Narivetta Review: ఓటీటీలో దూసుకెళ్తోన్న రియల్ ఇన్సిడెంట్ థ్రిల్లర్.. ‘నరివేట్ట’ ఎందుకు చూడాలంటే?

Narivetta Review: ఓటీటీలో దూసుకెళ్తోన్న రియల్ ఇన్సిడెంట్ థ్రిల్లర్.. ‘నరివేట్ట’ ఎందుకు చూడాలంటే?

లేటెస్ట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ నరివెట్ట (Narivetta) సోనీ లివ్ ఓటీటీలో దూసుకెళ్తోంది. గురువారం (జూలై 10న) స్ట్రీమింగ్కు వచ్చిన ఈ మూవీ ఆడియన్స్కు వీపరీతంగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..

నరివెట్ట మూవీలో టొవినో థామస్‌‌, సూరజ్‌‌ వెంజరమూడి కీలక పాత్రల్లో నటించారు. 2025 మే 23న థియేటర్లలో రిలీజై విమర్శకుల ప్రశంసలు పొందింది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. రూ.10 కోట్ల బడ్జెట్తో నరివెట్ట తెరకెక్కగా.. సుమారు రూ.30 కోట్ల వరకూ వసూలు చేసింది.

కథేంటంటే:

వర్గీస్ పీటర్‌‌ (టొవినోథామస్) తల్లి టైలరింగ్ చేస్తూ అతన్ని చదివిస్తుంది. ఎలాగైనా గవర్నమెంట్‌‌ జాబ్‌‌ సాధాంచాలని ప్రయత్నాలు చేస్తుంటాడు వర్గీస్‌. చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చినా.. చేరడానికి ఇష్టపడడు. తల్లికి వయసు మీదపడడంతో ఏదైనా ఉద్యోగం చూసుకోమని వర్గీస్‌‌కు పదే పదే చెప్తుంటుంది. పైగా అతను ప్రేమించిన నాన్సీ (ప్రియంవద కృష్ణన్) తండ్రి కూడా కూతురుని ఉద్యోగం ఉన్నవాడికే ఇచ్చి పెండ్లి చేస్తానని చెప్తాడు. 

దాంతో వర్గీస్‌‌కు ఇష్టం లేకపోయినా పోలీస్ కానిస్టేబుల్‌‌ ఉద్యోగంలో చేరతాడు. అక్కడే అతడికి హెడ్‌‌ కానిస్టేబుల్‌‌ బషీర్‌‌ (సూరజ్‌‌ వెంజరమూడి) పరిచయం అవుతాడు. ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడుతుంది. అదే టైంలో వర్గీస్‌‌, బషీర్‌‌ తమ టీంతో కలిసి గిరిజనులు వయనాడ్‌‌ అడవిలో ఇళ్ల కోసం ఉద్యమం చేస్తున్న ప్లేస్‌‌కి బందోబస్తుకు వెళ్తారు. ఆ అల్లర్లలో బషీర్‌‌‌‌ చనిపోతాడు. తర్వాత ఏం జరిగింది? అతని చావుకు కారణం ఏంటి? ఈ కుట్రలో భాగమైన వాళ్లు ఎవరు అన్నదే తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నరివేట్ట ఎందుకు చూడాలంటే?

2003లో కేరళలో జరిగిన ముత్తాంగ ఘటన ఆధారంగా అనురాజ్‌‌ మనోహర్‌‌ ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ సెన్సిటివ్ ఇస్యూ 22 ఏళ్ల కిందట దేశవ్యాప్తంగా సంచనలనం రేపింది. ఇలాంటి అంశాన్ని తీసుకుని డైరెక్టర్ పెద్ద సాహసమే చేశాడు. ఇందులో పోలీసుల దౌర్జన్యాన్ని, అమాయకులైన ఆదివాసీలపై జరిగిన పోలీసుల కాల్పుల అకృత్యాలను కళ్లకు కట్టేలా చూపించాడు.

ALSO READ : Jr NTR : ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ అప్‌డేట్.. 

ఓ సాధారణ కానిస్టేబుల్.. మొత్తం వ్యవస్థనే ఎదిరించి ఓ పెద్ద కుట్రను బయటపెట్టిన తీరును చక్కగా చూపించారు. నాటి న‌ర మేథం దృశ్యాల‌ను నరివెట్టలో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూయించ‌డంతో.. సినిమా చూసిన వారంతా భావోద్వేగాల‌కులోన‌య్యారు. 

ముతంగ నిరసన:

ముతంగ నిరసన అనేది కేరళలో జరిగిన ఒక సంఘటన. ఈ నిరసన 48 రోజుల పాటు కొనసాగింది. కేరళలోని వయనాడ్ జిల్లాలోని ముతంగ గ్రామంలో ఆదివాసీలపై (గిరిజన వంశాలు) పోలీసులు కాల్పులు జరిపారు. 2001 అక్టోబర్‌లో ఒప్పందం కుదుర్చుకున్న భూమిని తమకు కేటాయించడంలో కేరళ ప్రభుత్వం జాప్యం చేయడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 19, 2003న ఆదివాసీలు 'ఆదివాసీ గోత్ర మహా సభ' (AGMS) ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. 

నిరసన సందర్భంగా, కేరళ పోలీసులు విచక్షణారహితంగా 18 రౌండ్లు కాల్పులు జరిపారు. ఫలితంగా ఇద్దరు స్పాట్ లోనే మరణించారు (అందులో ఒకరు పోలీసు అధికారి). ఆ తర్వాతి ప్రకటనలో, ప్రభుత్వం అధికారిక మరణాల సంఖ్యను ఐదుగా వెల్లడించింది. ఇది కేరళలో గిరిజన భూ హక్కులు మరియు సంక్షేమానికి సంబంధించి గణనీయమైన విధాన మార్పులకు దారితీసింది.