
Digital Payments: భారతదేశంలోని కోట్ల మంది ప్రజలు నిరంతరం తమ రోజువారీ చెల్లింపుల కోసం యూపీఐ సహా ఇతర డిజిటల్ చెల్లింపులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇవి వేగవంతమైన, సులభమైన మార్గం కావటం మారుమూల పల్లెల్లో కూడా వ్యాప్తికి దారితీసింది. అయితే వీటి భద్రత విషయంలో కొందరు వినియోగదారులు చేస్తున్న పొరపాట్లు, తప్పులు సైబర్ నేరగాళ్ల మోసాలకు ఆసరాగా మారుతున్నాయి. అందుకే దేశంలోని ప్రజలు తమ డిజిటల్ చెల్లింపు లావాదేవీలను సురక్షితంగా నిర్వహించటానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 5 గోల్డెన్ రూల్స్ సూచించింది.
1. ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు స్క్రీన్‌పైన కనిపించే పేర్లను తనిఖీ చేయటం మర్చిపోకండి. మీరు ఎవరికి డబ్బు పంపిస్తున్నారో.. వారి బ్యాంకింగ్ వివరాలే స్క్రీన్ మీద ఉందో లేదో సరిచూసుకోండి. కంగారులో తొందరపడి పేమెంట్ చేయటం కొన్నిసార్లు తప్పుడు చెల్లింపులకు దారితీసే అవకాశం ఉంటుంది.
2. ప్రజలు ఎప్పుడూ గుర్తింపు పొందిన.. ఆథరైజ్డ్ యాప్‌లు లేదా వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే తమ డిజిటల్ పేమెంట్స్ చేయటం మంచిదని ఎన్పీసీఐ సూచించింది. ఇతరులు పంపే లింకుల ద్వారా యాప్‌లను డౌన్‌లోడ్ చేయటం.. లింక్స్ యాక్సెస్ చేయటం ఆర్థిక నష్టాలకు దారితీసే ప్రమాదాన్ని కలిగిస్తుందని గుర్తుంచుకోండి.
3. యూపీఐ పిన్, ఓటీపీ, బ్యాంక్ వివరాలు, సీవీవీ నంబర్లు, క్రెడిట్ డెబిట్ కార్డ్ నంబర్లను గోప్యంగా ఉంచుకోవాలి. ఎవరైనా కాల్ చేసి తాము బ్యాంక్ నుంచి ఫోన్ చేశామని నమ్మించే ప్రయత్నం చేసి ఈ వివరాలు అడిగితే అస్సలు షేర్ చేయకండి. కొందరు నేరస్తులు ప్రభుత్వ అధికారులు, ఆదాయపు పన్ను అధికారులం అంటూ మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి. పర్సనల్ బ్యాంకింగ్ వివరాలు ఎట్టిపరిస్థితుల్లోనూ వారితో షేర్ చేయెుద్దు.
4. వెంటనే పేమెంట్ చేయాలని లేదా బ్యాంకింగ్ వివరాలను అత్యవసరంగా ఇవ్వాలని ఎవరైనా మిమ్మల్ని తొందరపెడితే, కంగారుపడకండి. కాస్త సమయం తీసుకుని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నాకే ప్రొసీడ్ అవ్వండి.
5. ఇక చివరిగై డిజిటల్ పేమెంట్స్ చేసే వ్యక్తులు చెల్లింపులకు సంబంధించిన ఎస్ఎంఎస్, యాప్ నోటిఫికేషన్‌లను ఎప్పుడూ ఆన్ చేసి ఉంచండి. ప్రతి అలర్ట్‌ను జాగ్రత్తగా చదవండి. ఏదైనా తేడాగా అనిపిస్తే, వెంటనే మీ బ్యాంక్ లేదా పేమెంట్ యాప్‌ను సంప్రదించండి.
ALSO READ : టెస్లా కారు చైనాలో 35 లక్షలు.. అదే ఇండియాలో మాత్రం 70 లక్షలు.. ధరలో ఎందుకింత తేడా..?
అనుమానాస్పద నంబర్లు కనిపించినప్పుడు లేదా అలాంటి నంబర్ల నుంచి కాల్స్ వచ్చినప్పుడు వెంటనే నేషనల్ సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి కంప్లెయింట్ చేయండి. లేదా టెలికమ్యూనికేషన్స్ విభాగానికి (https://sancharsaathi.gov.in/sfc/) ఫిర్యాదు చేయవచ్చు. మీరు ఫిర్యాదు చేయాల్సి వస్తే, దర్యాప్తుకు సహాయపడటానికి మెసేజ్‌లను సేవ్ చేసుకోండి, స్క్రీన్‌షాట్‌లు తీసుకోండి, ఫోన్ కాల్ రికార్డులను సేవ్ చేసి పెట్టుకోండి.