న్యూఢిల్లీ: పేటీఎం పేరెంట్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ నుంచి తప్పుకుంటున్నట్టు జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ తెలిపింది. ఇది పేటీఎంలో తనకు మిగిలిన 1.4 శాతం వాటాను విక్రయించింది. సాఫ్ట్‌బ్యాంక్ నవంబర్ 2022 నుంచి గత నెల వరకు క్రమం తప్పకుండా పేటీఎం షేర్లను అమ్ముతూనే ఉంది. పేటీఎంలో దీని వాటా మార్చి 2024 నాటికి 1.4 శాతానికి తగ్గిపోయింది. 2021లో పేటీఎం ఐపీఓ సమయంలో సాఫ్ట్బ్యాంకుకు దాదాపు 18.5 శాతం వాటా ఉంది.
పాలసీబజార్ లోనూ సాఫ్ట్‌బ్యాంక్ తన వాటాను పూర్తిగా అమ్మేసింది. సాఫ్ట్ బ్యాంక్ సుమారు 150 మిలియన్ల డాలర్ల నష్టంతో పేటీఎం నుంచి బయటికి వచ్చింది. ఇది వన్97 కమ్యూనికేషన్స్‌లో 2017లో 1.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. అప్పుడు ఒక్కో షేరును రూ. 800 చొప్పున కొనుగోలు చేసింది. పేటీఎం షేర్ ధర రూ. 1,955 వద్ద లిస్టయింది. ఇప్పటి వరకు దాని ఇష్యూ ధర రూ. 2,150కు చేరుకోలేదు. పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ చర్యల వల్ల పేటీఎం షేరు ఈ ఏడాది మే 9న ఏకంగా రూ.310కి పడిపోయింది. శుక్రవారం పేటీఎం షేరు రూ.467.25 వద్ద ముగిసింది.