వ్యవసాయ అభివృద్ధిలో విత్తనాలే కీలకం.. ఆర్థిక అభివృద్ది.. ఆహార ఉత్పత్తిలో కీలకపాత్ర

వ్యవసాయ అభివృద్ధిలో  విత్తనాలే కీలకం.. ఆర్థిక అభివృద్ది.. ఆహార ఉత్పత్తిలో  కీలకపాత్ర

విత్తనాలే లేకుంటే  వ్యవసాయం లేదు.  ఆహారంలో  పౌష్టికాలు ఉండడానికి మంచి విత్తనాలే మూలం.  ఆ విధంగా విత్తనాలు వ్యవసాయ అభివృద్ధి,  ఆర్థిక అభివృద్ధి, ఆహార ఉత్పత్తిలో కీలకపాత్ర వహిస్తాయి.  సొంత పొలాల్లో  విత్తనాలను  ఉపయోగించుకోవడం,  తెలిసిన  రైతుల  నుంచి  విత్తనాలను బదులు తీసుకోవడం మొదలు కొనుగోలు చేయడం వరకు భారతీయ రైతాంగం  విపరిమాణ మార్పు చెందింది. ఆధునిక రైతును ఆందోళనపరిచే అనేక అంశాలలో ఈ మధ్య విత్తనాలు కూడా చేరిపోయాయి.  చీడ, పీడను  తట్టుకునే  విత్తనాలు దొరకక  రైతులు  నానాయాతన  పడుతున్నారు. 

వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు ఒకప్పుడు  రైతులు, లేదా ఇతర గ్రామీణులు పంటల నుంచి ఎంచుకొని  దాచుకునేవారు. పంచుకునేవారు. మంచి  విత్తనాలను  తామే ఎంచుకొని, మేలు రకాలను పునరుత్పత్తి చేసుకునేవారు.  ఏళ్ల క్రితం భారత  ప్రభుత్వం దిగుబడి పెంచాలని, హరిత విప్లవం  పేరిట  అధిక  దిగుబడి  వంగడాలను  ప్రోత్సహిస్తూ  రైతుల  విత్తన పద్ధతులను మార్చివేసింది.  

హరిత విప్లవం నేపథ్యంలో  హైబ్రిడ్  విత్తనాలకు విస్తృతంగా  సబ్సిడీలు ఇచ్చి  ప్రోత్సహించడం వల్ల,  రైతులు  క్రమంగా  తమ దగ్గర ఉన్న మేలైన  సంప్రదాయ  విత్తనాలను  మరిచిపోయారు.  క్రమంగా  రైతులు  తమకే  సొంతం అయిన విత్తన పరిజ్ఞానాన్ని,  పద్ధతులను  మరిచిపోయారు. 2003 నుంచి  క్రమంగా, విత్తన ఉత్పత్తిని ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలపరం చేసింది.  

ప్రభు త్వాలు, సంస్కరణల పేరిట, నాణ్యత పేరిట, విత్తన ఉత్పత్తిని కూడా ప్రైవేటుపరం చేశాయి.  దరిమిలా ప్రస్తుతం రైతులు విత్తన విక్రయదారుల చుట్టూ తిరుగుతూ ప్రైవేటు పరిశ్రమ మీద ఆధారపడి, వారి విత్తనాలు ఉపయోగిస్తున్నారు. 

పర్యావరణ సుస్థిరత 

సంప్రదాయ విత్తనాలు (దేశీయ లేదా వారసత్వ రకాలు) మానవ ఆరోగ్యానికి, పర్యావరణ 
సుస్థిరతకు రెండింటికీ చాలా ముఖ్యమైనవి. వాటి నుంచి వచ్చే పంటలలో పోషకాలు అధికంగా ఉంటాయి. వాతావరణ మార్పులను తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి.  వాటితో  సాగువలన  జీవ వైవిధ్యం కాపాడే అవకాశాలు పెరుగుతాయి.   

ఐక్యరాజ్యసమితి సంస్థ  (UNCTAD) నివేదిక ప్రకారం ఆసియా, ఆఫ్రికా, మధ్య అమెరికాలో  కొన్ని ఆధునిక వ్యవసాయ ప్రాంతాలలో ఆహార ఉత్పత్తి  సగానికి పైగా క్షీణిస్తోంది.  ఇటువంటి  పరిస్థితిని నివారించడానికి సుస్థిరమైన, వాతావరణ  మార్పులను తట్టుకోగల,  పునరుత్పత్తి వ్యవస్థ వైపు మార్పును  చేపట్టాలని ఈ  నివేదిక  కోరుతున్నది.   

ఒడిశాలోని సంభవ్ అనే సంస్థ  లవంగం గింజ,  జాక్ గింజ,  నల్ల బియ్యం, కత్తిగింజ వంటి కనుమరుగవుతున్న  పంటలను విజయవంతంగా పండించింది. ఈ సంస్థ  పునరుద్ధరించిన అడవిలో 1,000 కంటే ఎక్కువ జాతుల మొక్కలు ఉన్నాయి.  

తక్కువ నీటిని ఉపయోగించే  సిస్టమ్ ఆఫ్  రైస్  ఇంటెన్సిఫికేషన్ (ఎస్ఆర్ఐ) పద్ధతులను ఉపయోగిస్తూ 500 రకాల వరిని  పండిస్తున్నారు.  దాదాపు 700  దేశీయ వరి రకాలతో కూడిన విత్తన బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ విత్తనాలలో చాలా వరకు కరువు/ వరదలు వంటి కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునే రకాలు. 

తెలంగాణ విత్తన పండుగ

రాగి,  నవర బియ్యం, ఎర్ర బియ్యం,  కోడో మిల్లెట్, మినుములు, నువ్వులు వంటి సంప్రదాయ విత్తనాలు పోషకపరంగా ఉన్నతమైనవి మాత్రమే కాకుండా పర్యావరణపరంగా కూడా స్థిరంగా ఉంటాయి.  ఇవి భారతదేశ ఆహార భద్రత, సుస్థిరతకు చాలా అవసరం.  మేలైన విత్తన రకాలు  అందరు  రైతులు సహజమైన పద్ధతులలో  వినియోగించడానికి, దోహదపడేవిధంగా విత్తన ఉత్సవాలు దేశవ్యాప్తంగా అనేక సంస్థలు, వ్యక్తులు  గత  రెండు  దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు.

  గత  ఏడాది  మొట్టమొదటి  వార్షిక  తెలంగాణ విత్తన పండుగ  నిర్వహించారు.  ఆధునిక  రకాలతో  పోలిస్తే దాదాపు అన్ని సంప్రదాయ వరి రకాలు తమ స్థానిక ప్రాంతాలలో ఆ  తెగుళ్లు, వ్యాధులు  నిరోధించగలిగే శక్తితో ఉంటాయి.  వాటిమీద కూడా రసాయనాలు వాడితే,  తెగుళ్లు వ్యాధుల పట్ల వాటి దుర్బలత్వాన్ని పెంచుతుంది.  నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ దగ్గర 664 రకాల ఆవాల రకాలను  నిల్వ చేశారు.  

భారత ఉపఖండంతోపాటు ఆసియాలోని ఇతర దేశాలలో కూడా పప్పు ధాన్యాలు వివిధ రకాలు కనిపిస్తాయి. ఎన్‌‌‌‌బిపిజిఆర్  వద్ద  ఆసియా నలుమూలల నుంచి సేకరించిన 1700 రకాల పప్పుల నమూనాల సేకరణ ఉంది. కాకపోతే, ఇవిగాక వాళ్ల దగ్గర ఉన్న ఏ విత్తన రకమైనా  రైతులకు అందుబాటులోకి  రావడం లేదు.

మిశ్రమ వ్యవసాయం సంప్రదాయంగా పంజ కృషి అనేది ఏడాది పొడవునా సాగించే ఒక దేశీయ వ్యవసాయ పద్ధతి. అందుబాటులో ఉన్న స్థానిక సహజ వనరులపై పూర్తిగా ఆధారపడుతుంది.  ఈ వ్యవ సాయ పద్ధతిలో మిశ్రమ వ్యవసాయం, అంటే అంతరపంటల పద్ధతిని అనుసరిస్తారు. ఒకే పొలంలో  వివిధ రకాల చిరుధాన్యాలు, మొక్కజొన్న,  నువ్వులు,  కందిపప్పు, వరి, కీర మొదలైనవి సాగు చేస్తారు. మిశ్రమ వ్యవసాయం జీవవైవిధ్యాన్ని  సృష్టిస్తుంది.  

పంజ కృషి  పూర్తిగా  ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది.  కాబట్టి ఎలాంటి  నీటిపారుదల సౌకర్యాల అవసరం లేదు.  భూమిని  దున్నడం,  విత్తనాలు నాటడం,  ఇతర అన్ని వ్యవసాయ ప్రక్రియలు వర్షపాతం లభ్యతపై  ఆధారపడి ఉంటాయి.  కొండ ప్రాంతం,  బలమైన  గాలులు  కారణంగా ఈ వ్యవసాయ పద్ధతిలో ఆవుపేడ లేదా మరే ఇతర సేంద్రియ ఎరువును కూడా ఉపయోగించరు. కానీ, ఈ వ్యవసాయ పద్ధతిలో మానవ,  జంతు శ్రమకు,  ప్రజల మధ్య సమన్వయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.  

పంజ కృషిలో  భాగంగా, 16 రకాల చిరుధాన్యాలు, 12 రకాల బఠానీలు, 9 రకాల కూరగాయలు, 100 రకాల దుంపలు, 140 రకాల  ఆకుకూరలు,  నూనె గింజలతో సహా సుమారు 280 రకాల తినదగిన పంటలను పండిస్తారు. సమాజానికి  ఏడాది  పొడవునా తగినంత ఆహారాన్ని అందించడానికి పూర్వీకులు  ఈ వ్యవసాయ పద్ధతిని రూపొందించారు. 

రైతుల పరిజ్ఞానం పెంచేవిధంగా విత్తన వ్యవస్థను నిర్మించాలి

రైతులలో విత్తనాల విజ్ఞానం కొండలా పెరగాల్సిన పరిస్థితులలో ప్రైవేటు గుత్తాధిపత్యం పెరిగినందువల్ల వారికి అందడం లేదు. రానురాను విత్తన విజ్ఞానం రహస్యంగా మార్చుతున్నారు విత్తన శాస్త్రవేత్తలు, కంపెనీలు. పెరుగుతున్న వ్యాపారానికి ఈ పరిశోధన కొందరి గుప్పిట్లో వ్యాపార ఎత్తుగడగా మారింది. 

అందరికీ చెందాల్సిన విత్తన విజ్ఞానం కొందరికే పరిమితం అవుతున్నది. వారి వ్యక్తిగత సంపద సృష్టికి అదే మూలస్తంభంగా మారింది. విత్తనాల మీద స్వావలంబన అత్యంత మౌలికమైన అవసరం.  రైతులకు విత్తన స్వాతంత్ర్యం కోసం రాష్ట్రాలు చట్టాలు తీసుకురావాలి.  

రైతుల పరిజ్ఞానం పెంచేవిధంగా విత్తన వ్యవస్థను నిర్మించాలి.  విత్తన  జన్యుసంపదను  కలుషితం కాకుండా కాపాడాలి.   చట్ట వ్యతిరేకంగా  జన్యుసంపదకు హానిచేసే  విత్తనాలను  ప్రవేశపెట్టే  కంపెనీల మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి.  గ్రామీణ స్థాయి నుంచి విత్తనాలను  రైతులు స్వేచ్ఛగా ఇచ్చి పుచ్చుకునే పద్ధతులను ప్రోత్సహించాలి.     

రైతు తన విత్తనాలు దాచుకుని వాడే రోజులలో  విత్తనాల మీద  సున్నా ఖర్చు ఉండేది.  రైతుకు తాను సేకరించిన విత్తనాల మీద  పరిజ్ఞానం ఉండేది.  వేరే  రైతు దగ్గర  తెచ్చుకున్నా  నమ్మకం ఉండేది.  ఆధునిక  విత్తనాలకు  రైతులు అలవాటుపడ్డ  తరువాత   పూర్వజ్ఞానం పోయింది. 

ఆధునిక  విత్తనాలకు చీడపీడల  బెడద పెరిగింది. దానికి పరిష్కారంగా వాడుతున్న కీటక నాశక  రసాయనాల వాడకం పెరిగింది.  వాటిని వాడే  క్రమంలో  రైతు ఆరోగ్యం ప్రమాదంలో పడింది.  ఈనాటి  రైతు, వ్యవసాయ సంక్షోభాలకు  పరిష్కారం  సంప్రదాయ  విత్తనాలను తిరిగి  ప్రాచుర్యంలోకి  తేవడం మినహా గత్యంతరం లేదు.

-డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్​-