
- మెదక్‌కు 12.. సిద్దిపేటకు 25వ స్థానం
మెదక్/సంగారెడ్డి/సిద్దిపేట, వెలుగు: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా సత్తా చాటింది. 99.09 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. 96.87 శాతం ఉత్తీర్ణతతో మెదక్ జిల్లా రాష్ట్రంలో 12వ స్థానంలో నిలవగా, 91.79 శాతం ఉత్తీర్ణతతో సిద్దిపేట జిల్లా 25వ స్థానానికి పడిపోయింది. మూడు జిల్లాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు.
ఐదో స్థానం నుంచి ఎగబాకి..
పదోతరగతి ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా గతంలో కన్నా మెరుగైన స్థానాన్ని పొందింది. గత ఏడాది స్టేట్‌లో 5వ ప్లేస్‌లో ఉండగా ఈసారి 99.09 శాతం పర్సంటేజీతో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. మొత్తం 23,374 మంది స్టూడెంట్స్ పరీక్ష రాయగా, 22,170 మంది స్టూడెంట్స్ పాసయ్యారు. ఎప్పటి లాగానే ఈ సారి కూడా గర్ల్స్పైచేయి సాధించారు. 98.93 శాతం మంది బాలురు పాస్ కాగా, బాలికలు 99.26 శాతం మంది పాసయ్యారు. జిల్లాలోని 460 గవర్నమెంట్ స్కూల్లకు గాను 301 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
మెదక్‌లో 96 శాతం పాస్
పదోతరగతి ఫలితాల్లో మెదక్ జిల్లా రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 10,370 మంది పరీక్ష రాయగా 10,045 మంది స్టూడెంట్స్ పాసయ్యారు. 96.87 శాతం పర్సంటేజీ సాధించారు. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణతే ఎక్కువ ఉంది. తూప్రాన్ గురుకుల పాఠశాల విద్యార్థి అభిలాష్ 600లకు గాను 585 మార్కులు, హవేలి ఘనపూర్ లోని మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల విద్యార్థి సాయి వర్షిత్ రెడ్డి, ఎల్లలింగం 550 మార్కులు సాధించారు.
ఈ స్కూల్లో 23 మందికి 500కన్నా ఎక్కువ మార్కులు వచ్చాయని ప్రిన్సిపల్ సృజన తెలిపారు. ఇదే మండలం కూచన్‌పల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థి శ్రీశాంక్ 543 మార్కులు సాధించాడు. మెదక్ గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ స్టూడెంట్స్ సిద్ర తన్ సీమ్ 578, కుల్ల మీన 563, కుమ్మరి వర్ష 559 మార్కులు సాధించారని హెచ్ఎం రేఖ తెలిపారు. మెదక్‌లో మొత్తం 114 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
చతికిలబడ్డ సిద్దిపేట
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో సిద్దిపేట జిల్లా చతికిలబడింది. గతంతో రెండేళ్లు స్టేట్‌లో రెండవస్థానంలో ఉన్న సిద్దిపేట ఈసారి 91.79 ఉత్తీర్ణతతో ఏకంగా 25వ స్థానానికి పడిపోయింది. జిల్లాలో 14,114 మంది పరీక్షలకు హాజరుకాగా 12,955 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలోనూ బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. బాలురు 90.40 శాతం ఉత్తీర్ణులు అయితే బాలికలు 93.20 శాతం ఉత్తీర్ణత సాధించారు. ములుగు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్ భార్గవి 583 మార్కులతో జిల్లా టాపర్ గా నిలిచింది. దుబ్బాక మోడల్ స్కూల్ లో 99 మంది పరీక్ష రాస్తే 97 మంది పాసయ్యారు. మద్దూర్ కేజీబీవీ పాఠశాలలో 43 మంది పరీక్ష రాయగా అందరూ పాసై 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. చేర్యాల మండలం ముత్యాల మోడల్ స్కూల్ లో కూడా పరీక్ష రాసిన 92 మంది పాసై 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.