రఘురామకృష్ణరాజు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు

 రఘురామకృష్ణరాజు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు
  • బెయిల్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా
  • వైద్య పరీక్షలకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి పంపాలని ఆదేశం

న్యూఢిల్లీ: ఏపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ పిటిషన్ పై విచారణపై సుప్రీంకోర్టులో తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు కొట్టి హింసించారని, సీఐడీ కోర్టు వైద్య పరీక్షలు చేయాలని ఆదేశిస్తే.. ప్రభుత్వ ఒత్తిడికి లొంగి కొట్టలేదన్నట్లు నివేదిక సమర్పించారని రఘురామ తరపు న్యాయవాదులు ఆరోపించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్ష నిమిత్తం  సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి పంపాలని, తమ ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ కు, ఏపీ చీఫ్ సెక్రెటరీలకు ఆదేశాలిచ్చింది. వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యుడీషియల్ అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలిచ్చింది. వైద్య పరీక్షల ఖర్చును నిందితుడు రఘురామనే భరించాలని..  వైద్య పరీక్షల ప్రక్రియను మొత్తం వీడియో గ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్ లో తమకు ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం వైద్య పరీక్షలకు మాత్రమే అనుమతివ్వాలని, ఆసుపత్రిలో ఉండేందుకు అనుమతివ్వొద్దని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు బెయిల్ పిటిషన్ ను శుక్రావారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈలోగా అంటే గురువారంలోగా తమకు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సీఐడీకి ఆదేశాలిచ్చింది.