తినుడు, కొనుడు తక్కువైనయ్​

తినుడు, కొనుడు తక్కువైనయ్​

న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం వల్ల తిండి ఖర్చు వేగంగా పెరుగుతున్నది. వంటనూనెలు సహా నిత్యావసరాల రేట్లు ఎక్కువగా ఉండటంతో జనం కూరగాయలను కొనడం, ఫ్రైడ్​ ఫుడ్​ను తినడం తగ్గిస్తున్నారు. రెండేళ్లపాటు కరోనా ఎఫెక్ట్​ తరువాత ఎకానమీ మెల్లమెల్లగా కోలుకుంటుండగా, యుద్ధం రూపంలో మరో దెబ్బ తప్పడం లేదు.  చాలా వస్తువుల సరఫరాలు తగ్గాయి. ధరలు పెరిగాయి. ఇండియా వంటి వినిమయ ఆధారిత ఎకానమీకి ఇట్లాంటి పరిస్థితి మంచిది కాదని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. వీటన్నింటికితోడు 137 రోజుల తరువాత పెట్రోల్​ ధరల పెరుగుదల కూడా మొదలయింది. ధరల పెరుగుదలను తట్టుకోవడం ఎలాగో తనకు అర్థం కావడం లేదని కోల్​కతాకు చెందిన ఇంద్రాణీ మజుందార్​ వాపోయారు. కరోనా వల్ల జీతాలు తగ్గిపోయాయని, ధరలు పెరిగాయని అన్నారు. ఆమె నలుగురిని పోషించాలి. వంటనూనెల వాడకాన్ని తగ్గించడానికి, ఉడికించిన తిండి తింటున్నామని చెప్పారు. చాలా కుటుంబాల యజమానులు ఇంద్రాణీ లాగే పొదుపు పెంచామని చెబుతున్నారు. గత ఏడాది అక్టోబరు–డిసెంబరు క్వార్టర్​లో అంచనాలను మించి మన జీడీపీ తగ్గింది. పెట్రో రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి కొత్త ఆర్థిక సంవత్సరంలో పరిస్థితులు బాగుండకపోవచ్చని అంటున్నారు. మన జీడీపీలో ప్రైవేట్ కన్సంప్షన్​ వాటా 60 శాతం వరకు ఉంటుంది. అయితే ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్​పై మిలిటరీ ఆపరేషన్ మొదలుపెట్టాక ఇన్​ఫ్లేషన్​ ఎక్కువ కావడంతో ఇండియాలో పాలు,   నూడుల్స్, చికెన్, ఇతర కీలక వస్తువుల ధరలు 5 శాతం నుంచి  20 శాతం వరకు పెరిగాయి. దాదాపు 140 కోట్ల జనాభాలో 80 కోట్ల మందికి కరోనా మహమ్మారి సమయంలో ఆహార పదార్థాలను ప్రభుత్వ సరఫరాలను ఉచితంగా అందించింది. మరోసారి ధరల పెరుగుదల  ఫ్యామిలీ బడ్జెట్‌‌‌‌లను దెబ్బతీస్తున్నది. ఇండ్లలో ఆర్థిక పరిస్థితులు వరుసగా మూడో సంవత్సరం కూడా ఇబ్బందికరంగానే ఉంటాయని మాజీ చీఫ్​ స్టాటిస్టిషియన్ ప్రణబ్ సేన్ హెచ్చరించారు.  
 

ఈ ఏడాది 45 శాతం పెరిగిన వంటనూనె ధర
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పీపాకు 100 డాలర్లకు పెరిగాయి. దిగుమతులపై ఎక్కువ ఆధారపడిన ఇండియా ఈ వారంలో పెట్రోల్,  డీజిల్ రిటైల్ ధరలను రెండుసార్లు పెంచింది. భారతదేశం దాని ముడి చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతి చేసుకుంటుంది. ఈ సంవత్సరం ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద వంటనూనె దిగుమతిదారు. మన అవసరాల్లో దాదాపు 60 శాతం విదేశాల నుంచే వస్తోంది. భారతీయులు అత్యధికంగా వినియోగించే వంటనూనె పామ్ ఆయిల్​ ఈ ఏడాది 45శాతం పెరిగింది. ఉక్రెయిన్ , రష్యా పెద్ద మొత్తంలో సన్‌‌‌‌ఫ్లవర్ ఆయిల్​ తయారు చేస్తాయి. యుద్ధం వల్ల సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. ధరలు పెరగడంతో గత నెలలో వంటనూనెల అమ్మకాలు పావు వంతు తగ్గాయని కొందరు హోల్​సేల్​ వ్యాపారులు తెలిపారు. అంతేగాక ఫిబ్రవరిలో రిటైల్ ఇన్​ఫ్లేషన్​ వరుసగా రెండవ నెలలో ఆరు శాతానికి పైగా ఉంది.  హోల్​సేల్​ రేటు 13శాతం కంటే ఎక్కువగా రిజిస్టర్​ అయింది. దీంతో ఆర్​బీఐ కూడా అలెర్టయింది. వచ్చే నెల మానిటరీ పాలసీ మీటింగ్​జరుగుతున్నందున, చమురు, కమోడిటీ ధరలను జాగ్రత్తగా గమనిస్తున్నామని తెలిపింది. విదేశాల్లో ఆర్​బీఐ వంటి సెంట్రల్ బ్యాంకులు ఇన్​ఫ్లేషన్​ను తట్టుకోవడానికి రేట్లను పెంచేశాయి. అమెరికా ఫెడ్​ రిజర్వ్​ బ్యాంకు కూడా మరోసారి రేట్లను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

మరో 15 శాతం పెరుగుదల..
ఇన్‌‌‌‌పుట్ ఖర్చులతోపాటు ఈ నెలలో ఇంధన ధరలు పెరగడంతో సబ్బులు, షాంపూలు, పేస్టులు తయారు చేసే  కన్స్యూమర్ డ్యూరబుల్స్  ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్​ఎంసీజీ) కంపెనీలు ధరలను మరో 10శాతం నుండి 15శాతం వరకు పెంచుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. దీంతో జనం జేబుపై భారం తప్పదని స్పష్టం చేసింది. కోల్‌‌‌‌కతాలో కూరగాయలు అమ్మే దేవాశిష్​ ధారా మాట్లాడుతూ  రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడంతో ఈ వారం కూరగాయల ధరలు మరో 5శాతం పెరిగాయని, ఫిబ్రవరి నుండి తన అమ్మకాలు  సగానికి పడిపోయాయని వివరించారు. ఇది ధారా ఒక్కడి కథే కాదు. చాలా కూరగాయల వ్యాపారాలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి చెందిన మదర్ డెయిరీ  అమూల్ ఈ నెలలో పాల ధరలను దాదాపు 5శాతం పెంచగా, హిందుస్థాన్ యూనిలీవర్,  నెస్లే వంటి ఎఫ్‌‌‌‌ఎంసిజి కంపెనీలు ఇన్‌‌‌‌స్టంట్ నూడుల్స్, టీ  కాఫీ వంటి వస్తువుల రేట్లను మరోసారి పెంచాయి. బ్రాయిలర్ చికెన్ ధరలు గత ఆరు నెలల్లో దాదాపు 45శాతం పెరిగి ఈ వారం రికార్డు స్థాయిలో రూ.145 (1.90 డాలర్లకు)కి చేరాయి. కోళ్లదాణాగా వాడే మొక్కజొన్న,  సోయామీల్ దిగుమతులు తగ్గడమే ఇందుకు కారణం. యుద్ధం వల్ల ఎరువుల ధరలు రికార్డు స్థాయిలో టన్నుకు 150 డాలర్లకు  పెరిగాయి.  ముంబైలో ఉండే అర్చన పవార్ మాట్లాడుతూ, తమ నెలవారీ బడ్జెట్‌‌‌‌ను నిర్వహించడం చాలా కష్టంగా మారిందని, ధరల పెరుగుదల వల్ల అన్ని వస్తువుల వాడకాన్ని తగ్గించుకుంటున్నామని వివరించారు.