ప్రజలు పోలీస్ సేవల్ని వినియోగించుకోవాలి : ఎస్పీ కాంతిలాల్ పాటిల్

ప్రజలు పోలీస్ సేవల్ని వినియోగించుకోవాలి : ఎస్పీ కాంతిలాల్ పాటిల్

ఆసిఫాబాద్ , వెలుగు: ప్రజలు ఎవరి ప్రమేయం, పైరవీలు లేకుండా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. 

ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని చెప్పారు. ప్రజా సమస్యల పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి  కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 01 నుంచి సెప్టెంబర్ 30 వరకు జిల్లా అంతటా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందన్నారు.