శ్రీలంక మాజీ ప్రధాని అరెస్టుకు రంగం సిద్ధం

శ్రీలంక మాజీ ప్రధాని అరెస్టుకు రంగం సిద్ధం

శ్రీలంక మాజీ  ప్రధాని మహింద రాజపక్స  అరెస్టుకు  రంగం సిద్ధమైంది. మహిందతో  పాటు  మరో ఆరుగురిని  అదుపులోకి తీసుకోవాలని సీఐడీని  ఆదేశించింది  శ్రీలంక కోర్టు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా  ఆందోళనలు చేపట్టిన  నిరసనకారులపై దాడులు చేయడంతో  పాటు  బెదిరింపులకు పాల్పడ్డారనే  ఆరోపణలపై విచారణ చేపట్టింది కోర్టు.
శ్రీలంకలో ఏర్పడిన  తీవ్ర సంక్షోభానికి  బాధ్యతవహిస్తూ.. రాజీనామా చేయాలని  ప్రధాని నివాసం బయట  దాడులు జరిగినట్లు అటార్నీ సెనక  పెరీరా  కొలంబో మేజిస్ట్రేట్  కోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. మహింద  మద్దుతదారులే  ఈ దాడులు చేసినట్లు ఆరోపించారు. దీనిపై రాజపక్సతో పాటు  పలువురు పార్లమెంటు  సభ్యులు, సీనియర్ పోలీసు అధికారులను అరెస్టు  చేయాలని కోరారు. కాగా.. మహింద రాజపక్స, ఆయన  కుమారుడు నమల్,  మిత్రపక్ష పార్టీ  నేతలు దేశం విడిచి  వెళ్లొద్దని  ఇప్పటికే కోర్టు  ఆదేశించింది. ఆర్ధిక సంక్షోభం  దృష్ట్యా ప్రభుత్వానికి  వ్యతిరేకంగా నిరసనలు,  హింసాత్మక ఘటనలు జరుగుతుండటంతో..  శ్రీలంక విడిచివెళ్లకుండా  నిషేధం విధించారు.
గొటబాయ ప్రభుత్వానికి  వ్యతిరేకంగా  కొనసాగుతున్న నిరసనల్లో తీవ్ర  ఉద్రిక్తతలు  జరుగుతున్నాయి. ఈనెల 9న  కొలంబోలో ప్రధాని రాజపక్స  నివాసం దగ్గర  శాంతియుతంగా నిరసన  తెలుపుతున్న వారిపై  ప్రభుత్వ మద్దతుదారులు  దాడులు చేశారు. దీంతో ప్రజలు ఆగ్రహంతో  రగిలిపోయారు.  అధికారంలో  ఉన్న పలు ఎంపీల  ఇళ్లు, వాహనాలకు  నిప్పంటించారు. ఈ హింసాత్మక  ఘటనలో ఎంపీ, ఆయన  భద్రతా అధికారి  సహా  9 మంది చనిపోయారు. 2502 మందికిపైగా  గాయపడ్డారు. దీంతో ప్రధాని  పదవికి మహింద రాజపక్స  రాజీనామా చేశారు. 

 

ఇవి కూడా చదవండి

అమిత్షాకు రేవంత్ రెడ్డి లేఖ

వరుసగా ఏడేళ్లు కరువు వచ్చినా తాగునీటి కొరత ఉండదు