
- రాత్రికి రాత్రే ముంచెత్తిన వరద
- ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని దుస్థితి
ఎల్బీనగర్, వెలుగు: భారీ వర్షానికి రంగారెడ్డి జిల్లా మీర్ పేట పరిధిలోని మిథిలానగర్, సత్యసాయి నగర్ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాలనీల్లోని రోడ్లన్నీ ఏరులను తలపిస్తున్నాయి. ఇంట్లో ఉన్న మనిషి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. శనివారం రాత్రికి రాత్రి పైకాలనీల నుంచి వరద వచ్చి చేరడం, అధికారులకు ఫోన్ చేసినా సకాలంలో స్పందించకపోవడంతో ఈ జలప్రళయానికి కారణం అయ్యిందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇండ్లలోకి వరద నీరు చేరి నిత్యావసర సరుకులు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయినట్లు తెలిపారు. వరదలు వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి దాపరిస్తుందని, ఎమర్జెన్సీ ఉన్నా హాస్పిటల్కు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఆదివారం కాబట్టి సరిపోయిందని సోమవారం నుంచి తాము ఉద్యోగలకు పిల్లలు స్కూల్స్ కు ఎలా పోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జలప్రళయానికి ఇదే కారణం..!
బాలాపూర్, బడంగ్ పేట ప్రాంత పైభాగాన ఉన్న కాలనీల నుంచి వరద నీరు దిగువన ఉన్న మీర్ పేటలో ఉన్న చెరువుల్లోకి చేరుతుంది. అయితే ఈ చెరువులు నిండిన సమయంలో పై బాగాన ఉన్న కాలనీలు చెరువు బ్యాక్ వాటర్ తో నిండిపోయేవి. కింద భాగంలో ఉన్న మిథిలా నగర్, సత్యసాయి నగర్ కాలనీలు కూడా మునిగేవి. దీంతో కొన్ని కోట్ల నిధులతో గత ప్రభుత్వ పాలకులు ఎస్ఎన్డీపీ నాలాల నిర్మాణం చేపట్టారు. అయినా ఈ సమస్య తీరలేదు. పై కాలనీ నుంచి వచ్చిన వరద ప్రవాహాన్ని ఎస్ఎన్డీపీ నాలా ద్వారా మీర్ పేట చెరువులోకి అటు నుంచి కింది బాగం అయిన సరూర్ నగర్ చెరువు వైపు తీసుకెళ్లాల్సి ఉండగా, అంతటా పనులు పూర్తి అయ్యాయి.
కానీ మీర్ పేట జిల్లెలగూడ చెరువు మధ్యలో ఉన్న కిలోమీటర్నర వరకు ఎస్ఎన్డీపీ బాక్స్ డ్రైన్ నిర్మించకుండా డ్రైనేజ్ లైన్ లోకి వరద ప్రవాహాన్ని వదలడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు అంటున్నారు. ఈ కీలక భాగంలో స్థానిక నాయకుల బంధువులకు లేదా వారి ఆస్తులకు డ్రైనేజ్ నిర్మాణం వల్ల ఆటంకం ఏర్పడుతుందనే పనులు చేయలేదంటున్నారు. ఇప్పటికైనా ప్రస్తుత అధికారులు తమ బాధను అర్థం చేసుకుని మిగిలిపోయిన నాలా పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు.