సబ్సిడీ ట్రాక్టర్లు బంద్

సబ్సిడీ ట్రాక్టర్లు బంద్
  • మూడేండ్లుగా స్కీంను పక్కన పెట్టిన సర్కారు

పెద్దపల్లి, వెలుగు: వ్యవసాయంలో మెకనైజేషన్​ అటకెక్కింది. సబ్సిడీ ట్రాక్టర్ల స్కీం పక్కన పడ్డది. అన్నింటికీ ఒక్క రైతుబంధు సరిపోతది అన్నట్లుగా రాష్ట్ర సర్కారు తీరు కనిపిస్తోంది. చివరిసారిగా 2017–18 ఆర్థిక సంవత్సరం వరకు రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం నామమాత్రంగానైనా అమలైంది.  అప్పటికి రెండేళ్లలో 3,900 ట్రాక్టర్లను రైతులకు సబ్సిడీపై అందజేశారు. ఆ తర్వాత స్కీం సంగతే సర్కారు మరిచిపోయింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,500 కోట్లు మెకనైజేషన్​కోసం సర్కార్​ బడ్జెట్​లో కేటాయించింది.  ఇప్పటికి ఆరు నెలలు గడుస్తున్నా పైసా విడుదల చేయలేదు. దీంతో ఈ ఫండ్స్​ను ఎటు మళ్లించిందోననే చర్చ జరుగుతోంది. 
ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీ
కూలీల కొరతను అధిగమించడం, దిగుబడులను పెంచడం, పంట నష్టాన్ని తగ్గించడం.. అనే మూడు లక్ష్యాలతో దేశవ్యాప్తంగా వ్యవసాయంలో మెకనైజేషన్​ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ట్రాక్టర్లతో పాటు పవర్​టిల్లర్లు, వరినాటు యంత్రాలు, హార్వెస్టర్లు, ఇతరత్రా అధునాతన పనిముట్లను సబ్సిడీపై రైతులకు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో చాలా ఏండ్లు కొనసాగిన యాంత్రీకరణ పథకాన్ని టీఆర్ఎస్​సర్కారు సైతం 2018 దాకా కొనసాగించింది.  ముఖ్యంగా ఈ స్కీం కింద 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,900 మంది రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు అందజేశారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 90 శాతం సబ్సిడీ, ఇతర వర్గాలకు 50 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లు ఇచ్చారు. కానీ లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫారసు చేసిన వారికే ట్రాక్టర్లు మంజూరు చేశారనే ఆరోపణలు వచ్చాయి. నిజానికి ఫీల్డ్​లెవల్​లో పొలిటికల్​ఇన్​ఫ్లుయెన్స్​ఎక్కువగా ఉండడం వల్ల అర్హులైన రైతులకు కాకుండా టీఆర్ఎస్​లీడర్లు, వాళ్ల అనుచరులకే అత్యధికంగా ట్రాక్టర్లు దక్కాయి.  
ఏడేండ్లలో ఖర్చు పెట్టింది రూ. 950 కోట్లే
2014లో టీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అగ్రికల్చర్​ మెకనైజేషన్​కోసం పెట్టిన ఖర్చు కేవలం రూ. 950 కోట్లు మాత్రమే. అందులోనూ 2016 నుంచి 2018 వరకు రెండు ఆర్థిక సంవత్సరాల్లో ట్రాక్టర్ల కొనుగోలుకు ఎక్కువ ఖర్చు చేసింది. 2018లో రైతుబంధు స్కీం తెచ్చాక  టీఆర్​ఎస్ ​ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆ ఏడాది నుంచే యాంత్రీకరణ స్కీంను  దాదాపు పక్కన పెట్టేసింది. సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీ కూడా నిలిపివేసింది. ఈ క్రమంలో ప్రభుత్వంపై విమర్శలు రావడంతో 21–22 బడ్జెట్​లో ఏకంగా రూ. 1,500 కోట్లు ఈ స్కీం కోసం కేటాయించారు. కానీ ఇప్పటికి ఆరు నెలలు గడుస్తున్నా స్కీంకు సంబంధించిన గైడ్​లైన్స్​ విడుదల చేయలేదు. వాస్తవానికి గడిచిన మూడేళ్లుగా రాష్ట్రంలో వర్షపాతం ఆశాజనకంగా ఉండడంతో పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. కోటి 30 లక్షల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. వరి, పత్తి, ఇతర పప్పు, నూనెగింజల సాగు పెరుగుతున్నందున దుక్కులు దున్నడానికి, పంట ఉత్పత్తులను మార్కెట్లకు,  కొనుగోలు కేంద్రాలకు చేర్చేందుకు ట్రాక్టర్ల అవసరం తప్పనిసరైంది. అందుకే రైతులు ఎప్పట్లాగే ట్రాక్టర్లు మంజూరు చేస్తారని 2018 నుంచి ఎదురుచూస్తూనే ఉన్నా ప్రతిసారీ నిరాశే మిగులుతోంది. కానీ  ఈసారి పెద్ద మొత్తంలో ఫండ్స్ కేటాయించినందున ఎలాగైనా ట్రాక్టర్లు, ఇతర యంత్రాలు అందిస్తారనే ఆశతో ఉన్నా సర్కారులో చలనం కనిపించడం లేదు.

సబ్సిడీ ట్రాక్టర్లు ఇయ్యాలె 
వ్యవసాయంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్ల అవసరం చాలా పెరిగిపోయింది. జిల్లాల్లో వరి, పత్తి ఎక్కువగా పండిస్తుంటారు. దుక్కులు దున్నడానికి గతంలో ఎద్దులు, నాగళ్లు వాడేటోళ్లు. ఇప్పుడు ఎకరాలకు ఎకరాలు సాగు చేస్తున్నం కాబట్టి ట్రాక్టర్లు తప్పనిసరైనయ్. ప్రభుత్వం రెండున్నరేళ్లుగా సబ్సిడీ మాటే మరిచిపోయింది. బడ్జెట్​లో కేటాయించిన నిధులను ఈసారి పూర్తిగా ఖర్చు చేయాలే. రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, హార్వెస్టర్లు అందజేయాలే. 
                                                                                                                                                - సిరిపురం రమేశ్, రైతు, కునారం, పెద్దపల్లి జిల్లా 

ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలే
వ్యవసాయ యాంత్రీకరణ కోసం ప్రభుత్వం నుంచి  ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ప్రభుత్వం రూపొందించిన గైడ్​లైన్స్​ప్రకారం ఆర్డర్స్​ వచ్చిన తర్వాత ప్రక్రియ ప్రారంభిస్తాం. 2018 వరకు అర్హులైన లబ్ధిదారులకు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ట్రాక్టర్​లు, హార్వెస్టర్లు అందజేశాం. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఆదేశాలతో స్కీం మళ్లీ మొదలవుతుంది.                                                                                                   - శ్రీధర్, డీఏఓ, ఉమ్మడి కరీంనగర్​ జిల్లా