హరీష్ రావును హుజూరాబాద్ నుంచి బయటకు పంపండి

హరీష్ రావును హుజూరాబాద్ నుంచి బయటకు పంపండి
  • ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ నేత కోదండరెడ్డి ఫిర్యాదు

హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రక్రియను మంత్రి హరీష్ రావు  ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఆయనను అర్జంటుగా నియోజకవర్గం నుంచి బయటకు పంపాలని కోరుతూ ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోదండరెడ్డి ఫిర్యాదు చేశారు. గత నెల రోజుల నుంచి నియోజకవర్గంలోనే మకాం వేసి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఒకవేళ నియోజకవర్గంలో ఉండాలనుకుంటే మంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా చేయాలని ఆయన ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ ను కోరారు.

పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ మరోవైపు మంత్రిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నందున ఓటర్లకు ఎలాంటి సందేశం వెళుతుందో ఆలోచించాలని ఆయన సూచించారు. టీఎన్ శేషన్ ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేసే అవకాశం లేకుండా నిష్పక్షపాతంగా.. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా చూశారని ఆయన గుర్తు చేశారు.