయ రహదారులలో ప్రయాణికులు భద్రత ఎంత దుర్భలంగా ఉందో ఈ ప్రమాదం మనకు తెలియజేస్తోంది. ఈ ప్రమాదం జరగడానికన్నా ముందే మోటార్​ సైకిల్​ డివైడర్​ను ఢీకొట్టి  ఆ వాహనాన్ని నడిపిస్తున్న వ్యక్తి మరణించాడు. ఆ మోటార్​ సైకిల్​ని ఢీకొట్టిన డ్రైవర్​ స్లీపర్​ కోచ్​ని ఆపకుండా కొంతదూరం వాహనాన్ని నడపడం వల్ల మంటలు చెలరేగాయి. 

ఇలాంటి ప్రమాదాలు మనకు కొత్తవి కాదు. ఇది మొదటిది కాదు. ఈ నెల మొదటి వారంలో కూడా రాజస్తాన్​లో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది.  ఆ బస్సులో చెలరేగిన మంటల వల్ల 26మంది ప్రయాణికులు మంటల్లో కాలి చనిపోయారు. ఎయిర్​ కండిషనింగ్​ వ్యవస్థలో షార్ట్ సర్క్యూట్​ వల్ల మంటలు చెలరేగి ఆ 20 మంది చనిపోయారని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. 2023లో  మహారాష్ట్రలో జరిగిన ప్రమాదం వల్ల 25మంది, అదే సంవత్సరం మధ్యప్రదేశ్​లో జరిగిన మరో ప్రమాదంలో 13మంది ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదాలన్నింటికి కారణం నిర్లక్ష్యం.  అది బస్సు యజమానులది కావొచ్చు. వాటిని తనిఖీ చేయాల్సిన అధికారులది కావొచ్చు. ఈ ప్రమాదాలకు కారణం ఒక లోపం మాత్రమే కాదు. సంస్థాగత వైఫల్యాలు ఎన్నో ఉన్నాయి.

కొరవడిన జవాబుదారీతనం 

ఈ ప్రైవేట్​ కంపెనీ నడిపే వాహనంలో అన్ని పత్రాలు సక్రమంగానే ఉన్నాయి. అవి ఫిటినెస్​ సర్టిఫికెట్, టూరిస్ట్​ సర్టిఫికెట్,  పొల్యూషన్​ క్లియరెన్స్​లాంటివి. అయితే, ఆ వాహనం స్లీపర్​ కోచ్​ కాదు. సీట్​కోచ్​ని స్లీపర్​ కోచ్​గా అక్రమంగా మార్చారు. మండటానికి అవకాశం ఉన్న ఇంటీరియర్స్, తెరుచుకోవడానికి వీల్లేని అత్యవసర ద్వారం. వీటన్నింటితోపాటు 16 చెల్లించని ట్రాఫిక్​ చలాన్లు. మెకానికల్​గా వాహనం బాగుందా లేదానే తనిఖీలు హడావుడిగా జరుగుతాయి.  వీటికి ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. అగ్నిమాపక యంత్రాలు, సుత్తులు, ఎమర్జెన్సీ ద్వారాలు లాంటి ప్రాథమిక భద్రతలు చూడకుండానే ఫిట్​నెస్​ పరీక్షలు జరుగుతాయి. అవి చట్టాలను, 
నియమాలను అమలుచేసే  వ్యవస్థ వైఫల్యాలు అధికం. తరచూ బస్సులు  చట్టాలు, నియమాల ఉల్లంఘనకు పాల్పడుతున్నప్పటికీ, చలాన్ల డబ్బులు చెల్లించనప్పటికీ బస్సులు నిరంతరాయంగా రోడ్లమీద పరుగెడుతూనే ఉంటాయి.  అక్రమంగా వాహనాలకి చేసే మార్పులని పట్టించుకునే నాథుడే లేడు.  అదనపు బెర్తులు, తాత్కాలిక ఎయిర్​ కండీషినింగ్​ వంటి చట్ట విరుద్ధమైన మార్పులు గురించి పట్టించుకునే నాథుడే లేడు. రవాణా డిపార్ట్​మెంట్​లో సిబ్బంది కొరత ఉండవచ్చు. వాళ్లు రకరకాల ఒత్తిళ్ల వల్ల రాజీ పడవచ్చు. 

నిషేధ వస్తువుల రవాణా

కర్నూలు బస్సు సంఘటనలో బస్సు లగేజ్​ కంపార్ట్​మెంట్​లో దాదాపు 400 దాకా స్మార్ట్​ఫోనులు రవాణా అవుతున్నాయని, అవి కూడా పేలి మంటలను తీవ్రతరం చేశాయని ఓ అంచనా. ఇవేకాదు ఈ బస్సులో చాలా వస్తువులను ట్రాన్స్​పోర్టు చేస్తున్నారు.  ఎల్పీజీ సిలిండర్లు, పెయింట్​ డబ్బాలు,  బాణసంచా వంటి నిషేధిత వస్తువులను సరఫరా చేస్తూ ఉంటారు. ‘అత్యవసర తలుపులు’ అన్న బోర్డు ప్రముఖంగా ప్రతి వాహనంలో కనిపిస్తుంది. కానీ, అవి సీల్​చేసి ఉంటాయి. అది శాశ్వతంగా తెరుచుకోవడానికి వీలుగా మూసివేస్తారు. ఎందుకంటే దాని వెనుక ఓ అదనపు సీటు ఉంటుంది. అది అదనపు ఆదాయంగా మారుతుంది. వాహన యజమానుల నిర్లక్ష్యం. నిబంధన ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అవసరమైన చర్చలు, ఇలాంటి ఉల్లంఘనలు చేయకుండా నిరుత్సాహపరిచే చర్యలు కనపడవు. తాత్కాలికంగా సస్పెన్షన్లు ఉంటాయి. ప్రభుత్వాలు ఎక్స్​గ్రేషియాలను ప్రకటిస్తాయి. నేరపూరితమైన చర్యలు అంత సీరియస్​గా ఉండవు. వాహన యజమానులకు ఏమీ అవదు. అంతా సజావుగానే జరుగుతుంది. మళ్లీ ఎప్పటిమాదిరిగానే  ఉల్లంఘనలు కొనసాగుతాయి. మరో ప్రమాదం జరిగేవరకు ఎవరూ ఈ విషయాలను పట్టించుకోరు. 

జైలుశిక్ష, జరిమానా

304ఎ అనేది  106గా మారింది. ఈ నిబంధన ప్రకారం ఎవరైనా వ్యక్తి రాష్​గా  కానీ నిర్లక్ష్యంగా కానీ వ్యవహరించడం వల్ల  మరో వ్యక్తి ప్రాణం తీసినట్లయితే అతనికి 5 ఏళ్లు వరకు జైలు శిక్షను, జరిమానాను విధించవచ్చు. అతను మెడికల్​ ప్రొఫెషనల్​ అయితే ఈ శిక్ష రెండు సంవత్సరాలు వరకు ఉంటుంది. ఒకవేళ వాహన డ్రైవరు ప్రమాదం చేసిన తరువాత ప్రమాదం జరిగిన సమాచారం పోలీసులకుగానీ, మేజిస్ట్రేట్​కుగానీ ఇవ్వకుండా,  అదేవిధంగా ప్రమాద స్థలం నుంచి పారిపోతే  ఆ వ్యక్తికి 10 సంవత్సరాల వరకు జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. అయితే, ఈ నిబంధన (106 (3)) అమల్లోకి రాలేదు. నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేసి ఆ వాహనం ప్రమాదానికి గురైతే ఆ వాహన యజమానిని సెక్షన్​ 105 భారతీయ న్యాయసంహిత (3034(11) ఐపీసీ) ప్రకారం ప్రాసిక్యూట్​ చేసేవిధంగా చట్టంలో మార్పులు తీసుకురావాల్సి ఉంది. 

కర్నూలు  విషాదం  కనువిప్పు కావాలి

కర్నూలు విషాదం ప్రతి ప్రభుత్వాన్ని కళ్లు తెరిపించాలి. ప్రభుత్వ లేదా ప్రైవేట్​ వాహనాల్లో నిషేధ వస్తువులను, ప్రయాణికులకు చెందని వస్తువులను తీసుకుని పోకుండా చూడాలి. ఆ నిషేధ వస్తువుల జాబితాను ప్రముఖంగా ప్రచురించాలి. సడెన్​గా తనిఖీలు చేపట్టాలి. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉండాలి. ఫిట్​నెస్​ సర్టిఫికెట్లు యథాలాపంగా మంజూరు చేయకూడదు. అక్రమంగా సర్టిఫికెట్టు జారీచేసే అధికారులు మీద సీరియస్​ చర్యలు ఉండాలి. రహదారి భద్రతా ప్రమాణాలను నిర్ణయించడానికి, పర్యవేక్షించడానికి, అమలుచేయడానికి స్వతంత్ర చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.

ప్రమాదాల నివారణకు రావల్సిన చట్టాలు

ఇండియన్​ పీనల్​ కోడ్​ స్థానంలో భారతీయ న్యాయ సంహితని తీసుకువచ్చారు. మోటారువాహన ప్రమాదాల్లో మరణం ఉన్నప్పుడు ఇండియన్​ పీనల్​ కోడ్​లోని సెక్షన్​ 304 ఎ ప్రకారం కేసులను నమోదు చేసేవాళ్లు. దానికి శిక్ష చాలా తక్కువ.  రెండు సంవత్సరాలుగానీ, జరిమానాగానీ లేదా రెండింటిని కోర్టులు విధించవచ్చు. సల్మాన్​ ఖాన్​ కేసును అదేవిధంగా ఆల్​స్టల్​ పెరిరియా కేసులని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. నిరాశ్రయులైన వ్యక్తులపై బాలీవుడ్​  నటుడు తన ఎస్​యూవీ కారును ఎక్కించడం వల్లన ఒకరు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. ఈ కేసులో 304 ఎ కాకుండా మేజిస్ట్రేట్​ కోర్టు 304(11) నేరపూరిత హత్యకేసుని నమోదు చేసింది. సెషన్స్​ కోర్టు కూడా అతడిని దోషిగా నిర్ధారించింది.  హైకోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది. ఈ కేసులో ముఖ్యమైన విషయం ఏమంటే ఇలాంటి హత్యలు 304(11) ప్రకారం నేరపూరిత హత్యలని నేరారోపణలు నిర్ధారణ చేయడం.  304ఎ ప్రకారం శిక్షలు  తక్కువగా ఉన్నాయని కొత్త చట్టంలో శిక్షని పెంచారు.

- డా. మంగారి రాజేందర్, 
జిల్లా జడ్జి (రిటైర్డ్)