అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటా

V6 Velugu Posted on Jul 25, 2021

సాయి చరణ్​కి  పాటలే ఊసులు..గమకాలే ఊపిరి..సరిగమలే ప్రపంచం. పెద్ద సింగర్​ అవ్వాలన్నది అతని కల. ఆ కలని నిజం చేసుకోవడానికి  చిన్నప్పట్నించీ పాటే ప్రాణంగా బతికాడు. అడ్డంకులు ఎన్నొచ్చినా నవ్వుతూ దాటొచ్చాడు.  సింగర్​గా తనని తాను నిరూపించుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. చివరికి అనుకున్నది సాధించాడు. ‘బెల్లం శ్రీదేవి అంటూ..’ ప్రజల పెదాల మీద డాన్స్​ చేశాడు. ప్లే బ్యాక్​ సింగర్​గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ జర్నీ ముచ్చట్లు అడిగితే బాల్యం నాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని చెప్పడం మొదలుపెట్టాడు.

నా పూర్తి పేరు సాయి చరణ్​ భాస్కరుని . పక్కా హైదరాబాదీని. పుట్టింది, పెరిగింది మొత్తం ఇక్కడే. నాన్న సెంట్రల్​ గవర్నమెంట్​లో రిటైర్​ అయ్యారు. అమ్మ హౌజ్​ వైఫ్​. నా బెటరాఫ్​ హరిణి సింగర్​గా అందరికీ పరిచయమే. నా మ్యూజిక్​ జర్నీ విషయానికొస్తే  అమ్మానాన్నలిద్దరికీ పాటలంటే చాలా ఇష్టం. ప్రత్యేకంగా నేర్చుకున్నది లేదు. కానీ అమ్మ కమ్మగా పాడుతుంది. నాన్న ఏ శృతినైనా అలవోకగా పట్టేస్తారు. ట్యూన్స్​ కడతారు. భక్తి పాటలు  కూడా రాస్తారు. దాంతో ఆల్​ ఇండియా రేడియోలోని ‘జనరంజని’ ప్రోగ్రామ్​తోనే మా  రోజు మొదలయ్యేది చిన్నప్పుడు. అందులో ఎం.ఎస్​​ సుబ్బలక్ష్మిగారి వెంకటేశ్వర సుప్రభాతం నుంచి నాన్​స్టాప్​గా  రేడియో మోగుతూనే ఉండేది  ఇంట్లో. అలా నాకు పాటలు పరిచయమయ్యాయి. నాలోని సింగర్​ని బయటపెట్టిన క్రెడిట్​  మాత్రం మా మామయ్య పెళ్లికే దక్కుతుంది. 
పాటలతో ప్రయాణం
2002వ సంవత్సరం.. నాకు పదకొండేళ్లు ఉంటాయి అనుకుంటా. అమ్మానాన్నలతో పాటు మా పెదనాన్నలు, బాబాయ్​లు, అత్తలకి కూడా మ్యూజిక్​ అంటే ఇష్టం. దాంతో మా మామయ్య పెళ్లిలో ఫ్యామిలీ అంతా కలిసి ఓ కచేరీ చేద్దాం అనుకున్నారు. ఫ్యామిలీలోని కపుల్స్​ అందరికీ  ఒక్కో డ్యూయెట్​ ఇచ్చారు. అమ్మానాన్నలకి ‘ఈ మూగ చూపేల బావా మాటాడగనేరమా..’ పాట వచ్చింది. రిహార్సల్స్ స్టార్ట్​ చేశారు. కానీ, అమ్మకి శృతి అటుఇటు అవుతోంది. దాంతో  అమ్మ దగ్గరికెళ్లి ‘నువ్వు సరిగా పాడట్లేద’ని నాలుగు లైన్లు పాడి వినిపించా. నా గొంతు బాగుందని అమ్మతో సహా బంధువులంతా పెళ్లిలో నన్నే పాడమన్నారు. ఆ పెళ్లికి వచ్చినవాళ్లంతా నా గొంతుని తెగ పొగిడారు. ఆ తర్వాత మా ఏరియాలో జరిగిన ఒక ఫంక్షన్​కి  వచ్చిన  పొలిటీషియన్​  ఒకరి ముందు పాడితే ఆయన తన మెడలోని దండని నాకు వేశారు. ఆ సీన్​ తర్వాత కాలనీలో  హీరో అయ్యా. ఆ అప్రిసియేషన్స్​ ​ బాగా నచ్చేవి ఆ టైంలో​. ఇంట్లో వాళ్లు కూడా నా టాలెంట్​ గుర్తించి డీవీ మోహన కృష్ణగారి దగ్గర మ్యూజిక్​లో చేర్పించారు. మ్యూజిక్​ నేర్చుకోవడం మొదలుపెట్టిన మూడునెలలకే ఘంటసాల గారి జయంతికి స్టేట్​ గవర్నమెంట్​ కండక్ట్​​ చేసిన కాంపిటీషన్​లో పార్టిసిపేట్​ చేశా. ఆ కాంపిటీషన్​ నా లైఫ్​కి ఓ పెద్ద టర్నింగ్​ పాయింట్.​
కాన్ఫిడెన్స్​ వచ్చింది
రవీంద్రభారతిలో జరిగిన ఆ కాంపిటీషన్​ టైటిల్​ కోసం మొత్తం రెండువేల మంది పోటీపడ్డారు. వాళ్లందర్నీ చూశాక కళ్లు తిరిగినంత పనయ్యింది నాకు. కానీ, ఎలాంటి ఎక్స్​పెక్టేషన్స్​ లేకుండానే టాప్ –8కి వెళ్లా.  నెక్స్ట్ టాప్​–3 సెలక్ట్​ చేస్తామన్నారు. తోటి సింగర్స్​​ అంతా క్లాసికల్​ సాంగ్స్​తో​ ఓ రేంజ్​లో కుస్తీ పడుతున్నారు. కానీ, నాకేమో క్లాసికల్​ నాలెడ్జ్​ లేదు. ‘నీకు వచ్చింది పాడు’ అన్నారు నాన్న. రేడియోలో విన్న ‘పాడుతా తీయగా చల్లగా..’ అనే పాటే ఫైనల్​లో పాడా. ఆశ్చర్యంగా ఆ టైటిల్​ నాకే దక్కింది. ఆ తర్వాత పేపర్​, టీవీ ఛానెల్స్​ వాళ్లంతా మా ఇంటికొచ్చి నా ఇంటర్వ్యూలు తీసుకున్నారు.  హీరోలా  ఫీల్ అయ్యా. తరువాత రోజు ​​స్కూల్​కి వెళ్తే నా పేపర్​ ఇంటర్వ్యూలు నోటీస్​ బోర్డులో అతికించి ఉన్నాయి​. అవన్నీ నన్ను సింగింగ్​ వైపు మరిన్ని అడుగులు ముందుకేయించాయి. 
ఆ తర్వాత..
గొంతు బాగుంది..కానీ, మ్యూజిక్​ నేర్చుకుంటే ఇంకా బాగా పాడగలను అనిపించింది. ఆ నేర్చుకునే ప్రాసెస్​లో ఉన్నప్పుడు  తొమ్మిదో తరగతి చదువుతున్నా. అప్పుడే   ‘పాడుతా తీయగా’ ఆడిషన్స్​ పడ్డాయ్​. ఆ టైటిల్ కూడా గెలిచా. టెన్త్​ క్లాస్​కి వచ్చాక గొంతు మారలేదు. కాస్త అమ్మాయిలాగే  ఉండేది.  ఏ పాటా పర్ఫెక్ట్​గా వచ్చేది కాదు. దాంతో కాస్త డిప్రెషన్​లోకి వెళ్లా. పైగా బోర్డ్​ ఎగ్జామ్స్​ టెన్షన్​. చేసేదేంలేక  సింగింగ్​కి బ్రేక్​ ఇచ్చా. పేరెంట్స్​ ఇష్టం మేరకు పూర్తి  కాన్సన్​ట్రేషన్​ చదువుపై పెట్టా. అలా సాగిపోతున్న లైఫ్​కి సడెన్​ బ్రేక్​ వేసింది డెంగ్యూ ఫీవర్​. ఇంటర్​ సెకండ్​ ఇయర్​  చదువుతున్నప్పుడు డెంగ్యూతో రెండు నెలలు మంచాన పడ్డా.  చదువులో చాలా వెనుకబడ్డా. దాంతో కాన్ఫిడెన్స్​ తగ్గింది. అప్పుడనిపించింది ‘నాకు కావాల్సింది ఇది కాదు. అని రియలైజ్​ అవ్వడానికే దేవుడు నాకు ఇంకో ఛాన్స్​ ఇచ్చాడేమో’ అని. ఆ ఆలోచన వచ్చాక ప్లే బ్యాక్​ వైపు అడుగులేశా. కోరస్​లు, ట్రాక్స్​  పాడటం మొదలుపెట్టా. మా పేరెంట్స్​ని కన్విన్స్​ చేసి ఎంసెట్​ సీటు వదులుకుని బీకాంలో చేరా. ప్లే బ్యాక్​ కెరీర్​ అటుఇటు అయితే అన్న ఉద్దేశంతో నాన్న లండన్​లోని ‘ట్రినిటీ యూనివర్సిటీ’లో పియానో కూడా నేర్పించారు. 
బాగా పేరుతెచ్చాయి
ఇప్పటివరకు ప్రైవేట్​, సినిమా పాటలు కలుపుకుని పదిహేనొందల నుంచి రెండువేల వరకు పాడా. వాటిల్లో ‘ప్రేమ ఇష్క్​ కాదల్​’ సినిమాలోని ‘తుళ్లే తుళ్లే ..’ నా ఫస్ట్​ బ్రేక్​.  ఆ తర్వాత ‘సుప్రీమ్’ లోని ‘బెల్లం శ్రీదేవి.. ఈజ్​ మై పెళ్లాం శ్రీదేవి’ నా సింగింగ్​ కెరీర్​ని ఒక మలుపు తిప్పింది. ‘కాటమ రాయుడు’ లోని  ‘నేత చీర..’, ‘లై’​లోని‘ఇట్స్​ మై లగ్గం టైం’, ‘ఆర్​ ఎక్స్​ 100’లోని ‘ రుధిరం మరిగి’ , ‘ద్వారక’ సినిమాలోని ‘అదిరే దడపుట్టింది’ పాటలు కూడా నా కెరీర్​కి బాగా హెల్ప్​ అయ్యాయి.  అలాగే ప్రస్తుతం మణిశర్మ, అనూప్​ రూబెన్స్​లకి రెండు రెండు పాటలు పాడా. ఫ్యూచర్​లో మరిన్ని మంచి పాటలు పాడాలనుకుంటున్నా. 
మిస్​ చేసుకున్నా.. 
నాకు దైవభక్తి ఎక్కువ. అలాగని దేవుడితో ‘నువ్వు నాకు ఇదిస్తే  బదులుగా నేను నీకు ఇదిస్తా’ అని బేరాలు కుదుర్చుకోను. మనం సిన్సియర్​గా ఉంటే రాసిపెట్టినప్పుడు అన్నీ మన దగ్గరికే వస్తాయన్నది నా నమ్మకం. దేవుడు అన్నీ చూసుకుంటాడులే అన్న భరోసా కూడా. అందుకే అప్పుడప్పుడు లైవ్​ షోల వల్ల పాటలు మిస్​ అయినా పెద్దగా బాధపడను.  ‘కాటమ రాయుడులో’ని ‘లాగే మనసు లాగే..’  కూడా అలానే మిస్​ అయ్యింది. చిన్నప్పట్నించీ అలర్జీ, ఆస్తమా ప్రాబ్లమ్స్​ ఉన్నాయ్​. అందుకే వింటర్​ సీజన్​లో హై పిచ్​ పాటలంటే కాస్త ఇబ్బంది పడతా. అలా కూడా కొన్ని అవకాశాలు పోయాయి. 
కష్టాన్ని నమ్ముతా
అదృష్టం ​ వల్ల వచ్చింది ఏదైనా మధ్యలోనే వదిలి వెళ్లిపోతుంది. కానీ, హార్డ్​ వర్క్​తో వచ్చే సక్సెస్​ చివరి వరకు మనతోనే ఉంటుందనేది నా ఫీలింగ్​.  పర్సనల్​ లైఫ్​లో చాలా కామ్​ పర్సన్​ని నేను. లిమిటెడ్​ ఫ్రెండ్స్​ ఉన్నారు.  షోస్ చేయడం కోసం బయటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు మా ఫ్యామిలీని చాలా మిస్​ అవుతా.  
మొదటి ప్లే బ్యాక్​.. 
తెలిసినవాళ్ల ద్వారా నాన్న నన్ను మ్యూజిక్​ డైరక్టర్​ సాయికార్తీక్​గారికి పరిచయం చేశారు. నా పాటల క్యాసెట్స్​ విని ఆయన రెగ్యులర్​గా ట్యూన్స్​, కోరస్​లకి పిలిచారు. ఆయన మ్యూజిక్​ డైరక్షన్​లో వచ్చిన ‘అలలు..’ సినిమాలోని  ‘ఎప్పుడూ చూడని హాయిలా..’ నా మొదటి ప్లే బ్యాక్​. ఆ పాటని మూవీ థియేటర్​లో చూడటానికి చాలా ఎదురుచూశా. కానీ, ఆడియో బయటికొచ్చాక సంవత్సరాలు గడిచినా సినిమా రిలీజ్​ కాలేదు. అయినా నిరుత్సాహపడకుండా ప్రయత్నించా. ‘జీ సరిగమప, జోడి నెంబర్​వన్​’ లో కూడా  పార్టిసిపేట్​ చేశా.  అక్కడ పరిచయం అయిన సాయి కృష్ణ అనే ఫ్రెండ్​ ద్వారా శ్రవణ్​ భరద్వాజ్​ అనే మ్యూజిక్​ డైరక్టర్​ని కలిశా. ఆయన మ్యూజిక్​లో వచ్చిన  ‘కలయో.. నిజమో’ ఆల్బమ్​లోని ‘మళ్ళీరావా..’ అనే పాట పాడా. అది సూపర్​ హిట్​ అయ్యింది.  ఆ తర్వాత ఆయన మ్యూజిక్​లో వచ్చిన సినిమాల్లోనూ వరుసగా పాడా. అలా నేను పాడిన  ‘అలియాస్​ జానకి’ అనే సినిమాలోని  ‘కాటుక కన్నుల చిన్నది..’పాటకి మంచి రీచ్​ వచ్చింది. ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంచి అవకాశాలు వచ్చాయి.  వాయిస్​ ఛేంజ్​ అయ్యాక మళ్లీ  బాలుగారి ముందు పాడాలని  ‘పాడుతా తీయగా’లో పార్టిసిపేట్​ చేశా.  ‘పాడుతా తీయగా ’ యూఎస్​ సిరీస్​లోనూ కొన్ని పాటలు పాడా. అక్కడ నా డెడికేషన్​ చూసి బాలుగారు ‘ఈ అబ్బాయిని మన షోలకి రెగ్యులర్​గా పిలవ’మని రికమెండ్​ చేశారు. అలా ఆయనతో చాలా యేళ్లు ట్రావెల్​ చేశా.                                                                                                                                                      ::: ఆవుల యమున
 

Tagged interview, , Singer, Sai Charan

Latest Videos

Subscribe Now

More News