- భువనగిరిలోని ఒక్క షాపునకే రూ. 75 లక్షల చెల్లింపులు
- కలెక్టరేట్‌కు చేరిన రిపోర్ట్ .. త్వరలో షోకాజ్ నోటీసులు
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు పంచాయతీలో చోటు చేసుకున్న అవినీతిపై ప్రైమరీ రిపోర్ట్ రెడీ అయింది. కలెక్టర్ పరిశీలన తర్వాత షోకాజ్ నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్- వరంగల్ హైవే పక్కనే కొండమడుగు పంచాయతీ ఉంది. హైదరాబాద్‌కు దగ్గరగా ఉండడం వల్ల డెవలప్మెంట్ చెందుతోంది. డెవలప్మెంట్ స్థాయిలోనే ఈ పంచాయతీలో అవినీతి చోటు చేసుకుంది. ఈ పంచాయతీలో చోటు చేసుకున్న అవినీతిపై ఈ ఏడాది మొదట్లో అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది.
మొత్తం రూ. కోటిన్నరకు పైగా ఫ్రాడ్
అప్పట్లోనే డీఎల్పీవో విచారణ నిర్వహించి, అవినీతిపై రిపోర్ట్ అందించారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆ రిపోర్ట్ పక్కకు వెళ్లింది. అనంతరం పంచాయతీ సెక్రెటరీ అలివేలుపై సస్పెన్షన్ వేటు పడింది. కాగా ఈ పంచాయతీలో నెలకొన్న అవినీతిపై ఇటీవల మరోసారి విచారణ నిర్వహించారు. 2020 నుంచి 2025 వరకూ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన రికార్డులను జిల్లా పంచాయతీ ఆఫీసర్ విష్ణువర్దన్ రెడ్డి తనిఖీ చేశారు. జిల్లా కేంద్రమైన భువనగిరిలోని ఒక్క షాపునకు రూ. 75 లక్షలు చెల్లించినట్టు రికార్డుల్లో పేర్కొన్నారు.
వస్తువుల కొనుగోలు పేరుతో మరో రూ. 75 లక్షల వరకూ ఖర్చు చేశారు. దీనికి సంబంధించి కార్మికులకు డబ్బు చెల్లించినట్టుగా రికార్డుల్లో పేర్కొన్నారని గుర్తించారు. మొత్తంగా రూ. 1.50 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టుగా రికార్డుల్లో పేర్కొన్నారు. వివిధ పనులు చేపట్టినట్టు రికార్డుల్లో పేర్కొన్నారే తప్ప ఎక్కడా ఎంబీలు లేవు. విచారణకు సంబంధించిన రిపోర్ట్ కలెక్టరేట్ కు చేరింది. కలెక్టర్ పరిశీలన అనంతరం ఐదేండ్ల కాలంలో విధులు నిర్వహించిన సెక్రెటరీలు, పాలకవర్గానికి, స్పెషలాఫీసర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు.
