గచ్చిబౌలిలో సెక్యూరిటీ గార్డు హత్య

గచ్చిబౌలిలో సెక్యూరిటీ గార్డు హత్య

గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలో నిర్మాణంలోని ఓ భవన సెక్యూరిటీ గార్డు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి ఔటర్​రింగు రోడ్డు సమీపంలో సర్వే నంబర్ 90/1లో మయూరి కన్​స్ర్టక్షన్స్​భారీ బిల్డింగ్ నిర్మిస్తోంది. ఇందులో ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్​ను మైక్రోన్ సంస్థకు అప్పగించారు. ఎలక్ట్రికల్ వస్తువులను భవనం స్టోర్ రూమ్ లో నిల్వ చేశారు. ఈ గదికి నగరంలోని జగద్గిరిగుట్టకు చెందిన దాసరి రాజు(59) సెక్యూరిటీగా ఉన్నాడు. రోజూ మాదిరిగానే సోమవారం రాత్రి విధులకు హాజరయ్యాడు. 

మంగళవారం ఉదయం 6 గంటలకు రక్తపు మడుగులో చనిపోయి ఉండడాన్ని భవనంలో పనిచేసే వ్యక్తులు గుర్తించారు. డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సెక్యూరిటీ గార్డు రాజు తలపై ఇనుప రాడ్డుతో కొట్టడంతో తీవ్ర గాయమై మృతి చెందినట్లు గుర్తించారు. నిందితుల కోసం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ వ్యక్తి స్టోర్ రూమ్ లోకి వెళ్లినట్లు, తర్వాత కాసేపటికి బయటకు వచ్చి, ఆటోలో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తేలింది. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.