- రోడ్డు ప్రమాదాలపై నివారణకు యాక్షన్ ప్లాన్
- రోడ్ సేఫ్టీ కమిటీల ఏర్పాటు
సూర్యాపేట, వెలుగు: రోడ్డు ప్రమాదాలకు చెక్‌పెట్టేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్‌స్పాట్స్‌లను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ పెడుతోంది. ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న రోడ్డు భద్రతా కమిటి సమావేశాలు ప్రతీ నెల నిర్వహించనున్నారు. ఎస్పీతో పాటు హైవే అథారిటీ ఆఫీసర్లు, ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్‌పోర్టు, ఎన్‌పీడీసీఎల్, మెడికల్‌అండ్‌హెల్త్, ఫారెస్టు, అగ్రికల్చర్, మున్సిపల్‌అధికారులు ఈ సమావేశానికి హాజరై.. తమ శాఖల పరిధిలో చేపట్టవలసిన పనులపై దృష్టి పెడతారు. ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. గ్రామ స్థాయి నుంచి రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేస్తారు.
బ్లాక్‌స్పాట్స్ పై స్పెషల్ ఫోకస్
జిల్లా మీదుగా 65వ నంబరు నేషనల్‌హైవే పోతోంది. దీనికి తోడు ప్రధాన పట్టణాలను లింక్ చేస్తున్న స్టేట్హైవేలున్నాయి. గత జనవరి నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాలో 106 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 36 మంది చనిపోయారు. 140 మందికి గాయాలు కాగా వీరిలో వంద మంది వరకు ఇంకా కోలుకోకపోవడంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 2024లో జిల్లాలో 87 ప్రమాదాలు జరగ్గా 100 మంది గాయపడ్డారు. 49 మంది చనిపోయారు. జిల్లాలో మొత్తం 43 బ్లాక్‌స్పాట్స్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా చూసేందుకు అధికారులు 43 రూరల్ రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో లోకల్ పోలీసు అధికారి, రిటైర్డ్ టీచర్లు, గ్రామ పెద్దలు, మహిళలు, వ్యాపారవేత్తలు, సోషల్ వర్కర్లు, యువకులు, రవాణా శాఖ ప్రతినిధులు మెంబర్లుగా ఉంటారు.
సమస్యల పరిష్కారంపై దృష్టి
ఇటీవల కలెక్టరేట్‌లో జరిగిన రివ్యూలో ప్రమాదాల నివారణపై అన్ని శాఖల అధికారులతో రివ్యూ చేశారు. అవసరమైన చోట్ల రోడ్ల విస్తరణ, ప్రమాదాల నివారణ చర్యల కోసం అందుబాటులో ఉన్న నిధుల గురించి చర్చించారు.హైవేలపై స్పీడ్ కంట్రోల్ చేసేందుకు బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. స్పీడ్‌గన్స్‌ఏర్పాటు చేసి ఫెనాల్టీలు విధించాలని ప్లాన్ చేస్తున్నారు.
భద్రతానియమాలు పాటించాలి
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాం. పోలీసు శాఖ ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించి జాగ్రత్తలు చేపట్టాం. ప్రమాదాల నివారణకు అధికారులతో పాటు ప్రజల భాగస్వామ్యం అవసరం. రోడ్డు భద్రత కమిటీల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. అందరూ రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలి. నరసింహ, ఎస్పీ, సూర్యాపేట జిల్లా
