
- రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో వేలి ముద్రల క్లోనింగ్
- ఏడుగురని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
- 3.4 లక్షల నగదు, 2,500 ఫేక్ ఫింగర్ ప్రింట్స్ స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: నకిలీ ఫింగర్ ప్రింట్స్ తయారు చేస్తున్న గ్యాంగ్ గుట్టురట్టయింది. రబ్బర్ ఫింగర్ ప్రింట్స్‌తో బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.3.4 లక్షల నగదు, 2,500 ఫేక్ ఫింగర్ ప్రింట్స్, 121 సిమ్ కార్డులు, 20 సెల్‌ఫోన్లు, డెబిట్, పాన్, ఆధార్ కార్డులు, బయోమెట్రిక్ స్కానర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర
గురువారం వెల్లడించారు.
ఆన్‌లైన్ సర్వీసెస్ ఏజెన్సీకి టోకరా
హైదరాబాద్ మాదాపూర్‌లోని ‘ఈ పాయింట్ ఇండియా’ సంస్థ బ్యాంకింగ్ సర్వీస్ నిర్వహిస్తున్నది. యాప్ ద్వారా వివిధ రకాల బిల్ పేమెంట్స్, మనీ ట్రాన్స్‌ఫర్స్ తదితర సేవలు అందిస్తున్నది. ఇందులో భాగంగా 2019లో రాయ్‌నెట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో అగ్రిమెంట్ చేసుకుంది. ఈపాయింట్ ఇండియాలో వర్క్ చేసేందుకు ఏజెంట్స్‌ను నియమించుకుంది. కస్టమర్లకు చెందిన ఆధార్, పాన్ కార్డులు, బ్యాంక్ పాస్ బుక్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను ఈ సంస్థ సేకరించి.. ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్)తో బ్యాంక్ కస్టమర్లకు సర్వీస్ అందిస్తున్నది. ఈ క్రమంలో ఏజెంట్లకు యూజర్ ఐడీ, పాస్‌వర్డులు ఇచ్చారు. ఈ సంస్థలో పని చేసేందుకు ఏపీ ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన నల్లగండ్ల వెంకటేశ్వర్లు ( 48) ఏజెంట్‌గా ఏప్రిల్ 4న లైసెన్స్ తీసుకున్నాడు. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ తీసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా బీరంగూడలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్నాడు. 5వ తేదీ నుంచి లావాదేవీలు ప్రారంభించాడు. దోర్నాలకు చెందిన మెఘావత్ శంకర్ నాయక్ (35), రథం శ్రీనివాస్ (38), షేక్ ఖాసీం వలీ (42), ఒంగోలుకు చెందిన దర్శనం సామ్యూల్ (42), విశ్వనాథ అనిల్‌కుమార్ (39), గుంటూరుకు చెందిన చల్లా మణికంఠ (40)తో కలిసి ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. బ్యాంకింగ్ సర్వీసెస్, ల్యాండ్ రికార్డ్స్, రిజిస్ట్రేషన్‌లో అనుభవం ఉండడంతో ఫేక్ ఫింగర్ ప్రింట్స్‌కి ప్లాన్ చేశాడు. ఏపీకి చెందిన ఐజీఆర్‌ఎస్ పోర్టల్ నుంచి ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, వాటికి సంబంధించిన ఆధార్ కార్డులు, పేర్లు, ఫింగర్ ప్రింట్స్ సేకరించాడు.
ఒక్కొక్కరు ఒక్కో పని
మెఘావత్ శంకర్ నాయక్.. ఫింగర్ ప్రింట్స్‌తో మ్యాచ్ అయిన బ్యాంక్ అకౌంట్స్, వాటిలో బ్యాలెన్స్, కేవైసీ ఇతర డాక్యుమెంట్లను కలెక్ట్ చేసేవాడు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్‌లోని ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా రథం శ్రీనివాస్ రబ్బర్ ఫింగర్ ప్రింట్స్ తయారు చేసేవాడు. ఆధార్‌తో లింకైన ఫింగర్ ప్రింట్స్ డేటాతో సిమ్ కార్డులను సామ్యూల్ కలెక్ట్ చేసేవాడు. డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్‌లోని అకౌంట్స్ ర్యాండమ్ డేటా, కేవైసీ డాక్యుమెంట్లను మణికంఠ తయారు చేసేవాడు. కొట్టేసిన డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు ఫేక్ అకౌంట్లను షేక్ ఖాసీం.. క్రియేట్ చేసేవాడు. తమ వద్దకు వచ్చిన కస్టమర్ల సిమ్ కార్డ్ యాక్టివేషన్‌లో ఫెయిల్ స్టేటస్ చూపించేవారు. దీంతో ఒకే కస్టమర్ పేరుతో రెండు వేర్వేరు సిమ్ కార్డులు వచ్చేలా చేసి డిజిటల్ కేవైసీ యాక్టివేట్ చేసేవారు.
10 వేల ఫింగర్ ప్రింట్స్ క్లోనింగ్
ఈపాయింట్ ఇండియా కస్టమర్ల డేటాతో మొత్తం 149 బ్యాంక్ అకౌంట్ల వివరాలను నిందితులు తీసుకున్నారు. కస్టమర్ల అడ్రస్, ఫోన్ నంబర్లతోపాటు వారి పేరుపై ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ డౌన్‌లోడ్ చేసుకున్నారు.10,000లకు పైగా ఫింగర్ ప్రింట్స్ క్లోనింగ్ చేశారు. ఫేక్ రబ్బర్ ప్రింట్స్ తయారు చేసి బ్యాంక్ అకౌంట్స్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు. వీటితో డిజిటల్ లావాదేవీలు నిర్వహించారు. అవే ఫింగర్ ప్రింట్స్‌తో సిమ్ కార్డులు సేకరించారు. ఇలా నెల రోజుల వ్యవధిలో 9 బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.14.64 లక్షలు విత్‌డ్రా చేశారు. బాధితులు, ఈపాయింట్ ఇండియా నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. ప్రధాన నిందితుడు వెంకటేశ్వర్లుతో సహా ఆరుగురుని అరెస్ట్ చేశారు. నిందితులను కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలు రాబడతామని సీపీ చెప్పారు.