సర్పంచే రైతు వేదికకు పెయింటర్

సర్పంచే రైతు వేదికకు పెయింటర్

యాదాద్రి/గుండాల, వెలుగు: పేరుకు సర్పంచ్​.. రైతు వేదిక బిల్లుల పుణ్యమాని చివరకు పెయింటర్​గా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాదాద్రి జిల్లా గుండాల మండలం పెద్దపడిశాల సర్పంచ్ రావుల మల్లేశ్​గ్రామంలో రైతు వేదికను నిర్మించారు. పనులు పూర్తి కావచ్చాయి. రేకులకు కలర్​ మాత్రం వేయించాల్సి ఉంది. రైతు వేదిక నిర్మాణం బిల్లు రూ. 22 లక్షలు కాగా.. ఏడాది   నుంచి విడతలవారీగా ఇప్పటివరకూ రూ. 14 లక్షలు వచ్చాయి. క్వాలిటీ కంట్రోల్​ ఆఫీసర్లు వచ్చి పనులను పరిశీలించి వెళ్లారు. బిల్లులు కూడా పంపించామంటూ ఆఫీసర్లు చెబుతున్నారే కానీ రిలీజ్​ చేయడం లేదు. పైగా రేకులకు కూడా కలర్​ వేయించాలని సంబంధిత ఆఫీసర్లు చెప్పారు. దీంతో చివరకు తానే కూలీగా మారి ఆదివారం తెల్లవారుజామునే బ్రష్​తో కలర్ వేశారు. రైతు వేదికకు సర్పంచే కలర్​ వేస్తున్న వీడియో వైరల్​ అయింది. విషయం తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు సర్పంచ్​ మల్లేశ్​ను కలిసి ఆరా తీయగా బిల్లులు రాక ఇప్పటికే అప్పుల పాలయ్యానని చెప్పారు. బిల్లులు రాకపోవడం వల్ల గతంలో పని చేసిన కూలీలకు పూర్తిగా డబ్బులివ్వలేదని, అందుకే వాళ్లు రావడం లేదని, అందుకే తానే రంగు వేసినట్టు తెలిపారు. బిల్లులు త్వరగా మంజూరు చేయాలని ఆఫీసర్లకు విజ్ఞప్తి చేశారు.