షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్‌

షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్‌
  • మట్టిదిబ్బలు కూలి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వ చర్య

రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చాటాన్ పల్లి గేట్ దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేస్తుండగా మట్టి దిబ్బలు కూలి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం స్పందించింది. ఘటనపై ఆరా తీసిన ప్రభుత్వం పనులు చేస్తున్న చోట ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని పేర్కొంటూ షాదన్ నగర్ మున్సిపల్ కమిషనర్ లావణ్యపై సస్పెన్షన్ వేటు వేసింది. 
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాలువను మెయిన్ రోడ్డుపై నుంచి 20 అడుగుల లోతున తవ్వుతుండగా నిన్న సోమవారం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఫరూక్ నగర్ మండలం ఉప్పరి గడ్డ తండాకు  చెందిన శ్రీను(48), కృష్ణయ్య (45) మృతి చెందగా.. బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టడంతో పోలీసులు సర్దిచెప్పి ప్రమాదంపై కేసు నమోదు చేశారు.  ప్రభుత్వం స్పందించి చేసిన ప్రాథమిక విచారణలో ఘటనకు బాధ్యతగా మున్సిపల్ కమిషనర్ లావణ్యను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రమాదం పై పూర్తి స్థాయి విచారణ నివేదిక వచ్చే వరకు సస్పెన్షన్ ఉత్తర్వులు ఎత్తివేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.