
ఇంటర్నేషనల్ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన నీట్ పేపర్ లీకైందని.. పరీక్ష రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఇవాళ(సోమవారం) విచారణ చేపట్టింది. నీట్-2021 లీకైందని, మాల్ ప్రాక్టీసు కూడా జరిగిందని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. నీట్ ను రద్దు చేసి.. మరోసారి పరీక్ష నిర్వహించాలని, కష్టపడి చదివిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఆ పిటిషన్లలో కోరారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
పేపర్ లీకైందన్న కారణంతో నీట్ రద్దు చేయాలనడం సరైంది కాదని.. నీట్ కు దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు హాజరైన విషయాన్ని గుర్తించాలని ధర్మాసనం పిటిషనర్లకు హితవు పలికింది. ఆ విద్యార్థుల భవిష్యత్ ను కూడా లెక్కలోకి తీసుకోవాలని చెప్పింది. ఈ క్రమంలో ఆయా పిటిషన్లను కొట్టివేసింది. అంతేకాదు.. మరోసారి ఇలాంటి పిటిషన్లతో వస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది సుప్రీం.