సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో జాప్యం చేస్తే కాంట్రాక్ట్ రద్దు : సింగరేణి సీఎండీ బలరామ్

సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో జాప్యం చేస్తే కాంట్రాక్ట్ రద్దు : సింగరేణి సీఎండీ బలరామ్
  • ఇకపై పనుల గడువు పొడిగించం

హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థ చేపట్టిన సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో జాప్యం చేస్తే సంబంధిత ఏజెన్సీల కాంట్రాక్టులను రద్దు చేస్తామని సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ హెచ్చరించారు. అవసరమైతే ఏజెన్సీలను బ్లాక్‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌లో కూడా చేర్చుతామని స్పష్టం చేశారు.  గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని సింగరేణి భవన్‌‌‌‌‌‌‌‌లో అధికారులతో బలరామ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.నిర్మాణ ఏజెన్సీలు నిర్దేశించిన గడువులో  పనులు పూర్తి చేయకపోవడంపై బలరామ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

సింగరేణి నుంచి బిల్లుల చెల్లింపుల్లో ఎటువంటి జాప్యం లేనప్పటికీ.. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇకపై పనుల పొడిగింపులకు అవకాశం లేదని, అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేయకపోతే కాంట్రాక్టులు రద్దు చేయడంతో పాటు సంబంధిత ఏజెన్సీలను బ్లాక్‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌లో చేర్చనున్నట్లు బలరామ్ హెచ్చరించారు. అధికారులు కూడా ప్రత్యేక చొరవతో పని చేయకుంటే వారి తీరును సర్వీస్ రికార్డులో నమోదు చేస్తామని తెలిపారు.మొదటి దశలో 54.5 మెగావాట్లు, రెండవ దశలో 67.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ల నిర్మాణ పనులను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని అన్నారు.

మందమర్రిలో 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌కు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) పనులను ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సూర్య ఘర్ యోజన పథకం కింద 32.75 మెగావాట్ల రూఫ్‌‌‌‌‌‌‌‌టాప్ సోలార్ ప్లాంట్ల నిర్మాణాన్ని డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సూచించారు.