వ్యక్తిని చంపి.. యాసిడ్ పోసి.. హత్యకేసులో 9 మంది రిమాండ్

వ్యక్తిని చంపి.. యాసిడ్ పోసి.. హత్యకేసులో 9 మంది రిమాండ్
  • వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ

 సూర్యాపేట, వెలుగు: భార్యను హత్య చేసిన కేసులో కోర్టు వాయిదాకు వెళ్లి వస్తుండగా సత్యనారాయణ అనే వ్యక్తిని బంధువులు కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.  సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపిన వివరాల ప్రకారం..  దుబాయిలో ఉద్యోగం చేసే భార్య ఝాన్సీ రాణిపై అనుమానం పెంచుకున్న సత్యనారాయణ, 2023లో హైదరాబాద్‌లో బోయిన్‌పల్లి పరిధిలో ఆమెను దారుణ హత్య చేశాడు. ఈ సమయంలో అడ్డుగా వచ్చిన బావమరిది భార్యను గాయపరచాడు. సత్యనారాయణ బెయిల్‌పై విడుదలైన తర్వాత, , కిరణ్, అతని పెద్ద అక్క, మిగతా కుటుంబ సభ్యులు, బంధువులు పథకం ప్రకారం సత్యనారాయణను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 14న హైదరాబాద్‌లో కోర్టుకు వెళ్ళి వస్తున్న సత్యనారాయణను కారులో కిడ్నాప్ చేశారు. 

గొంతుపై కాలు పెట్టి ఊపిరి తీసుకోకుండా చేసి హత్య చేశారు. మృతదేహాన్ని ఖమ్మం జాతీయ రహదారి పక్కన చిన్న కాలువలో పడవేసి, గుర్తు పట్టకుండా యాసిడ్ పోసి పారిపోయారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులు గెల్లా కిరణ్, చీకురుమెల్లి మాధవరావు, దొండపాటి విశ్వనాధం, చీకురుమల్లి శివకుమార్, చీకురుమల్లి మౌనిక, చీకురుమల్లి అమ్మాజీ, నేతల సర్వేశ్వరరావు, గిడ్డి రమేష్, గెల్లా షీలాలను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.  కార్లు, తాళ్లు, ఖాళీ యాసిడ్ కంటెయినర్, 10 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్, రూరల్ సీఐ, పీఎస్‌ఐలు కేసు విచారణలో కీలక పాత్ర పోషించి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.