
IIFA అవార్డ్స్ (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) కోసం ప్రస్తుతం అబుదాబిలో ఉన్న బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మే 26న IIFA రాక్స్ ఈవెంట్ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సెషన్ సమయంలో సల్మాన్ కు ఓ ఫ్యాన్ నుంచి ఊహించని ఘటన ఎదురైంది. ఓ యువతి తనను పెళ్లి చేసుకుంటావా అని సల్మాన్ ను అడిగింది. దానికి సల్మాన్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "నా పెళ్లి రోజులు అయిపోయాయి. నువ్వు నన్ను 20 ఏళ్ల క్రితమే కలుసుకుని ఉండాల్సింది" అని సల్మాన్ బదులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సైతం ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.
ఇక సల్మాన్ ఖాన్ సినిమా విషయాలకొస్తే.. ఆయన నటించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ గత నెలలో థియేటర్లలో విడుదలైంది. సల్మాన్ ఖాన్ నిర్మించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌లో పూజా హెగ్డే, వెంకటేష్ దగ్గుబాటి, భూమికా చావ్లా, షెహనాజ్ గిల్, పాలక్ తివారీ, విజేందర్ సింగ్, రాఘవ్ జుయల్, జాస్సీ గిల్ కూడా నటించారు. ఈ చిత్రానికి ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించారు.
వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సల్మాన్ బజరంగీ బహైజాన్ తో రెండో సారి జత కట్టేందుకు రెడీగా ఉన్నారు. సల్మాన్ రాబోయే ప్రాజెక్ట్‌లలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కిక్ 2, కత్రినా కైఫ్‌తో టైగర్ 3 ఉన్నాయి. రెండోది ఈ ఏడాది విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ ఈ సంవత్సరం ప్రారంభంలో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్‌లో అతిథి పాత్రలో కనిపించారు.