- రూ. 1. 20 లక్షల నగదు, రూ. 36 లక్షల విలువ చేసే మూడు కార్లు స్వాధీనం
దేవరకొండ(చింతపల్లి), వెలుగు: ఖరీదైన కార్లలో రాత్రి సమయాల్లో మేకల దొంగతనాలకు పాల్పడుతున్న 5 మందితో కూడిన అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు దేవరకొండ ఏఎస్పీ మౌనిక తెలిపారు. నిందితుల నుంచి రూ. 1.20 లక్షల నగదు, రూ. 36 లక్షలు విలువ చేసే మూడు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గురువారం చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో మీడియా సమావేశంలో దేవరకొండ ఏఎస్పీ మౌనిక వెల్లడించిన వివరాల ప్రకారం.. కొంతకాలం జిల్లాలో మేకలు, గొర్రెలు దొంగతనం జరుగుతున్నాయి. దీంతో వీరిని పట్టుకునేందుకు ఎస్పీ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. చింతపల్లి ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఎపీ 37 బిజడ్ 5666 అనే వెహికల్‌ను ఆపి తనిఖీ చేయగా పారిపోయేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులు, ఇద్దరు మహిళల్ని పట్టుకున్నారు.
వారిని ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో చెక్ చేయగా గతంలో మేకల దొంగతనం చేసినట్లు తేలింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా గురజాల మండలం ఎస్సీ కాలనీకి చెందిన అమ్ములూరి విజయ్, అమ్ములూరి నందిని, నల్గొండ జిల్లా నిడమనూరు గ్రామానికి చెందిన దాసర్ల వినోద్ కుమార్, గుంజ కార్తీక్, నల్గొండ జిల్లా అనుముల మండలం అలీ నగర్ కు చెందిన సంపంగి శారదను అరెస్టు చేసినట్లు తెలిపారు. సంపంగి వెంకటేష్, శబరీశ్ అనే ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. కేసును ఛేదించిన నాంపల్లి సీఐ రాజు, చింతపల్లి ఎస్సై రామ్మూర్తి, హెడ్ కానిస్టేబుల్ సైదులు, సిబ్బంది చరణ్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, విజయ్, శేఖర్‌ను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించి రివార్డులు అందజేసినట్లు తెలిపారు.
