ప్రభుత్వ హోదాల్లో ఉన్న వాళ్లు స్వీయ నియంత్రణ పాటించాలి

ప్రభుత్వ హోదాల్లో ఉన్న వాళ్లు స్వీయ నియంత్రణ పాటించాలి
  • ప్రత్యేకంగా కోడ్​ ఆఫ్​ కాండక్ట్​ అక్కర్లేదు: సుప్రీం
  • ఓ మంత్రి వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించలేం..
  • ప్రభుత్వ హోదాల్లో ఉన్న వాళ్లు స్వీయ నియంత్రణ పాటించాలి
  • రేప్ కేసులో ఆజం ఖాన్ వ్యాఖ్యలపై 4:1 మెజారిటీతో కాన్‌‌స్టిట్యూషన్ బెంచ్ తీర్పు
  • మెజారిటీ తీర్పుతో మరోసారి విభేదించిన జస్టిస్ నాగరత్న

న్యూఢిల్లీ: ప్రజా ప్రతినిధుల భావ ప్రకటనా స్వేచ్ఛపై అదనపు ఆంక్షలు విధించలేమని సుప్రీంకోర్టు చెప్పింది. ‘సమష్టి బాధ్యత’ సూత్రాన్ని వర్తింపజేసినప్పటికీ.. ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలను మొత్తం ప్రభుత్వానికి ఆపాదించలేమని స్పష్టంచేసింది. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) కింద ప్రస్తావించినవి తప్ప.. ఇంకే అదనపు రిస్ట్రిక్షన్లను ప్రజా ప్రతినిధుల భావ ప్రకటనా స్వేచ్ఛపై విధించలేం. అయితే ప్రభుత్వ హోదాల్లో ఉన్న వాళ్లు స్వీయ నియంత్రణ పాటించాలి. దేశంలోని ఇతర వ్యక్తులను కించపరిచే లేదా అవమానించే మాటలు మాట్లాడకూడదు. ఈ విధానం మన రాజ్యాంగ సంస్కృతిలోనే భాగం. ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేకంగా కోడ్ ఆఫ్ కండక్ట్ రూపొందించాల్సిన అవసరం లేదు” అని వివరించింది. గతంలో యూపీ మంత్రిగా ఉన్నప్పుడు ఆజం ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌‌పై 4:1 మెజారిటీతో కాన్‌‌స్టిట్యూషన్ బెంచ్ తీర్పు చెప్పింది. అయితే మెజారిటీ బెంచ్‌‌తో జస్టిస్ నాగరత్న మరోసారి విభేదించారు. మంత్రి చేసిన ప్రకటనను ప్రభుత్వానికి ఆపాదించలేమని జస్టిస్ ఎస్‌‌ఏ నజీర్, జస్టిస్ బీర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్ ప్రత్యేక తీర్పులో పేర్కొన్నారు. జస్టిస్ నాగరత్న మాత్రం.. ఒక మంత్రి ‘అధికారిక హోదా’లో అవమానకర ప్రకటనలు చేసి ఉంటే.. అలాంటి ప్రకటనను ప్రభుత్వానికి ఆపాదించవచ్చని తన తీర్పులో స్పష్టం చేశారు. అయితే ఆర్టికల్ 19 కింద ఉన్న వాటికి అదనంగా ఆంక్షలు విధించలేమని జస్టిస్ నాగరత్న కూడా అంగీకరించారు.

అసలేంటీ కేసు..

2016 జులైలో ఉత్తరప్రదేశ్‌‌లోని బులంద్ షహర్‌‌‌‌లో హైవేపై తల్లీకూతుళ్లను గ్యాంగ్ రేప్ చేశారు. అయితే ఈ ఘటనను ‘రాజకీయ కుట్ర’ అని నాటి మంత్రి ఆజం ఖాన్ కామెంట్ చేయడం దుమారం రేపింది. తన భార్యాపిల్లలపై జరిగిన సామూహిక అత్యాచారంపై అలాంటి వ్యాఖ్యలు చేసిన మంత్రిపై బాధితుడు కేసు పెట్టాడు. రేప్ కేసు విచారణను ఢిల్లీకి ట్రాన్స్‌‌ఫర్ చేయాలని పిటిషన్ వేశాడు. దీనిపై సుప్రీం కాన్‌‌స్టిట్యూషన్ బెంచ్ విచారణ జరిపి.. నవంబర్ 15న తన తీర్పును రిజర్వ్ చేసింది.

విద్వేష ప్రసంగాలు విలువలను దెబ్బతీస్తయ్: జస్టిస్ నాగరత్న

విద్వేష ప్రసంగం.. మన రాజ్యాంగ మూల విలువలను దెబ్బతీస్తుందని జస్టిస్ బీవీ నాగరత్న అన్నారు. అనాలోచితంగా చేస్తున్న ప్రసంగాలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఇవి బాధించేవి, అవమానించేవని అన్నారు. అలానే వివిధ వర్గాలకు చెందిన ప్రజల మధ్య సోదరభావాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు. ‘‘ప్రజా ప్రతినిధులు, ప్రజలను ప్రభావితం చేయగల ఇతర వ్యక్తులు.. తమ ప్రసంగాల్లో మరింత బాధ్యతగా, నియంత్రణతో వ్యవహరించాలి. ప్రజల మనోభావాలు, ప్రవర్తనపై అవి చూపే ప్రభావాలను వాళ్లు అర్థం చేసుకోవాలి. కోడ్ ఆఫ్ కండక్ట్‌‌ను రూపొందించడం ద్వారా తమ మంత్రులు చేసే ప్రసంగాలను పార్టీ నియంత్రించవచ్చు. ప్రజా ప్రతినిధులు చేసిన విద్వేష ప్రసంగాల వల్ల దాడికి గురయ్యామని పౌరులు భావిస్తే.. కోర్టులను ఆశ్రయించవచ్చు. ప్రజలకు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు అవమానకర వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించేందుకు పార్లమెంట్ తన విజ్ఞతతో చట్టం రూపొందించాలి” అని తన తీర్పులో పేర్కొన్నారు. 2016లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ కాన్‌‌స్టిట్యూషన్‌‌ బెంచ్‌‌లోని నలుగురు జడ్జిలు రెండు రోజుల కిందట తీర్పునివ్వగా.. జస్టిస్ నాగరత్న మాత్రం విభేదించారు.