
- రోడ్డు భద్రత పెంపునకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం
- ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున స్టేషన్లు ఏర్పాటు
- కరీంనగర్, నల్గొండలో ఇప్పటికే ప్రారంభించిన పనులు
- ఒక్కో సెంటర్ కు రూ.8 కోట్ల ఖర్చు.. ఆరు ఎకరాల స్థలం
- రవాణా శాఖలో ఏజెంట్ల అవినీతి, అక్రమాలకు చెక్ పడే చాన్స్
నల్గొండ, వెలుగు : తెలంగాణలో రోడ్డు భద్రతను మరింత మెరుగు పర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల(ఏటీఎస్)ను ఏర్పాటు చేయనుంది. ఇక ముందు కంప్యూటరైజ్డ్ విధానంలో వాహనాల ఫిట్ నెస్ టెస్టులు చేస్తారు. తద్వారా మానవ తప్పిదాలు జరగకుండా చెక్ పెట్టనుంది. సాధారణంగా మనుషులు చేసే వెహికల్ ఫిట్ నెస్ టెస్టుల్లో అనేక లోపాలు ఉంటున్నాయి.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత మెరుగైన తనిఖీలకు ఏటీఎస్ సిస్టమ్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. టెక్నాలజీ ద్వారా ఫిట్ నెస్ టెస్టులు చేస్తే కచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఇలా చేయడం ద్వారా రోడ్డు భద్రత మరింత పెరుగుతుందని, అవినీతి కూడా తగ్గుతుందని రవాణారంగ నిపుణులు పేర్కొంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 17 ఏటీఎస్ సెంటర్లు..
రాష్ట్రవ్యాప్తంగా17 ఏటీఎస్ సెంటర్లను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున10, హైదరాబాద్‌లో 7 ఏటీఎస్ సెంటర్ల ఏర్పాటుకు రవాణాశాఖ అధికారులు ప్రతిపాదించారు. ఇప్పటికే కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో పనులు ప్రారంభించారు. మిగతా జిల్లాల్లో త్వరలోనే ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో ఏటీఎస్ సెంటర్ కు రూ.8 కోట్ల ఖర్చు చేస్తుండ గా.. దీన్ని ఆరు ఎకరాల స్థలంలో నిర్మిస్తారు. మొత్తం 17 సెంట్లరుకు రూ.136 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.
రోజుకు 40 వెహికల్స్ టెస్ట్
ప్రస్తుతం వాహనాలను రవాణాశాఖ అధికారులు మాన్యువల్‌గా పరిశీలన చేసి, ఫిట్‌నెస్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. ఈ విధానంలో పారదర్శకత లేకపోవడం, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఉన్నా వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. అదే ఏటీఎస్ ల్లో కార్ల నుంచి భారీ వాహనాల వరకు వేగంగా పరీక్షలు చేయొచ్చు. రోజుకు సగటున 40 వాహనాలకు టెస్టులు నిర్వహించవచ్చు. కమర్షియల్ వాహనాల ఫిట్‌నెస్ టెస్టులు పూర్తిగా ఆటోమేటెడ్, కంప్యూటరైజ్డ్ కెమెరాల ఆధారంగా చేస్తారు.
మొత్తం 9 రకాల పరీక్షలతో వాహనంలోని ఇంజిన్, బ్రేకులు, స్టీరింగ్, లైట్లు, స్పీడ్, పొల్యూషన్, హారన్ ఇలాంటివి అన్ని అంశాల్లో తనిఖీ చేసి ఫిట్‌నెస్ జారీ చేస్తారు. దీంతో వాహనంలో ఏ పార్ట్ ఎప్పుడు మార్చుకోవాలో తెలుస్తుంది. తద్వారా ఇంజిన్‌లో లోపాలు ముందుగానే తెలుస్తాయి. తద్వారా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
ఏజెంట్ల అక్రమాలకు చెక్..
ఆర్టీఏ ఆఫీసులో ఏజెంట్లు ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ నుంచి వెహికల్ ఫిట్‌నెస్ వరకు ప్రభుత్వ ధర కంటే.. నాలుగైదు రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్న ఘటనలు లేకపోలేదు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో స్కూలు బస్సులు, దసరా, సంక్రాంతి సమయాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ పై రవాణాశాఖ అధికారులు దాడులు చేస్తుంటారు.
మిగతా సమయాల్లో వాటి పనితీరును పట్టించుకోరనే విమర్శలు వస్తున్నాయి. రవాణాశాఖ ఆఫీసుల్లో ఫిట్ నెస్ మాన్యువల్‌గా చేస్తుండగా ఏజెంట్లు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని వాహనదారులు ఆరోపణలు చేస్తుంటారు. ఇక ఫిట్‌నెస్ ఏటీఎస్ లను అందుబాటులోకి తెస్తే రవాణా వ్యవస్థలో మరింత మెరుగైన పారదర్శకత ఉంటుంది.
ప్రమాదాలు తగ్గుతాయి
ఏటీఎస్ ల ద్వారా వాహనాల ఫిట్ నెస్ టెస్ట్ లను చేసి డిజిటల్ గా రికార్డ్ చేస్తారు. మాన్యువల్ గా కాకుండా డిజిటల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ అవుతాయి. ఏటీఎస్ టెస్ట్ లు చేసిన వాహనాలు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా నివారించవచ్చు. ప్రమాదాలు తగ్గి ప్రజలకు మేలు కలుగుతుంది. ఇది రవాణా శాఖలో మరో ముందడుగు అని చెప్పొచ్చు. - వాణి, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్, నల్గొండ జిల్లా