
- దీనికోసం సిట్‌ను ఏర్పాటు చేయండి
- తెలంగాణ, ఏపీతోపాటు అన్ని రాష్ట్రాలు/ యూటీలకు సుప్రీం ఆదేశాలు
- పుణెలోని ‘కోంధ్వా బుద్రుక్’ కేసులో తాజాగా సీజేఐ బెంచ్ తీర్పు
- కంచ గచ్చిబౌలి సుమోటో పిటిషన్ విచారణ సందర్భంగా ఈ కేసును ప్రస్తావించిన సీజేఐ బీఆర్ గవాయ్
న్యూఢిల్లీ, వెలుగు: రెవెన్యూ నియంత్రణలో ఉన్న ఫారెస్ట్ ల్యాండ్స్‌ను గుర్తించాలని తెలంగాణ, ఏపీ సహా దేశంలోని అన్ని రాష్ట్రాలు/యూటీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ బాధ్యత సీఎస్ లు, కేంద్ర పాలిత ప్రాంతాల నిర్వాహకులకు అప్పగించింది. దీనికోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ను ఏర్పాటు చేయాలని తీర్పులో స్పష్టం చేసింది. రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ను ఏదైనా అటవీయేతర ప్రయోజనాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు లేదా సంస్థలకు చట్టవిరుద్ధంగా కేటాయించారా? అనే అంశాన్ని సిట్ పరిశీలించాలని పేర్కొన్నది.
పుణెలోని ‘కోంధ్వా బుద్రుక్’భూమి (టీఎన్ గోదావర్మన్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్) కేసులో తాజాగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. మహారాష్ట్రలోని పుణెలో 11.89 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని హౌసింగ్ సొసైటీ - ‘రిచీ రిచ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్’ (ఆర్ఆర్ సీహెచ్ఎస్) కు అక్రమంగా కేటాయింపులు చేశారనే ఆరోపణలపై 1999 అక్టోబర్‌లో కేసు నమోదైంది. దాదాపు 25 ఏండ్లు ఈ కేసు విచారణ కొనసాగింది.
సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు
సుధీర్ఘ వాదనల తర్వాత అటవీ భూముల పరిరక్షణకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రెవెన్యూ శాఖ నియంత్రణలో ఉన్న ఏదైనా అటవీ భూమిని అటవీయేతర ప్రయోజనాల కోసం ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలకు కేటాయించారా? అని దర్యాప్తు చేయడానికి ప్రత్యేకంగా సిట్ బృందాలను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాల సీఎస్ లను ఆదేశించింది. ఆ భూములను స్వాధీనం చేసుకుని తిరిగి అటవీ శాఖకు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాకపోతే, లబ్ధిదారుల నుంచి భూమి ధరను వసూలు చేయాలని, ఆ నిధులను ప్రత్యేకంగా అటవీ అభివృద్ధికి ఉపయోగించాలని తెలిపింది.
ఈ ప్రక్రియ అంతా ఏడాదిలోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అలాగే, పొలిటికల్ లీడర్లు, బ్యూరోక్రాట్లు, బిల్డర్ల మధ్య అనుబంధం.. పునరావాసం పేరుతో ఫారెస్ట్ ల్యాండ్ లను వాణిజ్య ప్రయోజనాల కోసం ఎలా మారుస్తుందో చెప్పడానికి ఈ కేసు ఒక అద్బుతమైన ఉదాహరణ అని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, తెలంగాణకు సంబంధించిన కంచ గచ్చిబౌలి సుమోటో కేసు విచారణ సందర్భంగానూ ఈ కేసును పలుమార్లు సీజేఐ బీఆర్ గవాయ్ ప్రస్తావించారు. దాదాపు 2 దశాబ్దాలకు పైగా పుణెలోని అటవీ భూముల కేసు దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నదని నాడు పేర్కొన్నారు.