సహాయక చర్యలు బాధితుల్లో ధైర్యం కలిగించాలి

 సహాయక చర్యలు బాధితుల్లో ధైర్యం కలిగించాలి
  • వరద సహాయక చర్యలపై అధికారులతో జగన్ 

అమరావతి: ‘అకాల వర్షాలు, వరదలతో బాధితులకు జరిగిన నష్టం అపారం... కొందరికి తీర్చలేనిలోటు... కష్టాల్లో దిక్కుతోచక విలవిలలాడే బాధితులకు అధికారులు సహాయక చర్యలతో కొండంత ధైర్యం కల్పించండి..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ చర్యలపై కలెక్టర్లు, అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు ఇప్పటి వరకు 40 మంది చనిపోయారని, అలాగే 196 మండలాల పరిధిలోని 1402 గ్రామాల్లో అపార ఆస్తి నష్టం జరిగిందని సమాచారం అందిందన్నారు. 
వరద బాధిత ప్రాంతాల్లో రెండు హెలికాఫ్టర్లతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని జగన్ వివరించారు. 324 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 70 వేల మందికి పునరావాసం కల్పించామని.. అధికారులు వివరించగా.. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలన్నారు. బాధితుల కష్టాలు, కన్నీళ్లు తుడిచి వారు తిరిగి మామూలు జీవితం సాగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.

సీఎం జగన్ నిర్వహించిన ఈ సమీక్షలో చీఫ్ సెక్రెటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, సివిల్‌ సఫ్లైస్‌ కమిషనర్‌ ఎం గిరిజా శంకర్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ఎం ఎం నాయక్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.