
హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తున్న తమన్నా.. మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తోనూ ఆకట్టుకుంటోంది. తాజాగా ‘స్త్రీ 2’ అనే హిందీ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్‌లో మెరవబోతోంది. రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘భేదియా’ ఫేమ్ అమర్ కౌశిక్ దర్శకుడు. పంకజ్ త్రిపాఠి కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం వచ్చి సూపర్ సక్సెస్ సాధించిన హారర్ థ్రిల్లర్ ‘స్త్రీ’కి ఇది సీక్వెల్. శనివారం టీజర్‌ను విడుదల చేశారు.
‘ఓ స్త్రీ రేపు రా’ అంటూ ఫస్ట్ పార్ట్‌లో భయపెట్టిన దెయ్యం మళ్లీ వస్తోందంటూ టీజర్‌లో చూపించారు. శ్రద్దతో పాటు రాజ్ కుమార్ రావ్ నటన ఆకట్టుకుంది. ఇక తమన్నా స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన విజువల్స్‌ను కూడా ఇందులో చూపించారు. ‘జైలర్’లోని ‘వా.. నువ్వు కావాలయ్య’ పాటతో ఇంప్రెస్ చేసిన తమన్నా.. ఇటీవల ‘డాక్’ అనే హారర్ థ్రిల్లర్‌లో ఆత్మగా కనిపించింది. ఈ మూవీ కోసం రాశీఖన్నాతో కలిసి తమన్నా చేసిన ప్రమోషనల్ సాంగ్ సినిమాకు ఎంతో హెల్ప్ అయింది. అదే తరహాలో ‘స్త్రీ 2’కు కూడా తమన్నా గ్లామర్ ప్లస్ అవుతుందని భావిస్తున్నారు మేకర్స్. ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది.