
- ఎంపీ మల్లురవికి ఆర్‌యూపీపీ వినతి
హైదరాబాద్, వెలుగు: నిలిచిపోయిన 13 జిల్లాల్లోనూ లాంగ్వేజీ పండిట్ల స్పౌజ్ బదిలీలు నిర్వహించాలని రాష్ర్టీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్‌యూపీపీ) రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవిని బాధిత స్పౌజ్ టీచర్లతో కలిసి ఆయన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జగదీశ్ మాట్లాడుతూ... గతంలో నిలిచిపోయిన 13 జిల్లాల స్పౌజ్ టీచర్ల బదిలీలకు సర్కారు ఆమోదం తెలిపిందని, అయితే, ఆయా జిల్లాల్లోని లాంగ్వేజీ పండిట్లు, పీఈటీలకు స్పౌజ్ బదిలీలను మాత్రం వివిధ కారణాలతో నిలిపివేశారని తెలిపారు.
జీవో 317 వచ్చినప్పటి నుంచి నిత్యం 200 నుంచి 300 కిలో మీటర్లు ప్రయాణం చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలను రెండింటినీ సమన్వయం చేసుకోలేక టీచర్లంతా మానసిక క్షోభకు గురవుతున్నారని పేర్కొన్నారు. పండిట్, పీఈటీలకు కూడా మిగిలిన టీచర్ల మాదిరిగా అవకాశం కల్పించి, భార్యాభర్తలను ఒకే జిల్లాకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.