మాల్దీవ్స్ కు 5 వేల కోట్లు..లైన్ ఆఫ్ క్రెడిట్ పెంచుతూ ప్రధాని మోదీ ప్రకటన

మాల్దీవ్స్  కు 5 వేల కోట్లు..లైన్ ఆఫ్ క్రెడిట్ పెంచుతూ ప్రధాని మోదీ ప్రకటన
  • ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై చర్చలూ ప్రారంభించినం 
  • తమ దౌత్య బంధం సముద్రం కన్నా లోతైనదని కామెంట్
  • మోదీకి గ్రాండ్ వెల్ కం చెప్పిన మాల్దీవుల ప్రెసిడెంట్ మయిజ్జు

మాలె: ఇండియా, మాల్దీవుల మధ్య సంబంధాలకు ఉన్న మూలాలు చరిత్ర కన్నా పాతవని, సముద్రం కన్నా లోతైనవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండు దేశాలు కేవలం పొరుగు దేశాలు మాత్రమే కాదని.. కలిసి ప్రయాణిస్తున్న సహ యాత్రికులు కూడా అని అభివర్ణించారు. బ్రిటన్ లో రెండు రోజుల పర్యటన ముగించుకుని శుక్రవారం మాలెకు చేరుకున్న మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయిజ్జు సాదరంగా స్వాగతం పలికారు. 

అనంతరం ఇరువురు నేతలు భేటీ అయి ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, రక్షణ, ఇతర రంగాల్లో సహకారంపై చర్చలు జరిపారు. ఈ భేటీ తర్వాత ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. మాల్దీవులకు లైన్ ఆఫ్ క్రెడిట్ ను 565 మిలియన్ డాలర్ల (రూ. 4,888 కోట్లు)కు పెంచుతున్నామని ప్రకటించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కోసం వినియోగించుకునేందుకు వీలుగా ఈ రుణాన్ని అందించనున్నట్టు తెలిపారు. దీంతోపాటు వార్షిక రుణ చెల్లింపుల విషయంలోనూ పలు మినహాయింపులు ఇస్తామని ప్రకటించారు. 

రెండు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకునేందుకు సంప్రదింపులు కూడా ప్రారంభించామని వెల్లడించారు. మాల్దీవులతో ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం ఇప్పటికే తుది దశకు చేరిందన్నారు. రక్షణ, భద్రత అంశాల్లో మాల్దీవులకు భారత్ ఎల్లప్పుడూ నమ్మకమైన మిత్ర దేశంగా నిలిచిందని మోదీ అన్నారు. మాల్దీవులు రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ఇకముందూ సహకరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇండియా ‘నైబర్ హుడ్ ఫస్ట్’, మహాసాగర్ విజన్​లో మాల్దీవులకు ప్రముఖ స్థానం ఉందన్నారు. మాల్దీవుల రుఫియా, ఇండియన్ రూపాయితో డైరెక్ట్ ట్రేడ్ పెరుగుతోందని, మాల్దీవుల్లో టూరిజం, రిటైల్ రంగాల్లో యూపీఐ వాడకం కూడా పుంజుకున్నదని చెప్పారు.

మయిజ్జుతో కలిసి మొక్కలు నాటిన.. 

పర్యావరణం, క్లైమేట్ చేంజ్ సవాళ్లను ఇరు దేశాలు బాగా అర్థం చేసుకున్నాయని, సుస్థిర అభివృద్ధి సాధించే దిశగా సాధ్యమైన అన్ని ప్రయత్నాలూ చేయాలని నిర్ణయించుకున్నాయని మోదీ తెలిపారు. ‘‘ఈ సాయంత్రం మాలెలో నేను, ప్రెసిడెంట్ మయిజ్జు మొక్కలు నాటి, ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేశాం. 

మాల్దీవుల్లో 50 లక్షల మొక్కలు నాటాలని ఇక్కడి ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసింది” అని ఆయన ట్వీట్ చేశారు. మాల్దీవుల్లో తనకు గుర్తుండిపోయే రీతిలో స్వాగతం లభించిందని, రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఇరుదేశాల ప్రజలకూ ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మాల్దీవులకు వచ్చిన తనకు భారత సంతతి ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికారని మోదీ గుర్తు చేసుకున్నారు.  

ఇండియాకు థ్యాంక్స్: మయిజ్జు 

మాల్దీవుల ప్రెసిడెంట్ మయిజ్జు మాట్లాడుతూ.. మాల్దీవియన్ ఎకానమీ, లిక్విడిటీ సమస్యలను పరిష్కరించుకోవడంలో సహకరించినందుకు ఇండియాకు ధన్యవాదాలు తెలిపారు. మాల్దీవుల రక్షణ శాఖకు 72 వెహికల్స్ అందించినందుకు, ఇతర సహాయం చేసినందుకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. కాగా, రెండు దేశాల సంప్రదాయ పడవల బొమ్మలతో కూడిన స్మారక స్టాంపులను మోదీ, మయిజ్జు కలిసి రిలీజ్ చేశారు.

ఇండియా ఔట్ నుంచి.. మోదీకి ఆహ్వానం దాకా..  

ముందు నుంచీ చైనా అనుకూల వైఖరి అనుసరిస్తున్న మొహమ్మద్ మయిజ్జు 2023 నవంబర్ లో మాల్దీవుల అధ్యక్షుడు అయ్యారు. ఎన్నికల ప్రచారంలో ‘ఇండియా ఔట్’ నినాదం ఇచ్చారు. అధ్యక్షుడయ్యాక మాల్దీవుల నుంచి భారత బలగాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, భారత్​పై మయిజ్జుతోపాటు ఆ దేశ మంత్రులు చేసిన కామెంట్లతో పెను దుమారం రేగింది. దీంతో ఆ దేశం నుంచి రెస్క్యూ బలగాలను, సైనిక విమానాలను భారత్ వెనక్కి తీసుకుంది. 

రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా బలహీనమయ్యాయి. మరోవైపు, మయిజ్జు ‘చైనా ఫస్ట్’ అనే పాలసీతో ఆ దేశానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. భారత్​తో తెగదెంపులతో పర్యాటక పరంగా, రక్షణ పరంగా జరుగుతున్న నష్టాన్ని గ్రహించిన మయిజ్జు దిగివచ్చారు. అలాగే 7.5  బిలియన్ డాలర్ల మాల్దీవుల ఎకానమీ అప్పుల కారణంగా డిఫాల్ట్ అయ్యే ప్రమాదంలో పడగా, భారత్ తన ఇన్ ఫ్లుయెన్స్​తో కాపాడింది.

మోదీకి మయిజ్జు గ్రాండ్ వెల్ కం  

రెండు రోజుల బ్రిటన్ పర్యటన తర్వాత ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం మాల్దీవుల రాజధాని మాలెకు చేరుకున్నారు. మాల్దీవుల అధ్యక్షుడు మయిజ్జు ఆహ్వానం మేరకు ఆ దేశ 60వ ఇండిపెండెన్స్ డే (జులై 26) వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొనేందుకు మోదీ వెళ్లారు. మాలెలోని వెలెనా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు మయిజ్జు, మంత్రులు సాదర స్వాగతం పలికారు. 

సంప్రదాయ నృత్యాలతో చిన్నారులు వెల్ కం చెప్పారు. అనంతరం సిటీలోని రిపబ్లిక్ స్క్వేర్ వద్ద మోదీకి ప్రత్యేకంగా వెల్ కం సెరెమోనీ ఏర్పాటు చేశారు. మాల్దీవుల బలగాల నుంచి మోదీ గౌరవ వందనం స్వీకరించారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా ఆయన ఫొటోను మాల్దీవుల రక్షణ శాఖ ఆఫీసుపై ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోదీ వెంట విదేశాంగ మంత్రి జైశంకర్, ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ ఉన్నారు.