కామారెడ్డి లో అంతర్ జిల్లా దొంగలు అరెస్ట్

కామారెడ్డి లో  అంతర్ జిల్లా దొంగలు అరెస్ట్

కామారెడ్డిటౌన్‌, వెలుగు :  పలు జిల్లాల్లో చోరీలకుపాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్​ చేసినట్లు ఎస్సీ రాజేశ్​చంద్ర తెలిపారు. శనివారం మీడియాకు ఎస్పీ వివరాలు వెల్లడించారు.  గత నెల 31న కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి శివారులోని పాత హైవే పక్కన ఉన్న ఆటో ఎలక్ట్రికల్ షాపులో పలు వస్తువులు, పలు ఇండ్లలో చోరీలకు పాల్పడగా దేవునిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేశారన్నారు.  

ఏఎస్పీ చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్స్‌ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా, శనివారం నర్సన్నపల్లి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను పట్టుకొని విచారించగా ముఠా సభ్యులు పోలీసులకు చిక్కారని తెలిపారు. అరెస్ట్​ అయినవారు నిర్మల్ జిల్లా తానుర్ మండలం బాంని గ్రామానికి చెందిన షేక్ రఫీక్, షేక్ ఖాదర్, షేక్ ఖయ్యుమ్, షేక్ అజ్జు, మహబూబాబాద్ జిల్లాకు చెందిన బండారి అశోక్ ఉన్నట్లు పేర్కొన్నారు.  

వీరి నుంచి కారు, 3 బైక్​లు, ఇనుప రాడ్లు, సుత్తె, స్క్రూ డ్రైవర్‌, 4 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన దొంగలపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌తో పాటు మేడ్చల్, నిర్మల్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, సిరిసిల్లా, నిజామాబాద్ జిల్లాల పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. కామారెడ్డి రూరల్ సీఐ రామన్, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు రంజిత్, భువేశ్వర్, సుస్మాన్, ప్రవీన్ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించారని ఎస్పీ పేర్కొన్నారు.