జైళ్లలో అర్హులైన ఖైదీలందరినీ విడుదల చేయండి: సుప్రీం కోర్టు

జైళ్లలో అర్హులైన ఖైదీలందరినీ విడుదల చేయండి: సుప్రీం కోర్టు
  • ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసరంగా అరెస్టులు చేయొద్దు
  • జైళ్లలో భారం వెంటనే తగ్గించండి
  • గత ఏడాది తాత్కాలిక బెయిల్ పొందిన వారినందరినీ విడుదల చేయాలి: సుప్రీం కోర్టు 

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సునామీలా విరుచుకుపడుతున్న పరిస్థితులను గుర్తించి జైళ్లలో ఖైదీల పరిస్థితిపై సుప్రీంకోర్టు స్పందించి కీలకమైన ఆదేశాలిచ్చింది. అర్హులైన వారినందరినీ విడుదల చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అర్నేష్‌కుమార్‌ కేసులో తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు మహమ్మారి ఉధృతమవుతున్న ప్రస్తుత సమయంలో అరెస్ట్‌లను తగ్గించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే తప్ప అరెస్ట్‌లు చేయొద్దని స్పష్టం చేసింది. 2020లో తాత్కాలిక బెయిల్ పై విడుదలైన వారినందరినీ ఇప్పుడు కూడా విడుదల చేయాలని సూచించింది.  గత ఏడాది కరోనా సమయంలో విడుదల చేసిన ఖైదీల్లో దాదాపు 90 శాతం మంది మళ్ళీ జైళ్ళకు వచ్చిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. జైళ్లలో ఉన్న ఖైదీలు, పోలీసుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే దేశంలోని జైళ్లలో నాలుగు లక్షలకు మంది ఖైదీలు ఉన్నారని ప్రస్తావించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ, జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ సూర్య కాంత్‌లతో కూడిన బెంచ్‌ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఏడు సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ శిక్ష పడే కేసులలో రొటీన్‌గా అరెస్ట్‌లు చేయొద్దని పేర్కొంది. రాష్ట్రాల్లో ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఖైదీలను పరిశీలించి తాత్కాలిక బెయిలు కింద విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.