మూడు రాష్ట్రాల్లో కుండపోత వర్షం .. కర్నాటకలో ఐదుగురు, తమిళనాడులో ముగ్గురు మృతి

మూడు రాష్ట్రాల్లో కుండపోత వర్షం .. కర్నాటకలో ఐదుగురు, తమిళనాడులో ముగ్గురు మృతి
  • బెంగళూరులో రోడ్లన్నీ జలమయం
  • కేరళలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు 

తిరువనంతపురం/చెన్నై/బెంగళూరు: దక్షిణాదిన మూడు రాష్ట్రాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో మేజర్ సిటీలు జలమయం అయ్యాయి. ఆయా నగరాల్లోని లోతట్టు కాలనీలన్నీ నీట మునిగాయి. ప్రధానంగా బెంగళూరులో భారీగా వరదలు రావడంతో రోడ్లన్నీ నదుల్లా మారాయి. వర్షాల కారణంగా కర్నాటకలో ఐదుగురు, తమిళనాడులో ముగ్గురు మృతి చెందారు. బెంగళూరు, ఇతర సిటీల్లో రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. బెంగళూరులో 11 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 

మంగళవారం బెంగళూరులోని సిల్క్ రోడ్ జంక్షన్, హోసూర్ రోడ్, బీటీఎం లేఔట్ వంటి ప్రధాన రోడ్లపై మోకాళ్లకుపైగా నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ కావడంతో వాహనదారులంతా అవస్థలు పడ్డారు. కర్నాటకలో గడిచిన 36 గంటల్లో వర్షాల కారణంగా ఐదుగురు మృతిచెందారని అధికారులు మంగళవారం వెల్లడించారు. బెంగళూరులోని బీటీఎం సెకండ్ స్టేజ్ సమీపంలోని మధువన్ అపార్ట్ మెంట్ లో కరెంట్ షాక్ తో ఇద్దరు చనిపోయారు. సెల్లార్ లోని తన గదిలోకి చేరిన నీటిని తోడేందుకుగాను మోటార్ పంపును స్టార్ట్ చేసేందుకు ఓ వ్యక్తి  ప్రయత్నించగా కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. 

అదేసమయంలో అతడి పక్కనే నిలిబడి ఉన్న పన్నెండేండ్ల బాలుడు సైతం కరెంట్ షాక్ తగిలి మృతిచెందాడు. మహదేవపుర ఏరియాలో ఓ ఐటీ కంపెనీ వద్ద గోడ కూలడంతో హౌస్ కీపింగ్ పని చేస్తున్న మహిళ చనిపోయింది. ఇక రాయిచూర్, కర్వార్ ఏరియాల్లో పిడుగుపాటుకు మరో ఇద్దరు మృతి చెందారని అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో బెంగళూరులో 105 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయిందని ఐఎండీ తెలిపింది. సిటీకి ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం రాష్ట్రంలోని బాగల్ కోట్, బెంగళూరు అర్బన్, రూరల్, బెళగాం, చిక్కబళ్లాపుర, ధార్వాడ్, గదగ్, కోలార్, కొప్పల్, విజయనగర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

కేరళలో అతి భారీ వానలు.. 

కేరళలోని అనేక జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. కాసర్ గడ్, క్ననూర్, వయనాడ్, కోజికోడ్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మంగళవారం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 24 గంటల వ్యవధిలో 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది. పాలక్కడ్, మళప్పురం, త్రిసూర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పఠణంతిట్ట, ఎర్నాకుళం, ఇతర పలు జిల్లాల్లో 115.6 మిల్లీమీటర్ల వరకూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటవీ ప్రాంతాల్లో కొండచరియలు, మట్టిదిబ్బలు విరిగిపడే ప్రమాదం ఉందని డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు ప్రజలను హెచ్చరించారు.

చెన్నైలో 26 వరకూ వర్షాలు.. 

తమిళనాడులోనూ గడిచిన 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయని అధికారులు మంగళవారం వెల్లడించారు. రాష్ట్రంలోని కొన్ని చోట్ల అతిభారీ వర్షాలు నమోదయ్యాయని తెలిపారు. మంగళవారం చెన్నైలో మాత్రం మోస్తరు వర్షాలు కురిశాయి. మే 26 వరకూ చెన్నైలో రోజూ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా, సోమవారం రాత్రి వర్షాల కారణంగా మదురై జిల్లా విలయాంగుళం గ్రామంలో ఓ ఇంటి గోడ కూలి మీదపడటంతో ముగ్గురు మృతిచెందారు.