- భవనాలు కట్టిస్తామని, భూములిస్తామని హామీలు
- కొన్ని చోట్ల కుల పెద్దలకు ప్యాకేజీ ఆఫర్
సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఓట్ల కోసం నానా తిప్పలు పడుతున్నారు. ఎలాగైనా గెలవాలన్న తపనతో భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా కుల సంఘాలను టార్గెట్ చేస్తున్నారు. ఎక్కువ జనాభా ఉన్న కులాలను ఫోకస్ చేసి.. ఆ కుల సంఘాలకు వివిధ హామీలిస్తున్నారు.
కుల పెద్దలతో మంతనాలు జరిపి వారి వర్గం ఓట్లన్నీ తమకే పడేలా ఎత్తుగడ వేస్తున్నారు. మరోవైపు గల్లీలవారీగా వివిధ వర్గాలతో ప్యాకేజీలు మాట్లాడి గంపగుత్తగా తమకు ఓట్లు పడేలా డీల్ కుదుర్చుకుంటున్నారు. దీంతో కొన్ని పల్లెల్లో పోరు రసవత్తరంగా మారింది.
కామారెడ్డి, వెలుగు: సర్పంచ్ ఎన్నికల వేళ కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు గెలుపు కోసం కుల సంఘాలను, వివిధ సంఘాల లీడర్లను అప్రోచ్ అవుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఓట్ల కోసం బేరసారాలు జోరందుకున్నాయి. కుల సంఘాల ఓట్లు గంపగుత్తగా తమ వైపు మలుచుకునేందుకు అభ్యర్థులు అనేక హామీలు ఇస్తున్నారు. కుల సంఘాలకు భూములు ఇస్తామని, బిల్డింగ్లు, కంపౌండ్వాల్స్ కట్టిస్తామని చెబుతున్నారు. మరోవైపు గ్రామాల్లో గుడులు కట్టిస్తామని కొన్ని వర్గాల ప్రజలతో బేరసారాలు చేస్తున్నారు.
గల్లీలవారీగా పేరున్న వ్యక్తులను కలిసి తమకు సహకరిస్తే రూ.లక్షల్లో ఇస్తామంటూ ఆఫర్ ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో మొదటి విడత పోలింగ్ దగ్గర పడడంతో ప్రచారం జోరందుకుంది. రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ ముగిసి, బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరనేది తేలింది. మూడో విడత నామినేసన్ల పక్రియ ముగిసింది. దీంతో పల్లెల్లో ఎన్నికల వేడి రాజుకుంది. కామారెడ్డి డివిజన్లోని 10 మండలాల్లో 167 పంచాయతీల్లో మొదటి విడతలో ఈ నెల 11న ఎన్నికలు జరుగనున్నాయి.
11 పంచాయతీలు, 433 వార్డులు ఏకగ్రీవం కాగా, 156 పంచాయతీలు, 1,084 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌కు ఇంకా 4 రోజులే గడువు ఉండడంతో అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఓ వైపు క్యాంపెయిన్ చేస్తూనే.. మరోవైపు బేరసారాలకు దిగుతున్నారు. భూములు రాసిస్తామని, బిల్డింగులు కట్టిస్తామని, భారీగా నగదు ఇస్తామని చెబుతూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆఫర్లు ఇలా..
గాంధారి మండలకేంద్రానికి సమీపంలో ఉన్న ఓ పంచాయతీ పరిధిలో ఇద్దరు అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. 200 ఓట్లకు పైగా ఓట్లు ఉన్న ఈ గ్రామంలో ఓ అభ్యర్థి గ్రామ అభివృద్ధి ముందుగానే రూ.4 లక్షల ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు. ఓట్లన్నీ తనకు వేయాలని గ్రామ పెద్దలతో చర్చలు జరుపుతున్నాడు.
సదాశివనగర్ మండలంలోని మేజర్ పంచాయతీలు అడ్లూర్ ఎల్లారెడ్డి, సదాశివనగర్‌లో పోటీల్లో ఉన్న అభ్యర్థులు కుల సంఘాలతో సంప్రదింపులు జరిపారు. మెజార్టీ ఓట్లు ఉన్న కులాలకు బిల్డింగ్లు, కాంపౌండ్‌వాల్స్ నిర్మాణం, సంఘాలకు స్థలం కోసం హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా నిధులు ఇప్పిస్తామంటున్నారు. కొందరు అభ్యర్థులు కుల సంఘాలకు ఇచ్చే అమౌంట్‌ను మధ్యవర్తుల దగ్గర పెట్టేందుకు సిద్ధమయ్యారు.
భిక్కనూరు మండలంలో అభ్యర్థులు కుల సంఘాలు, గల్లీల వారీగా ఓట్ల కోసం బేరసారాలు చేస్తున్నారు. ప్యాకేజీ ఆఫర్ చేస్తూ తమకు ఓట్లు వేయించాలని కోరుతున్నారు.
రాజంపేట మండలంలో ఓ అభ్యర్థి రెండు కుల సంఘాలకు భూమి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆయా కుల సంఘాల ప్రతినిధులను కూర్చోబెట్టి తనకు ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఆయా సంఘాలకు 2 గుంటల భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
రామారెడ్డి మండలంలోని కొన్ని గ్రామాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఇప్పటికే కొన్ని వర్గాల వారికి డబ్బులు కూడా అందజేసినట్లు సమాచారం. మరికొన్ని మండలాల్లో ఇలాంటి బేరసారాలు జరుగుతున్నాయి.
కొన్ని పంచాయతీల్లో కుల సంఘాలకు వంట పాత్రలు కొనిచ్చేందుకు అభ్యర్థులు ముందుకొచ్చారు. అయితే తమకు వంట పాత్రలు వద్దని, బిల్డింగ్ నిర్మాణాలకు పైసలు ఇవ్వాలని కుల పెద్దలు చెప్పినట్లు తెలిసింది.
