
- కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగాల భర్తీకి చర్యలు
- అప్పుడు 97, ఇప్పుడు 117 పోస్టులు
- సెలక్షన్ కమిటీపై అనుమానాలు
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీపై వచ్చిన నోటిఫికేషన్లు అభాసు పాలవుతున్నాయి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 117 పోస్టుల భర్తీ కోసం ఆ శాఖ అధికారులు ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. గతేడాది ఫిబ్రవరిలో ఇదే శాఖలో 97 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి సెలక్షన్ కమిటీపై వచ్చిన ఆరోపణలు, ఇతరత్ర కారణాల వల్ల వాటిని భర్తీ చేయకుండానే వదిలేశారు. 15 నెలల తర్వాత మరో 20 పోస్టులు కలిపి మొత్తం 117 పోస్టులకు రీ నోటిఫికేషన్ ఇచ్చి 3,110 దరఖాస్తులను స్వీకరించారు.
రెండోసారి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లో స్పష్టత లేకపోవడంతో కనీసం ఈసారైనా పోస్టుల భర్తీ సజావుగా జరుగుతుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. మొదటి దఫా నోటిఫికేషన్ టైంలో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు ఈ సెలక్షన్ కమిటీలో ఉండడం వల్ల అభ్యర్థుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించినట్టు సొంత శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులే ప్రచారం చేస్తున్నారు. బుధవారం నుంచి అప్లికేషన్ల పరిశీలన స్టార్ట్ అయింది. ఈనెల చివరి నాటికి ఉద్యోగాలను భర్తీ చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న అభ్యర్థుల్లో మాత్రం అభద్రత భావం నెలకొంది.
నోటిఫికేషన్ లో అస్పష్టత
నోటిఫికేషన్ లో కాంట్రాక్ట్ గురించి, ఔట్ సోర్స్ పద్ధతిలో పనిచేసే ప్రాంతం, వేతనం, రోస్టర్ గురించి స్పష్టంగా పేర్కొనలేదు. పైగా 2024 ఫిబ్రవరి 27న రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కు సంబంధించి 97 పోస్టులకు 3,500 దరఖాస్తులు అందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. కొత్త నోటిఫికేషన్ జారీపై గతంలో దరఖాస్తు చేసుకున్న క్యాండిడేట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్యోగాల నియామకాల ప్రక్రియపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిక్రూట్మెంట్బోర్డ్ చైర్మన్ గా కలెక్టర్ క్రాంతి, సభ్యులుగా డీఎంహెచ్ వో, డీసీహెచ్ ఎస్ తో పాటు మరో నలుగురు అధికారులు ఉంటారు.
చైర్మన్ హోదాలో కలెక్టర్ ఈ నియామకాలపై ఫోకస్ పెట్టి పకడ్బందీగా చర్యలు చేపట్టి నిరుద్యోగులకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ సైతం రిక్రూట్మెంట్బోర్డ్ పనితీరును పర్యవేక్షించాలంటున్నారు. మరోపక్క 2024లో దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లను తాజా నోటిఫికేషన్ కు కన్సిడర్ చేయకపోవడంతో పాత దరఖాస్తులు బుట్ట దాఖలయ్యాయి. ఏడాదికాలంగా ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూసిన తమకు నిరాశే మిగిల్చారని పాత దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.