స్వలింగ వివాహాలపై నిర్ణయం పార్లమెంటే తీస్కోవాలె

స్వలింగ వివాహాలపై నిర్ణయం పార్లమెంటే తీస్కోవాలె

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల(గేస్, లెస్బియన్స్) పెండ్లిళ్లకు చట్టబద్ధతపై పార్లమెంట్ వేదికగానే చర్చించి, నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం సరికాదని తెలిపింది. సేమ్ సెక్స్ మ్యారేజెస్ కు చట్టబద్ధతను కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణను ప్రారంభించింది.

కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. కొత్త సామాజిక సంబంధాల ఏర్పాటు (సేమ్ సెక్స్ మ్యారేజ్) వంటి వాటిపై చర్చించి, నిర్ణయం తీసుకునే అధికారం పార్లమెంటుదేనని స్పష్టం చేశారు. ఈ అంశంపై కోర్టులు నిర్ణయం తీసుకోవచ్చన్న వాదనను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. అయితే, కోర్టులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది ఎవరూ చెప్పనక్కర్లేదని సీజేఐ అన్నారు. ఈ అంశంపై ముందుగా వాదనలు వింటామని స్పష్టం చేశారు.