- 1.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిమ్‌లో ఘటన
- అపార్ట్‌మెంట్‌లో దాక్కున్న నిందితుడు
- పోలీసులు లోపలికి వెళ్లే సరికి
- తనను తాను కాల్చుకొని చనిపోయిన దుండగుడు
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఓ జిమ్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా, మరో నలుగురు గాయపడ్డారు. వైట్‌హౌస్‌కు దాదాపు 1.6 కిలోమీటర్ల దూరంలోని లోగన్ సర్కిల్ ప్రాంతంలో గురువారం ఉదయం 8 గంటల ముందు ఈ ఘటన జరిగింది. కాల్పుల తర్వాత నిందితుడు పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లోని ఏడో అంతస్తులో ఓ ఫ్లాట్‌లోకి వెళ్లి దాక్కున్నాడని మెట్రోపాలిటన్ పోలీస్ తాత్కాలిక చీఫ్ జేడబ్ల్యూ కారోల్ తెలిపారు.
పోలీస్ నెగోషియేటర్లు అతడితో మాటలు కలిపారని, దాదాపు గంట తర్వాత లోపలి నుంచి తుపాకీ పేలిన శబ్దం రావడంతో బలవంతంగా లోపలికి వెళ్లారని చెప్పారు. అప్పటికే నిందితుడు తనను తాను కాల్చుకుని గాయాలతో పడి ఉన్నాడని తెలిపారు. అతడు చనిపోయాడని అధికార వర్గాలను ఉటంకిస్తూ ఎన్‌బీసీ, ఫాక్స్ న్యూస్ రిపోర్ట్ చేశాయి. కానీ అధికారులు ధ్రువీకరించలేదు.
జిమ్ సభ్యుడే నిందితుడు
నిందితుడు ఆ ఫ్లాట్‌లోనే నివసిస్తున్నాడని, కాల్పులు మొదలైన జిమ్‌లో అతడు సభ్యుడని పోలీసులు భావిస్తున్నారు. కాల్పులు జరిగిన 30 సెకన్లలోనే పోలీసులు అక్కడికి చేరుకోగా, బుల్లెట్ గాయంతో పడి ఉన్న ఓ వ్యక్తి కనిపించాడు. నిందితుడు, మృతుడి పేర్లను పోలీసులు వెల్లడించలేదు. గాయపడిన నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, కాల్పులకు కారణమేంటో దర్యాప్తు చేస్తున్నామని కారోల్ చెప్పారు. ఘటనతో భారీగా పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. సమీపంలోని స్కూళ్లకు లాక్‌డౌన్ విధించారు.
‘రక్తం ధారగా కారుతోంది’
జిమ్‌లో ఉన్న ఓ వ్యక్తి ఆ క్షణాలను మీడియాకు వివరించారు. తుపాకీ శబ్దాలు వినిపించగానే చూస్తే, బుల్లెట్ తగిలి పడిపోయిన ఓ వ్యక్తి దగ్గరికి మరో వ్యక్తి పరుగెత్తాడని చెప్పారు. ‘గాయపడిన వ్యక్తి నుంచి రక్తం ధారగా కారుతోంది. దగ్గరికి వెళ్లిన వ్యక్తి అతడు చనిపోయాడని అరిచాడు. దుండగుడు ఇంకా జిమ్‌లోనే ఉన్నాడో లేదో తెలియక భయంతో అందరం పరుగులు తీశాం’ అని తెలిపారు. జిమ్ నుంచి బయటకు పరిగెత్తిన తర్వాత కూడా మళ్లీ కాల్పుల శబ్దాలు వినిపించాయని చెప్పారు.
