
- ఈ ఏడాది కొనాలని ఆర్టీసీ నిర్ణయం
- ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన సంస్థ
- సర్కార్ ఆమోదిస్తే కాలం చెల్లిన బస్సులు తుక్కుకే
హైదరాబాద్, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లతో సుమారు 2,500 కొత్త డీజిల్ బస్సులను కొనాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచింది. ఆమోదం లభిస్తే ప్రస్తుతం ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులు ఇక తుక్కుగా మారనున్నాయి. నిజానికి మహాలక్ష్మి స్కీం ద్వారా ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేషియో పెరిగి, బస్సులకు డిమాండ్ ఏర్పడింది. కొత్త బస్సులు కొనేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఎలక్ట్రిక్ బస్సులను హైర్ చేసుకుంటూ వచ్చింది.
ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ బస్సులను వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు డీజిల్ బస్సులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్ల ప్రతినిధులు, ప్రభుత్వంతో చర్చల సందర్భంగా కొత్త బస్సుల కొనుగోలు డిమాండ్‌ను రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ముందు ఉంచారు. అందుకు తగ్గట్లే ప్రభుత్వం కొత్త బస్సుల కొనుగోలుపై దృష్టి పెట్టింది.
సగానికి పైగా బస్సులు కాలం చెల్లినవే..
ఆర్టీసీలో మొత్తం 9 వేల వరకు బస్సులు ఉండగా, ఇందులో దాదాపు 6,500 వరకు సొంత బస్సులు కాగా, మిగతా 2,500 వరకు అద్దె బస్సులు ఉన్నాయి. ఆర్టీసీకి ఉన్న సొంత బస్సుల్లో సగానికి పైగా కాలం చెల్లినవేనని తెలుస్తోంది. ఈ బస్సులతో డీజిల్ ఖర్చు బాగా పెరగడం, తరుచుగా రిపేర్లు చేయాల్సి రావడం, కార్మికులకు అనవసర పనిభారం పెరుగుతున్నది. అందుకే కొత్త బస్సులు కొనుగోలు చేయడం ఇప్పుడు ప్రభుత్వానికి అనివార్యంగా మారింది.
ప్రధానంగా రాజధాని, ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులు కొత్తవి కొనుగోలు చేయాల్సి ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో కొత్త బస్సుల అవసరం ఎక్కువగా ఉంది. ఇక్కడ చాలా బస్సులు స్క్రాప్‌కు తరలించాల్సి ఉండగా, అలాగే, తిప్పుతున్నారు. దీంతో రోడ్లపై ఎక్కడపడితే ఆగిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. అయితే, ప్రభుత్వం కొత్త బస్సులను కొనాలని నిర్ణయించినా వీటిని ఏ పద్ధతిలో కొనుగోలు చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నది. రుణానికి వెళ్లి బస్సులను కొనుగోలు చేయాలా... లేదంటే ప్రభుత్వ నిధులతో కొనడమా.. అనే దానిపై ఇంకా నిర్ణయానికి రాలేదు.
మహాలక్ష్మి పథకంతో పెరిగిన ఓఆర్..
మహాలక్ష్మి పథకంతో బస్సుల ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) ఒక్కసారిగా పెరిగింది. ఈ పథకం అమలు చేయకముందు 60 నుంచి 70 మధ్యలో ఉండగా ఇప్పుడు ఏకంగా 100 శాతం ఉంటుంది. దీంతో కొత్త బస్సుల అవసరం పెరిగిపోయింది. ఇదే సమయంలో పాత బస్సులను మార్చాల్సి ఉంది. ముఖ్యంగా రాజధాని ఏసీ వంటి బస్సుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ బస్సులు స్క్రాప్‌కు తరలించాల్సిన దుస్థితిలో ఉండగా, ఇప్పటికీ వీటిని వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ రూట్లలో నడిపిస్తున్నారు.
వాస్తవానికి 10 నుంచి 12 లక్షల కిలో మీటర్లు తిరిగిన బస్సులను లేదంటే 15 ఏండ్లు దాటిన బస్సులను స్క్రాప్ డిపోలకు పంపించాలి. కానీ ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఈ బస్సులను ఇప్పటికీ తిప్పుతున్నారు. దీంతో ఇవి ఎక్కడపడితే అక్కడ ఆగిపోతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.