సింగరేణి లాభాల వాటా ఎప్పుడిస్తరో .. కోల్ ఇండియా ప్రకటనతో ఇక్కడ కార్మికుల్లో చర్చ

సింగరేణి లాభాల వాటా  ఎప్పుడిస్తరో .. కోల్ ఇండియా ప్రకటనతో ఇక్కడ కార్మికుల్లో చర్చ
  • ఏటా ఆర్థిక సంవత్సరం 
  • ముగిసిన ఐదార్నెళ్లకు చెల్లింపు
  • గతేడాది లెక్కనే జూన్​లోనే సింగరేణి యాజమాన్యం ఇవ్వాలి 
  • పిల్లల స్కూల్, కాలేజీ ఫీజులకు అక్కరకొస్తాయంటున్న కార్మికులు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు:  ఏటా ఆర్థిక సంవత్సరం ముగిసిన నెలరోజుల్లోనే కోల్​ఇండియా తన లాభాలను ప్రకటిస్తుంటే.. సింగరేణికి మాత్రం ఐదార్నెళ్లు పడుతుంది. దేశంలో ఏ పరిశ్రమైనా ఆర్థిక సంవత్సరం ముగిసిన నెల రోజుల్లోపే లాభాలు, నష్టాలు, టర్నోవర్, అప్పులు ఇతరత్రా వివరాలను వెల్లడిస్తుంది. తాజాగా బుధవారం కోల్​ఇండియా 2024– 25 ఆర్థిక సంవత్సర లాభ, నష్టాలను ప్రకటిం చింది. సంస్థ నికర లాభం రూ. 35,358 వేల కోట్లుగా తెలిపింది. 

ఇదిలా ఉంటే సింగరేణి కాలరీస్​కంపెనీ మాత్రం నెలల పాటు సమయం తీసుకుంటుండడం గమనార్హం. ఏటా సెప్టెంబర్, అక్టోబర్​నెలల్లోనే ప్రకటిస్తుంది. ఈసారి కూడా పాత పద్ధతినే పాటిస్తుందా అనే విషయంపై కార్మికుల్లో  చర్చ నడుస్తోంది. టెక్నాలజీ కాలంలోనూ లేట్ గా ప్రకటించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు.  నిరుడు ఒక్కసారే జూల్ లో ప్రకటించారు.  

పిల్లల చదువులకు అందడంలేదు 

జూన్​లో పిల్లల చదువులకు డబ్బుల అవసరం ఉంటాయి.  కాలేజీ, స్కూల్​ఫీజులు, బుక్స్​, యూనిఫాం, హాస్టల్​వంటి ఖర్చులకు కార్మికుల కుటుంబాలు అప్పులు చేయడం కామన్​గా మారింది. ఏటా సింగరేణి సెప్టెంబర్, అక్టోబర్​నెలల్లో సంస్థ లాభాలు, బోనస్​ను ప్రకటించి ఇస్తుండగా పెద్దగా అవసరం పడటం లేదనే చర్చ ఉంది. జూన్​లోనే ఇస్తే తమకు మేలు చేసినట్లవుతుందని కార్మికుల కుటుంబాలు పేర్కొంటున్నాయి. సంస్థ సీఎండీ ఎన్​. బలరాం ప్రస్తుతం డైరెక్టర్​ఫైనాన్స్​బాధ్యతలు కూడా చూస్తున్నారు. దీంతో  గత ఆర్థిక సంవత్సరానికి చెందిన కంపెనీ ఆర్థిక లావాదేవీలను జూన్​లో లేదంటే జూలైలోనై ప్రకటిస్తారనే ఆశతోనే కార్మికులు ఎదురు చూస్తున్నారు. 

జులైలోపే ప్రకటించేలా చర్చిస్తాం.. 

 మార్చి31తోనే ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఏప్రిల్​, మే నెలల్లోపు ఆడిట్, ఇతరత్రా లెక్కలు చూసుకుని   జులైలోపు టర్నోవర్, లాభాలు, అందులోని వాటాను కార్మికులను ప్రకటించే విధంగా సింగరేణి  డైరెక్టర్స్, సీఎండీ స్థాయిలో జరిగే స్ట్రక్చరల్ కమిటీ మీటింగ్​లో చర్చిస్తాం.  

కె. రాజ్ కుమార్, జనరల్​సెక్రటరీ, గుర్తింపు సంఘం(ఏఐటీయూసీ) 

టెక్నాలజీ కాలంలో కూడా లేట్

సింగరేణికి వచ్చిన లాభాల్లో కార్మికులకు ఎంత వాటా ఇవ్వాలనేందుకు సమయం ఎక్కువగా తీసుకుంటుంది. టెక్నాలజీ కాలంలో కూడా జూన్​లోపు సంస్థకు వచ్చిన లాభాలతో పాటు అందులో వాటాను ప్రకటించి కార్మికులకు ఇవ్వాల్సి ఉండగా సాకులు చెబుతూ మేనేజ్ మెంట్ కాలం గడుపుతుంది. 

రియాజ్​ అహ్మద్, ప్రెసిడెంట్, హెచ్ఎమ్మెస్​