నో బైటింగ్..ఓన్లీ ఓటింగ్ అంటూ హేమకు నరేష్ సూచన

నో బైటింగ్..ఓన్లీ ఓటింగ్ అంటూ హేమకు నరేష్ సూచన
  • మా ఎన్నికల్లో కోశాధికారిగా గెలిచిన శివబాలాజీ
  • హేమ శివబాలాజీ చెయ్యి కొరికిన ఘటనపై నవ్వుతూ స్పందించిన నరేష్ 
  • జోకులు, మీమ్స్ తో స్పందిస్తున్న నెటిజనులు 

హైదరాబాద్: హేమ తన చేయి కొరికినందుకే శివబాలాజీ విజయం సాధించాడంటూ ఆయన గెలుపుపై నెటిజనులు స్పందిస్తున్నారు. ఉత్కంఠ భరితంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నటి హేమ నటుడు శివబాలాజీ చెయ్యి కొరికిన ఘటన వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అభిమానులు, నెటిజన్లు మీమ్స్ పెడుతూ.. కామెంట్లతో రకరకాలుగా స్పందిస్తుండడంతో మా ఎన్నికల ఘట్టం రసవత్తరంగా మారింది. జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన హేమ.. నటుడు శివబాలాజీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగిందో గానీ సడెన్ గా హేమ శివబాలాజీ చెయ్యి పట్టుకుని కొరికేశారు. పంటిగాట్లు పడడంతో శివబాలాజీ మరీ అంత కోపమా అంటూ చెయ్యి విదుల్చుకుని పంటిగాట్లు చూసుకున్నారు. సెప్టిక్ చేస్తుందేమోనన్న అనుమానంతో ఆస్పత్రికి వెళ్లి టీటీ ఇంజెక్షన్ వేయించుకుని తిరిగివచ్చినట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై నరేష్ వెంటనే నవ్వుతూ స్పందించారు. ఎంత కోపమైతే మాత్రం మరీ కొరకుతారా..? రావయ్యా చూపించు.. ఎందుకు సిగ్గు.. అంటూ శివ బాలాజీ చెయ్యి పట్లుకుని అందరికీ చూపించే ప్రయత్నం చేయగా.. శివబాలాజీ వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో అభిమానులు, నెటిజనులు మీమ్స్ తయారు చేస్తూ ఘటనను రక్తికట్టిస్తున్నారు. 
శివబాలాజీ విజయం
 ఉత్కంఠ రేపిన ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ నుంచి కోశాధికారి (ట్రెజరర్)గా పోటీ చేసిన శివబాలాజీ విజయం సాధించారు. తన ప్రత్యర్థిగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన నాగినీడుపై శివబాలాజీ గెలుపొందారు. నాగినీడుకు 284 ఓట్లు రాగా శివబాలాజీకి 316 ఓట్లు వచ్చాయి.