
- ఖాతాలకు బదిలీ చేసిన ప్రభుత్వం
- మూడు నెలల్లో 2.04 లక్షల ఇండ్ల పనులు స్టార్ట్
- సింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ. గౌతమ్
హైదరాబాద్,వెలుగు: రాష్ర్ట వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇప్పటి వరకు రూ.1000 కోట్లను చెల్లించామని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ. గౌతమ్ తెలిపారు. డబ్బులను లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేసినట్టు చెప్పారు. 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా.. ఇందులో 2.04 లక్షల ఇండ్ల పనులు షురూ అయ్యాయని, ఇందులో లక్ష ఇండ్లు బేస్ మెంట్ స్ధాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు. మంగళవారం హిమాయత్ నగర్లోని హౌసింగ్ కార్పోరేషన్ ఆఫీస్ లో అన్ని జిల్లాల హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లు ( పీడీ), డీఈలతో ఎండీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ వీపీ. గౌతమ్ మాట్లాడుతూ.. గత 3 నెలల నుంచి రాష్ర్ట వ్యాప్తంగా ఇండ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుందన్నారు.
పీడీలు, డీఈలు గ్రామాల్లో పర్యటించి లబ్ధిదారులతో మాట్లాడుతూ స్కీమ్ ను పర్యవేక్షించాలని, అప్పుడే లోపాలు, తప్పులు బయటపడతాయని సూచించారు. లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు అందేలా శ్రద్ద చూపెట్టాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని ఎండీ హెచ్చరించారు. ఇటీవల సిద్దిపేట, వనపర్తిలో హౌసింగ్ ఏఈలను సస్పెండ్ చేశామని గుర్తు చేశారు.
15 రోజుల్లోపే బిల్లులు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులు నిర్ణీత స్థాయికి వచ్చిన తర్వాత 15 రోజుల్లోపే బిల్లులు విడుదలయ్యేలా చూస్తున్నామని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ. గౌతమ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని లబ్ధిదారులకు వివరించాలని పీడీలను ఆదేశించారు.
యాదాద్రి, జనగామ, ములుగు పీడీలకు సన్మానం
జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఇసుక, సిమెంట్, స్టీల్ ధరల నియంత్రణ కమిటీల సమావేశాలను నిర్వహించాలని, ఈ మీటింగ్ లను రెవెన్యూ, మండల స్థాయిలో కూడా జరపాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ. గౌతమ్ ఆదేశించారు. ఇండ్ల నిర్మాణంలో ముఖ్యమైన ఇసుక, సిమెంట్, ఇటుకల వంటివి తక్కువ ధరలకే లబ్ధిదారులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరు, కేటాయింపులతో పాటు, ఆయా కాలనీల్లో మంచినీరు, కరెంటు వంటి మౌలిక వసతుల పనులపై పీడీలతో ఎండీ సమీక్షించారు. ఉత్తమ పనితీరు కనబర్చిన యాదాద్రి, జనగామ, ములుగు పీడీలను ఎండీ సన్మానించారు. ఈ సమావేశంలో అడ్వైజర్ ఈశ్వరయ్య, సీఈలు చైతన్యకుమార్, వెంకటదాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జీఎం మమత తదితరులు పాల్గొన్నారు.