బీఆర్ఎస్ను ప్రజలు చెత్త బుట్టలో వేశారు..

బీఆర్ఎస్ను ప్రజలు చెత్త బుట్టలో వేశారు..

 కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి శ్రీదర్ బాబు అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే రెండు వాగ్దానాలు అమలు చేశామని చెప్పారు. ప్రజా రవాణా మెరుగుపరిచామని తెలిపారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీదర్ బాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు 6.5 కోట్ల జీరో టికెట్స్ ఇచ్చామని చెప్పారు. రాజీవ్ ఆరోగ్య శ్రీని రూ. 10 లక్షలకు పెంచామని తెలిపారు. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతల ఆరోపణలు సిగ్గుచేటన్నారు. 

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 30 రోజులు కాలేదని అప్పుడే తమపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. తమ మ్యానిఫెస్టో పై విషపూరితమైన ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూరించే పనిలో ఉన్నామని తెలిపారు. నియంతృత్వ దోరణిలో బీఆర్ఎస్ నేతలుఉన్నారని అన్నారు. ఓటమి తర్వాత కూడా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదని అన్నారు. ప్రజల పై ప్రేమ ఉంటే విలువైన సందేశాలు ఇవ్వండని సూచించారు.  

బీఆర్ఎస్ రిలీజ్ చేసిన బుక్ ను ఖండిస్తున్నామని శ్రీదర్ బాబు అన్నారు. రాష్ట్రాన్ని 3 వేల 500 రోజులు బీఆర్ఎస్ పార్టీ పాలించిందని శ్రీదర్ బాబు అన్నారు. దళిత ముఖ్యమంత్రి, ఉచిత నిర్భంద విద్య, డబుల్ బెడ్ రూం, కేజీ టూ పీజీ, విభజన చట్టం హామీలు ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నో అవన్ని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. తెలంగాణను రూ. 6 నుంచి 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని శ్రీదర్ బాబు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని ఆ విషయం వారికి కూడా తెలుసని అన్నారు. బీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో పోటి చేసేందుకు అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు.  

బీఆర్ఎస్ ను ప్రజలు చత్తబుట్టలో వేశారని శ్రీదర్ బాబు అన్నారు. బీఆర్ఎస్ తన పరువు తానే తీసుకుందని ప్రజలిచ్చిన ప్రతిపక్ష పాత్రకు బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేకూర్చడం లేదని వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు కొంత మంది ఆటో సోదరులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అన్ని ఆలోచనలు చేసే తమ మ్యానిఫేస్టోను రూపొందించామని శ్రీదర్ బాబు అన్నారు.