
ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైన డాక్యుమెంటో మనందరికి తెలుసు.ప్రభుత్వ, ప్రైయివేట్ సంస్థల్లో, విద్యా, ఉద్యోగ, ఉపాధి ఇలా దేనికైనా సరే ఆధార్ కార్డు తప్పనిసరి. ప్రజలకు అంతముఖ్యమైన కార్డుల నిర్వహణలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో తాజా లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన రిపోర్టులో సంచలన విషయాలు బయటికొచ్చాయి. ఈ రిపోర్టులో మిలియన్ల కొద్దిమంది మరణించినా వారి ఆధార్ కార్డులు ఇంకా సజీవంగానే ఉన్నాయ. వివరాల్లోకి వెళితే..
ఆధార్ కార్డు మొదలైనప్పటినుంచి అంటే గడిచిన14 యేళ్లలో మిలియన్ల కొద్ది మరణించినా వారి ఆధార్ కార్డులు మాత్రమే ఇంకా యాక్టివ్ గానే ఉన్నాయి. ఇటీవల RTI చట్టం కింద ఆధార్ కార్డుల సమాచారం కోరగా ఇచ్చిన రిపోర్టులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. RTI నివేదికలోని కీలక అంశాలు..
మరణాల సంఖ్య ,డీయాక్టివేట్ అయిన ఆధార్ కార్డుల మధ్య భారీ తేడా..
గత 14 సంవత్సరాలుగా ఆధార్ పథకం ప్రారంభమైనప్పటి నుంచిభారతదేశంలో సుమారు 11.7 కోట్ల మంది మరణించినట్లు అంచనా. అయితే Unique Identification Authority of India (UIDAI) కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే డీయాక్టివేట్ చేసిందని RTI ద్వారా తెలిసింది. దేశంలో నమోదైన మొత్తం మరణాలలో 10శాతం కంటే తక్కువ ఆధార్ కార్డులు మాత్రమే డీయాక్టివేట్ అయ్యాయి. ఇది UIDAI డేటాబేస్ అప్‌డేట్‌లో తీవ్రమైన లోపాలను సూచిస్తుంది.
జూన్ 2025 నాటికి భారతదేశంలో 142.39 కోట్ల మంది ఆధార్ హోల్డర్లు ఉన్నారు. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి ప్రకారం..ఏప్రిల్ 2025 నాటికి దేశ మొత్తం జనాభా 146.39 కోట్లుగా ఉంది. దీనికి విరుద్ధంగా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS) నుంచి అధికారిక డేటా ప్రకారం.. భారతదేశం 2007 ,2019 మధ్య ప్రతి సంవత్సరం సగటున 83.5 లక్షల మరణాలను నమోదు చేసింది. ఈ లెక్కన గడిచిన 14యేళ్లలో సుమారు 11కోట్ల మంది చనిపోయారని అంచనా.
UIDAI ఏమంటుందంటే..
UIDAI అధికారులు దీనిపై స్పందిస్తూ మరణించిన వారి ఆధార్‌లను డీయాక్టివేట్ చేసే ప్రక్రియ చాలా కష్టమైన పనే అని ఒప్పుకున్నారు. ఇది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే మరణ ధృవీకరణ పత్రాలు (death certificates) ,కుటుంబ సభ్యుల నుంచి వచ్చే అప్‌డేట్‌లపై ఆధారపడి ఉంటుందని కూల్ గా చెప్పేశారు.
ప్రత్యేక డేటా నిర్వహణ లోపం..మరణించిన వారి ఆధార్ కార్డుల గురించి UIDAI దగ్గర స్పష్టమైన డేటా లేదని కూడా వెల్లడైంది. అంటే ఎంతమంది ఆధార్ హోల్డర్లు మరణించారు..కానీ వారి కార్డులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయనే దానిపై ఖచ్చితమైన సమాచారం UIDAI దగ్గర లేదు.
చనిపోయినవారి ఆధార్ తొలగించకుంటే ఏమవుతుంది..?
ఈ అస్థవ్యస్థ ఆధార్ డేటా విశ్వసనీయత,అప్‌డేట్‌పై అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది.మరణించిన వారి ఆధార్ కార్డులు యాక్టివ్‌గా ఉంటే అవి దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. మోసగాళ్లు ఈ యాక్టివ్ ఆధార్ నంబర్లను ఉపయోగించి ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, బ్యాంకు ఖాతాలు తెరవడానికి, రుణాలు పొందడానికి ,ఇతర గుర్తింపు ఆధారిత సేవలను పొందడానికి అవకాశం చాలా ఎక్కువే.
ALSO READ : ఫౌజాసింగ్ను ఢీకొట్టింది ఎన్ఆర్ఐ..30 గంటల్లో నిందితుడిని పట్టుకున్న పోలీసులు
ప్రస్తుతం మరణించిన వ్యక్తి ఆధార్ కార్డును డీయాక్టివేట్ చేయడానికి ప్రత్యేక వ్యవస్థ లేదు. కుటుంబ సభ్యులు స్వయంగా UIDAIకి లేదా సంబంధిత అధికారులకు మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించి, ఆధార్‌ను డీయాక్టివేట్ చేయమని అభ్యర్థిస్తే తప్పా ఆధార్ డీయాక్టివేట్ కాదు. చాలామందికి ఈ ప్రక్రియ గురించి అవగాహన ఉండకపోవచ్చు.
UIDAI భవిష్యత్తులో ఏం చేయబోతోంది..
UIDAI, భారత రిజిస్ట్రార్ జనరల్ (RGI) తో కలిసి మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేయబడినప్పుడు ఆధార్‌ను డీయాక్టివేట్ చేసే యంత్రాంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉంది. ఇందుకు మరణించిన వారి ఆధార్ నంబర్‌ను డీయాక్టివేట్ చేసేందుకు కుటుంబ సభ్యుల సమ్మతి అవసరం అని అధికారులు తెలిపారు.
ఆధార్ 2.0 కింద కొత్త ఫీచర్లు: ఆధార్ 2.0 లో భాగంగా డేటాబేస్‌లో ఆటోమేటిక్ అప్‌డేట్లను అనుమతించే సిస్టమ్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిలో భాగంగా మరణాల రిజిస్ట్రేషన్‌తో ఆధార్ డీయాక్టివేషన్ ప్రక్రియను అనుసంధానించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.
బయోమెట్రిక్ లాకింగ్: ప్రస్తుతం మరణించిన వారి ఆధార్ నంబర్‌ను పూర్తిగా రద్దు చేయలేకపోయినా, వారి బయోమెట్రిక్ డేటాను లాక్ చేయవచ్చు. దీనివల్ల వారి వేలిముద్రలు లేదా ఐరిస్ స్కానింగ్‌లను ఉపయోగించి ఎవరూ మోసాలకు పాల్పడకుండా అరికట్టవచ్చు .
వ్యక్తి మరణించినా వారి ఆధార్ కార్డులు యాక్టివేట్ లో ఉండటంపై వచ్చిన రిపోర్టు.. ఆధార్ వ్యవస్థలో ప్రధాన లోపాన్ని ఎత్తిచూపుతోంది. వీటిని గుర్తించి భవిష్యత్తులో దుర్వినియోగం కాకుండా, ఆధార్ డేటా కాపాడాల్సిన ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది.